Header Top logo

’ఉదయం’ జర్నలిస్ట్ గా యాటకర్ల మల్లేష్ జర్నీ…

జర్నలిస్ట్ గా ఇదే నా జర్నీ..

ఔను..

‘ఉదయం’ ఆత్మీయ బంధువుల మధ్య

మనసు విప్పి మాట్లాడుకోవడం

మధురమైన జ్ఞాపకం..

 కనిపెంచింది తలిదండ్రులు గంగు-ఈదుల్ల మల్లయ్యలే.. లోక భీమన్న – వడ్ల గోవర్ధన్ సార్ ల శిష్యరికంలో ఐదవ తరగతి మాత్రమే చదివాను..

 అయినా..

చీకటి జీవితంలో వెలుగు చూపింది ‘ఉదయం’ దిన పత్రికానే..  ‘ఉదయం’ అంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను.. మరిచి పోలేని మధురమైన జ్ఞాపకాలు ఎన్నో.. ఎన్నెన్నో..

 నిజం చెప్పాలంటే.. 21 ఏళ్లకే 1985 జూన్ 25న ఉదయం దిన పత్రికలో

జర్నలిస్ట్ ను కాకుంటే.. నక్సలైట్ గా ఎదుగుతుంటి..

ఎప్పుడో బూటకపు ఎన్ కౌంటర్ లో అమరుడను కూడా అయుతుంటి..

నేను పుట్టిన పల్లె.. కేశపల్లి ఇది నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో ఉంది.

 

మా ఏరియాలో నక్సల్స్ కార్యకలపాలు జోరు..

మరీ.. వాళ్ల కార్యకలపాలను అణచడానికి

పోలీసులు చేసే ఆరాచకాలను

అక్షర రూపంలో వార్తలుగా రాస్తే..

సూరీడు ఉదయించక ముందే

‘ఉదయం’లో వార్త కథనాలుగా వస్తే..

పోలీసులు నన్ను నక్సలైట్ అన్నారు..

వాళ్లను కలిసి ఇంటార్వ్యూలు చేస్తానని..

వారి కథనాలు ఎక్కువ రాస్తానని..

 నక్సలైట్ల కోసం పల్లెలపై పోలీసులు దాడులు చేసి ఊరును వల్ల కాడులా మారిస్తే వార్తలుగా రాయకుండా జర్నలిస్ట్ గా ఎలా ఉండగలను…?

 ‘ఉదయం’ విలేకరిగా అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం అక్కడే మొదలైంది.

ఆ ప్రశ్నించడమే నా జీవితంలో ఎన్నో కష్టాలు.. నష్టాలు..

ఇప్పటికీ డబ్బులు తప్పా..? నాకు కోపం, ఆవేశం అన్నీ ఎక్కువే..

1987లో ప్రభుత్వం నక్సలైట్ ముద్ర వేసి నన్ను ఎన్ కౌంటర్ చేయాలనుకున్నప్పుడు.. తప్పని సరి పరిస్థితిలో దుబాయ్ వెళ్లాను.

 అగో.. ఆ సమయంలో నాకు అండగా ఉంది

సిర్ప గంగాధర్ (ఆంధ్రజ్యోతి)  కీర్తి శేషులు బి.విజయానంద్ (ఉదయం) మరియు

జర్నలిస్ట్  సహచరుడు రవి ప్రతాప్ చావ్లా..

ఈ ముగ్గురితో పాటు

ఉదయం క్రిష్ణయ్య,

 బైస రామదాస్ (పొద్దు, ఎడిటర్) రేపాక జైపాల్ రెడ్డి (ఆంధ్రప్రభ),  రమణారావు (ఈనాడు)ల బాల్ రాజ్ (ఆంధ్రభూమి)

సహాయం మరిచి పోలేనిది. 

ఇరువై నెలల్లో ఇండియా తిరిగి వచ్చి మళ్లీ 1989లో ‘ఉదయం’ విలేకరిగా

కొత్త జీవితం మొదలు పెట్టాను. పోలీసులకు చిక్కకుండా ఎక్కడి నుంచి పారి పోయానో.. అగో.. అక్కడే మళ్లీ ఆర్మూర్ డివిజన్ ‘ఉదయం’ విలేకరిగా ప్రజల హృదయాలను గెలుసుకున్నాను.

డిచ్ పల్లిలో ‘ఉదయం’ స్ట్రీంగర్ గా ప్రారంభమైన నా జర్నీలో ఆర్మూర్, నిజామాబాద్, భువనగిరి, హైదరాబాద్ ఇగో ఇలా ఎన్నో ప్రాంతాలలో విలేకరిగా పని చేసిన అనుభవం..

ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య,

స్టూడియో (ఎన్), ఐ న్యూస్, వీ6 న్యూస్..

ఇప్పుడు యాభై తొమ్మిది ఏళ్ల వయసులో

జిందగీ – వైడ్ న్యూస్ వెబ్ సైట్ లు..

బైస రామదాస్, గోపనేని నాగేశ్వర్ రావు, సిర్ప గంగాధర్, క్రిష్ణయ్య, బి.విజయానంద్, బాల గంగాధర్, పిట్టల రవీంధర్, మ్యాడం మధు, పి.లింగం, జమాల్ పూర్ గణేష్,  బాల్ రాజు, విజయ్ కుమార్ రెడ్డి, విపిఎస్ రాజు, సంగప్ప, వెంకటేశ్వర్ రెడ్డి గార్లు.. జర్నలిస్ట్ గా జర్నీ చేసింది వీళ్లతోనే..

నేను ఎక్కవగా జర్నలిస్ట్ గా జర్నీ చేసింది  

వీ6 న్యూస్ సీఇవో అంకం రవి సార్ తోనే..

37 ఏళ్ల జర్నలిజం జర్నీలో 2007 నుంచి అతనితోనే..

 జర్నలిస్ట్ గా జర్నిలో .. పెద్దలు ఎబికే ప్రసాద్ సార్ రామచంద్ర మూర్తి సార్ మరియు సతీష్ చందర్ సార్ లు..

వీళ్లే కాదు..  రాపోలు ఆనంద్ భాష్కర్ సార్, లక్ష్మన్ రావు సార్.. సైదా రెడ్డి సార్.. దేవరకొండ కాళిదాస్, మిట్టపల్లి శ్రీనివాస్ సార్.. హేమ సుందర్ సార్.. తెలిదేవర భానుమూర్తి సార్, ఎస్ జీవి శ్రీనివాస్ రావు సార్ ఖాళిక్ సార్.. సీవీఎస్ రమణారావు.. ఈ పెద్దల సూచనలతో వార్త కథనాలు ఇచ్చాను.

ఎస్ జీవి శ్రీనివాస్ రావు (వార్త ఎడిషన్ ఇన్ చార్జీ, నిజామాబాద్) సార్ సలహాతో రాసిన నక్సలైట్ ఉద్యమం సీరియల్స్… శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సీరియల్స్, గల్ఫ్ దేశాల వలసలపై సీరియల్స్ జీవితంలో మరిచి పోలేని వార్త కథనాలు..

అలాగే

వీ6 న్యూస్ లో ‘‘జిందగీ’’ సీరియల్స్

నా జర్నలిస్ట్ జర్నీలో మరిచి పోలేని అనుభూతి.

జర్నలిస్ట్ కాక పోయినా.. ’వార్త‘లో కొండంతా అండగా ఉన్నా ఉపేంధర్ సార్ సహాయం మరువలేనిది.

ప్రామీస్ గా చెబుతున్నా.. ‘ఉదయం’ ను నా కొడుకులో చూసుకుంటాను. 4 జనవరి 1997లో ‘ఉదయం’ లేక పోయినా.. పుట్టిన నా కొడుకు పేరు ఉదయ్ కిరణ్ పెట్టుకున్నా.

‘ఉదయం’ అంటే వెలుగు..చీకటిని పారదోలే సూర్య కిరణాలు.. నా జీవితంలో విడదీయలేని ‘ఉదయం’..

ఎవరైనా నా కొడుకు పేరు గురించి ప్రశ్నిస్తే…

గర్వంగా చెబుతాను.

చీకటి జీవితంలో వెలుగు చూపిన ‘ఉదయం’

ను మరిచి పోలేక

కొడుకు పేరు

’’ఉదయ్ కిరణ్’’ 

అని పెట్టుకున్నాను అని..

నేను స్కూల్ కు వెళ్లి చదివింది ఐదవ తరగతి మాత్రమే.. అయినా.. ఈ సమాజాన్ని చదివే అవకాశం ‘ఉదయం’ దిన పత్రికా మరియు నక్సల్స్ ఉద్యమంతో జర్నలిస్ట్ గా ప్రజల సమస్యాలకు అక్షర రూపంలో వార్త కథనాలు ఇచ్చి ‘‘ప్రజాకోర్టు’’లో నిలబెట్టిన ఆ రోజులను మరువలేను. 

 ‘ఉదయం’

ఆత్మీయ బంధువుల మధ్య

గతంలోని స్మృతులను గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినా

నిర్వహకులకు తలవంచి వందనం చేస్తూ….

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్      

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking