బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పైడి రాకేశ్ రెడ్డి
టిప్పర్‌లతో ఢికొట్టే.. బెదిరించే రాజకీయాలను అరికట్టేందుకే రాజకీయాల్లోకి..
- మీడియాతో పైడి రాకేశ్‌రెడ్డి..
ఢిల్లీ, జూన్ 1 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, నైన్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పైడి రాకేశ్‌రెడ్డి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో గురువారం తెలంగాణ బీజేపీ పార్టీ ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ పార్టీ కండువా కప్పిన తరుణ్ చుగ్ … రాకేశ్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీ జాతీయ నాయకుడు సునీల్ బన్సాల్, నైన్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్, పైడి సుచరిత రెడ్డి , పైడి రాకేశ్ రెడ్డి సతీమణి రేవతి రెడ్డి, ఆలూర్ విజయ భారతి తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్లతో ఢికొట్టి చంపే రాజకీయాలకు స్వస్తీ పలికేందుకే..
ఈ సందర్బంగా రాకేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సబ్బండవర్ణాలు ప్రాణాలొడ్డి తెలంగాణ సాధించుకున్నది.. కుటుంబ పాలన కోసం కాదన్నారు. ఇది దొరల తెలంగాణ అని, బడుగు, బలహీనవర్గాల, పేదల అభ్యున్నతికి పాటుపడే తెలంగాణ కావాలని ఆయన ఆకాంక్షించారు. టిప్పర్లతో ఢికొట్టి చంపే రాజకీయాలు, బెదిరింపులకు పాల్పడి హత్యా, కుట్ర రాజకీయాలకు తెరలేపే రాజకీయాలకు స్వస్తి పలికేందుకే బీజేపీ పార్టీలో చేరానన్నారాయన. కచ్చితంగా తన రాజకీయ ఆరంగేట్రం పేద, బడుగు, బలహీనవర్గాలు, పీడిత వర్గాల పక్షాన నిలబడి కలబడే విధంగా ఉంటుందని, వారిని రక్షించుకుని, అభివృద్దికి నమూనాగా చేయాలనే గొప్ప తలంపుతో బీజేపీలో చేరానన్నారు.
మోడీని ఆదర్శంగా తీసుకుని..
మోడీని ఆదర్శంగా తీసుకుని తన రాజకీయ జీవితంలో ప్రజల వద్ద ప్రత్యేక గుర్తింపు పొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పేదలకు ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నానని, ఆపదలో ఉన్నవారికి పైడి రాకేశ్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా, అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని అన్నారాయన. రాబోవు రోజుల్లో ఆర్మూర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటానన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారని, అది బీజేపీయే భర్తీ చేయనున్నదని, రాకేశ్ రెడ్డి రూపంలో ఓ కరుడుగట్టిన, కమిట్‌మెంట్‌తో కూడిన కార్యకర్తలా పనిచేసి, అందరికీ అందుబాటులో ఉండి ఆర్మూర్ ఫ్యాక్షన్ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలిస్తానని వార్నింగ్ ఇచ్చారాయన.
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
9492225111