ఏపీ 39టీవీ 09 ఫిబ్రవరి 2021:
హైదరాబాద్ : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.గత కొద్ది రోజులుగా షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఆ ప్రచారానికి ఊతం ఇచ్చేలా షర్మిల ఇంటి ఎదుట “మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట.. వైఎస్ ఆర్ కుటుంబానికి తెలుసంటూ” భారీగా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ఫ్లెక్సీల ఏర్పాటుతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు కొత్త పార్టీకి సంబంధించి మరో 30 రోజుల్లో కార్యక్రమాల్ని పూర్తి చేసేలా షర్మిల వైఎస్ అభిమానులతో చర్చించనున్నారు. దీంతో పాటు వైసీపీకి ఆంధ్ర ముద్ర ఉన్నందునే కొత్త పార్టీ పేరుతో తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పేరు ఎలా ఉంటుందనే అంశం గురించి షర్మిల ఇప్పటికే పలువురు ప్రముఖులతో చర్చించారని, ఆ చర్చల్లో తొలత ” వైఎస్ఆర్ తెలుగు పార్టీ” అని పెట్టాలని భావించారట. కానీ వైఎస్ఆర్ తెలుగు పార్టీ అంటే వ్యతిరేకత వ్యక్తమవుతుందని సలహా ఇవ్వగా.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పేరును షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే షర్మిల ప్రకటన దాకా ఎదురు చూడాల్సి ఉంది.