Header Top logo

వలస నేతలకు భంగపాటు

వలస నేతలకు భంగపాటు
– టికెట్ ఆశతో కాంగ్రెస్ లో చేరిక
– చివరికి మొండి చెయ్యి
నిర్దేశం, హైదరాబాద్:
పార్లమెంట్ టికెట్ ఆశతో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు భంగపాటు ఎదురైంది. టికెట్ ఇస్తామని హామీతో కాంగ్రెస్ లో చేర్చుకుని ఆ తర్వాత మొండి చేయి చూపడంతో వలస నేతలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి శ్రీగణేష్ పని చేసుకుంటుండగా, అకస్మాత్తుగా ఆయనను కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగణేష్ బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెల మూడో స్థానానికి పడిపోయారు. స్థానికంగా పరిచయాలున్న శ్రీగణేష్ బలమైన అభ్యర్థిగా భావించి, ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. శ్రీగణేష్ బీజేపీ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారుకాకున్నా గత ఎన్నికల్లో పోటీ చేసినందున ఆయనే అభ్యర్థిగా భావించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని భావించగా ఆయనకు మొండి చేయి చూపారు. అద్దంకి దయాకర్ ను అభ్యర్థిగా ప్రకటించారు. దయాకర్ పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కష్టకాలంలో డిబెట్ లలో కాంగ్రెస్ వాణి వినిపించారు. దయాకర్ అన్నివిధాలా అర్హుడే. కానీ శ్రీగణేష్ కు ఆశ పెట్టి పార్టీలో చేర్చుకోవడం సరైందికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గణేష్ కు వేరే పదవి ఇస్తామని హామీ ఇచ్చిఉంటే అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత గణేష్ ను పార్టీలో చేర్చుకుని ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్లేవి కావని అంటున్నారు.

బొంతు రామ్మోహన్ కు ఇదే పరిస్థితి…

బొంతు రామ్మోహన్, కేసీఆర్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉండేవారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అందులో పని చేస్తున్నారు. ఈయనకు మేయర్ పదవి కూడా దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశతో కాంగ్రెస్ లో చేరారు. చివరికి ఈటికెట్ ను మరో వలస నేత దానం నాగేందర్ కు కేటాయించారు. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి మల్కాజిగిరి లేదా నల్గొండ టికెట్ ఆశించారు. ఈ రెండింటిని వేరే వారికి ఇచ్చారు. చేవెళ్ల టికెట్ పట్నం సునీతకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దీనిని మరో వలస నేత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కి ఇచ్చారు. సునీతకు మల్కాజిగిరి ఇచ్చి సంతోష పెట్టారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ను పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు టికెట్ ఖరారు చేయలేదు. ఆయనకు వస్తుందనే నమ్మకం లేదు. మరో నేత చేరితే వారికే టికెట్ ఇచ్చే అవకాశముంది.

వెంకటేష్ కు దక్కని పెద్దపల్లి టికెట్

పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అందరికంటే ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు టికెట్ ఖాయమని అందరూ భావించారు. కానీ ఆయనకు గాకుండా వివేక్ వెంకట స్వామి కుమారుడు వంశీకృష్ణకు ఇచ్చారు. వెంకటేష్ పరిస్థితి అయోమయంగా తయారయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking