Header Top logo

డాక్టర్ నక్కా విజయరామరాజు ప్రస్థానం..

 ద షో మస్ట్ రన్

డా.నక్కా విజయరామరాజు

భట్టిప్రోలు కథలతో వర్తమాన తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రచయిత నక్కా విజయ రామరాజు గారు, వీరు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో అంజయ్య, దయమ్మ దంపతులకు జన్మించారు.

పేదరికం సృష్టించిన పెను అవరోధాలను అధిగమించి, సమున్నత సంకల్పంతో రామరాజు గారు జ్ఞానపథంలో ముందుకు సాగిపోయారు. కష్ట జీవులైన తల్లిదండ్రులు అందించిన సంస్కారంతో, భట్టిప్రోలు టి.ఎం.రావ్ హైస్కూల్, ఏ.సి.కాలేజీ, గుంటూరు సమకూర్చిన విద్యా, కళా చైతన్యంతో ఉత్తమ విద్యార్థిగా రాణించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో MBBS పూర్తిచేసి, కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో పి.జి. పట్టా అందుకున్నారు. వృత్తిరీత్యా ఆర్మూర్ లో స్థిరపడ్డారు.

డాక్టర్ రామరాజు గారు బాల్యం నుండి ప్రబలమైన కళాభిరుచి కలిగిన వ్యక్తి. అధ్యయనశీలి. సాహిత్యప్రియులు. ప్రముఖ నవలా రచయిత డా. కేశవరెడ్డి గారి సాహచర్యంతో వారి రచనల స్ఫూర్తితో ‘ప్రౌఢ నిర్భర ‘వయఃపరిపాకం’లో కథారచనలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే ప్రముఖ కథా రచయితగా ప్రఖ్యాతి గాంచారు. తన బాల్యానుభూతులను అసామాన్యమైన ధారణాశక్తితో, నెమరు వేసుకుంటూ భట్టిప్రోలు కథలను రాశారు. ఈ కథలతో డా. కేశవరెడ్డి, బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, కారా మాస్టారు, వి ఏ కె రంగారావు, శ్రీరమణ లాంటి ప్రఖ్యాత రచయితలకు రామరాజు గారు అత్యంత అభిమానపాత్రుడయ్యారు.

‘భట్టిప్రోలు కథలు’ (2010) మా ఊరి కథలు, (2013) ‘దేవతావస్త్రాలు (2017) కథా సంపుటులతో రామరాజు గారు పాఠకుల హృదయాలను పరవశింపజేశారు. ‘పాఠకుడి అధోచేతనను తట్టిలేపే గొప్ప రచయితగా’ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ‘సృష్టిలో తీయనిది’, ‘ద షో మస్ట్ రన్’ కథా సంపుటాలతో వంద కథల ప్రస్థానానికి చేరుకొన్న రామరాజు అపూర్వమైన శైలితో తెలుగు కథ వాసిని నవనవోన్మేషంగా ఇనుమడింప జేశారు. తెలుగు కథకు సరికొత్త గ్రామర్ ను, గ్లామర్ ను అందించారు. నవ్య వీక్లీ, అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వహించిన నవలల పోటీల్లో తొలి నవల నాగమ్మతోనే ద్వితీయ బహుమతి పొంది, నవలా రచయితగా కూడా అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రామరాజుగారి కథలపై పరిశోధన జరుగుతున్నది. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రచురించిన మాండలిక కథల సంపుటిలో వీరి కథ నత్త ‘ముక్కల గోంగూర’కు స్థానం లభించింది. తమిళ కన్నడ, ఆంగ్లం తదితర భాషల్లోకి వీరి కథలు అనువాదమయ్యాయి.

రామరాజు గారి కథల్లో కోడి రామ్మూర్తిని తలదన్నే పహిల్వానులు, డొక్కా సీతమ్మను మరిపించే కరుణామూర్తులు, పేదరాసి పెద్దమ్మలను మించిన ప్రేమరాశి దొద్దమ్మలు, శబరిని జ్ఞప్తికి తెచ్చే పరమ వాత్సల్యమూర్తులు, ధన్వంతరికి తీసిపోని నాటువైద్యులు, మర్యాదరామన్నను తలపించే పెద్దమనుషులు, బాగ్దాద్ గజదొంగ లను త్రోసిరాజనే చోరధీరులు ఇలా ఎందరో తారసపడతారు. ఇవన్నీ ఆలోచనల్లో నుండి అమాంతం ఊడిపడిన పాత్రలు కావు. రామరాజుగారు బాగా ఎరిగిన పాత్రలు. భట్టిప్రోలు ప్రాంతంలో నడయాడిన పాత్రలు. అందుకనే ఈ పాత్రలు పాఠకులను గట్టిగా కౌగిలించుకుంటాయి. వెంటాడతాయి. ఏడిపిస్తాయి. నవ్విస్తాయి. మనుషులందరిని ఒకే చూపుతో దర్శి ఆత్మాన్నత్యాన్ని బోధిస్తాయి. జీవితాన్ని గెలిచే తత్వాన్ని నేర్పిస్తాయి.

– డా. కోయి కోటేశ్వరరావు తెలుగుశాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్

——-       ——-

సాహిత్య రంగంలో డాక్టర్ విజయ రామరాజు గారు

 జర్నలిస్ట్ గా సుధీర్ఘ కాలంగా పని చేస్తున్న నాకు అత్యంత ఆప్తమితృలలో ఒకరు ప్రముఖ రచయిత, డాక్టర్ నక్కా విజయ రామరాజు గారి ఫ్యామిలీ. ఇటీవల నిర్మల్ లో ఫంక్షన్ కు వెళుతూ ఆర్మూర్ లో డాక్టర్ గారిని కొంతసేపు ముచ్చటించాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే హస్పిటల్ లో డాక్టర్ గా బీడీ కార్మికులకు సేవాలందించిన విజయ రామరాజు గారు మూడు నెలల క్రితం స్వచ్ఛంద విరమణ తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు.

డాక్టర్ విజయ రామరాజు గారితో మాటలు (రాతలు) ఈ సమాజంలోని కుళ్లుపై తుపాకీ తూటాలుగా పేలుతాయి. మనిషి కామన్ మెన్ గా కనిపిస్తాడు.. అలాగే జీవించడానికి ఇష్ట పడుతారు. నిర్మల్, నిజామాబాద్ లలో డాక్టర్ గా విధులు నిర్వహించిన సందర్భంలో ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారు.

విజయ రామరాజు గారి అర్ధాంగి నందిని గారు కూడా డాక్టర్.. ఆర్థికంగా ఇబ్బందులు అసలే లేవు. కానీ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే ఎన్నో అనుభవాలు ఎదురైతాయని చెబుతారు డాక్టర్ విజయ రామరాజు.

అతనితో ఎప్పుడు మాట్లాడినా తాను రచయితగా ఎదుగడానికి కారకులైన గురువు ప్రముఖ రచయిత డాక్టర్ కేశవ రెడ్డి లాంటి గొప్పవ్యక్తియే అని గుర్తు చేసుకుంటారు. నేను ఆర్మూర్ లో జర్నలిస్ట్ గా పని చేసిన సందర్భంలో డాక్టర్ కేశవరెడ్డి, డాక్టర్ విజయ రామరాజు,  డా. కోయి కోటేశ్వరరావు గారిని కలిసి సాహిత్యం గురించి చర్చించిన సందర్భాలు ఎన్నో..

వంద కథలు రాసిన డాక్టర్ విజయ రామరాజు గారు నాకు మూడు పుస్తకాలు ఇచ్చారు.

మొదటిది ‘‘ద షో మస్ట్ రన్ కథా సంపుటి’’

రెండవది ‘‘సృష్టిలో తీయనిది కథా సంపుటి’’

మూడవది ‘‘కిడ్డూస్ కార్టూన్స్ ఇళయరాజా’’ ఇచ్చారు.

ఇళయరాజా.. డాక్టర్ విజయ రామరాజు – డాక్టర్ నందిని దంపతుల పెద్ద కుమారుడు. అతను ఇప్పుడు లేడు. 30 జూలై 1995లో జన్మించారు. 16 జనవరి 2022 నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోయారు. కానీ.. అతను బాల్యంలోనే వేసిన కార్టూన్స్ చూస్తుంటే మన మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. సమాజంలోని ప్రతి ఆంశాన్ని టచ్ చేస్తూ ఇళయరాజా కార్టూన్స్ గీసి అందరిని వదిలి భౌతికంగా లేక పోయినా.. అతని ఆలోచనలు మాత్రం కళ్ల ముందు తిరుగుతుంటాయి.

సో.. డాక్టర్ విజయ రామరాజు గారు సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..

ఆల్ ది బెస్ట్ డాక్టర్ సాబ్..

– యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking