Header Top logo

‘ఓటర్ ఫ్రెండ్లీ, ఉద్యోగుల ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీగా ఎన్నికల నిర్వహణ జరగాలి’ -జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:

నగరంలోని జడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు పరిశీలించారు.మండలాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీపుల్ ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ, ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఎన్నికలు జరగాలన్నారు.ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని గతంలో లేని విధంగా, ఉద్యోగులకు ఇబ్బందులు లేని విధంగా చేపట్టామన్నారు. మండలాల వారీగా ఎన్నికల సామగ్రిని వేరు చేయడం, మండలాల నుంచి వచ్చిన అధికారులు కూర్చున్న చోటే సామగ్రిని అందించడం, అధికారుల భోజన వసతుల గురించి ప్రత్యేక చొరవ తీసుకుని భోజనం, మంచి నీళ్లు, పండ్లతో కూడిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని అందించడం వంటి చర్యలు చేపట్టామన్నారు. వృద్ధుల పింఛన్ కార్యక్రమంలో ఇంటివద్దకే అధికారులు వెళ్లి పింఛను అందించినట్టుగా ఎన్నికల సామగ్రిని అధికారుల వద్దకే తెచ్చి ఇస్తున్నామన్నారు. ఇదే పద్ధతిని మండలాల్లో కూడా అధికారులు అనుసరించాలన్నారు. గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రిని వర్గీకరించి సంబంధిత ఉద్యోగుల వద్దకే సామాగ్రిని చేర్చాలన్నారు. మండలాల్లోనూ ఉద్యోగులకు ప్యాకేజ్డ్ ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఎటువంటి చిన్న సమస్య కూడా రాకుండా సామాగ్రి పంపిణీ జరగాలన్నారు.ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు ఎన్నికల బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలన్నారు. ఎన్నికల విధులు, నిబంధనలపై అవగాహన పెంచుకుని సక్రమంగా పని చేయాలన్నారు. పోలీసు వారి సహాయం తీసుకుని మండల స్థాయిలో ఎన్నికల సామాగ్రికి నిరంతర భద్రత కల్పించాలన్నారు.ఎన్నికల సామాగ్రిని మండలాలకు తరలించి పోలింగ్ ముందు రోజు వాటిని సంబంధిత గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. అంతవరకూ సాధారణ సామాగ్రిని స్ట్రాంగ్ రూముల్లోను, సున్నితమైన విషయాలకు సంబంధించిన సామాగ్రిని ట్రెజరీలోనూ భద్రపరుస్తామని తెలిపారు. పీపుల్ ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ, ఉద్యోగుల ఫ్రెండ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

తొలివిడత ఎన్నికల్లో 6 మంది సర్పంచులు, 715 మంది వార్డు మెంబర్ల ఏకగ్రీవం

ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాల వివరాలు తెలియజేశారు. జిల్లాలో కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాలకు సంబంధించిన 169 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న తొలివిడత ఎన్నికలలో 6 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 163 పంచాయితీలలో 469 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారన్నారు. అదే విధంగా 169 మండలాల్లోని మొత్తం 1714 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 715 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. 987 వార్డులలో 2030 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ ప్రక్రియకు అవసరమైన జాగ్రత్తలను చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జేసీలు నిశాంత్ కుమార్(రెవెన్యూ), గంగాధర్ గౌడ్(ఆసరా & సంక్షేమం), జడ్పీ సీఈవో శోభా స్వరూప రాణి, డీపీవో పార్వతమ్మ, సీపీవో ప్రేమ్ చంద్, డీఎస్పీ మురళీధర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking