Header Top logo

సినీనటి జమున నవ్వుతూ వెళ్లిపోయారు..

తెలుగు తెర “బంగారు తల్లి “

ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. ఇక మనమంతా ” ఏవీ తల్లీ నిరుడు కురుసిన హిమ సమూహములు” అని వెక్కిళ్ల మధ్య వెదుకులాడుకోవాల్సిందే. తెరపై ఆత్మాభిమానికి పారితోషకాలుంటాయి. నిజ జీవితంలో ఆత్మాభిమానికి వెన్నుముకపై నిలబడడమే పారితోషికం. వయసు మీద పడుతున్న కొద్దీ వెన్నుముక అరిగిపోతుంది. మందులతోను, ఆపరేషన్లతోనూ వెన్నుముకను నిలబెట్టుకోవచ్చు కాని ఆత్మాభిమానానికి ఎలాంటి మందులు వాడాలి. ఉండవు. దొరకవు.

అది పుట్టుకతో వచ్చి తుది శ్వాసతో వెళ్లిపోతుంది. కానీ, ఆ రెంటి మధ్యన జరిగే ఓ ప్రయాణంలో మాత్రం వారిని మహనీయులుగా నిలబెడుతుంది. అలా ఆత్మాభిమానానికి ప్రతీకలాంటి నటి జమున వెన్నుముకే కవచంగా ధరించి నవ్వుతూ వెళ్లిపోయారు. చనిపోయిన వారి కళ్లు ఎప్పుడు చారెడే. ఆ కళ్లు బతికి ఉన్నప్పుడు కూడా చారెడుగా కనిపిస్తేనే కదా వారి జీవికకు అర్ధం, పరమార్ధం. అవును… అలాంటి జీవికకు నకలు జమున నిలువెత్తు జీవితం.

“మీర జాలగలడా నా యానతి” అని జమున ప్రశ్నించింది ఎవరిని. సత్యభామ వేషంలో ఉన్న జమున శ్రీకృష్ణుని పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌ని ప్రశ్నించలేదు. ఆనాటి, నేటి, ఏనాటికైనా తెలుగు సినీ రంగాన్నే ప్రశ్నించింది. వెండితెర జిలుగుల వెనుక నక్కినక్కి దాక్కుని పరిశ్రమని శాసిస్తున్న పురుషాహంకారాన్ని ప్రశ్నించింది. జవాబు దొరకకపోవచ్చు. ఎవరూ చెప్పకపోవచ్చు. తప్పించుకోవచ్చు. ఆ దారికే వెళ్లకపోవచ్చు. కానీ, జవాబు దొరకనంత మాత్రాన ప్రశ్నలు లేకుండా ఎలా పోతాయి. ప్రశ్నలు మరో రూపంలో, మరో నటి పేరుతో ఎదురవుతాయి. నేడు సినీరంగంలో ఎదురవుతున్న అనేకానేక ప్రశ్నలకు పునాది జమున నిలదీసిన ఆ ప్రశ్న.

నటులుంటారు. గొప్ప నటులుంటారు. మహానటులూ ఉంటారు. మాయదారి సినీ పరిశ్రమలో తెరపై కంటే తెర వెనుక అనేకానేక మంది మహానటులకు మించి వారూ ఉంటారు. కానీ, ప్రజా నటులు ఉంటారా. ప్రజా నటి ఉంటుందా. అసలు అలాంటి మాట ఒకటి ఉన్నదనే ఎరుక కలిగిన వారు ఎందరుంటారు. అవును, జమున అనే అహంకారపు నటి కొందరికే తెలుసు. ఆమె ప్రజానటి అనే మాట ఎంతమందికి తెలుసు. ఈ ఆహాంకారం అనే మాటను ప్రయోగించి తమ అహంకారాన్ని నిలబెట్టుకున్న మహానటులున్నారు. గుండమ్మకథ సినిమాకు మూడేళ్లకు ముందే తమ అహంకారంతో జమునను బలవంతంగా నిషేదించిన వారే ఆమె ఆత్మాభిమానం ముందు ఓడిపోయారు.

ఓ నటి షూటింగ్‌ సెట్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఓ అహంకారం. తోటి నటులను గౌరవించడం తప్ప అణిగి మణిగి ఉండకపోవడం మరో అహంకారం. అప్పటికే ఓ కులం తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో ఆ కులం కాని అమ్మాయి స్వశక్తితో ఎదుగుతూండడం ఇంకో అహంకారం. వారంతా అహంకారం అన్నారు… అనుకున్నారు… ప్రచారం చేసారు. కాని జమున మాత్రం తన పాటలోనే అన్నట్లుగా ” మానూ, మాకును కాను. రాయి, రప్పను కానే కాను… మామూలు మడిసిని నేను. నీ మనిషిని నేను” అని చెప్పి జీవించినంత కాలం ప్రజల మనిషిగానే ఉన్నారు.

ఓ క్లాప్ బాయ్‌కి కష్టం వస్తుంది. మరో జూనియర్‌ ఆర్టిస్టుకి షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరుగుతుంది. ఇంకో లైట్‌ బాయ్‌కి షాక్ కొట్టి అతని జీవితంలో హఠాత్తుగా వెలుగులు కొల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వాళ్లకి దేవుడి మీద కోపం వస్తుంది. కడుపికింత దొరకని స్ధితిని తలచుకుని మోకాళ్ల మధ్య తలలు పెట్టుకుని భోరున ఏడావాల్సి వస్తుంది. అదిగో, అప్పుడు వాళ్లకి జమున గుర్తుకు రాదు. ఆమెకే వాళ్ల కష్టం తెలుస్తుంది. కృష్ణానగర్‌లో ఇరుకిరుకు సందుల మధ్య ఉంటున్న వాళ్ల ఇంటి ముందుకు రాలేక రోడ్డుపైనే కారును నిలబెట్టి ఓ మనిషితనం వాళ్ల వైపు నడుచుకు వస్తుంది. అలా నడిచి వస్తున్న ఆమె పేరు జమున అవుతుంది. కొన్నాళ్ల పాటు ఆ అభాగ్యులకు అన్నం పెట్టే తల్లి అవుతుంది. తల్లి అంటే ఒక్కరికే కాదుగా. మొత్తం సమాజానికేగా. ఇందుకే ఆమె ప్రజానటి అవుతుంది.

రంగుల ప్రపంచంలో ఆలోచనలన్నీ రంగుల లోకంలోనే విహరించాలి. కలలు కూడా ఈస్ట్ మన్‌ కలర్ లోనే కనాలి. ఆ రంగుల లోకంలో చాలామంది అలాగే చేసారు. కొందరు మాత్రమే తమ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలని గుర్తుంచుకుని అలాంటి జీవితాలు ఇంకా ఉన్నాయని ఎరుక కలిగి ఉంటారు. అలాంటి వారి పేర్లు గుర్తుండిపోతాయి. ఇదిగో, ఇప్పుడు జమునలా…

జర్నలిస్టుగా జమున చేతి వంట తినడం నాకు నా వృత్తి ఇచ్చిన బహుమతి. పేయింటింగ్‌ ఆన్‌ గ్లాస్‌ ( రివర్సల్‌ పేయింటింగ్‌) ఆర్టిస్టు అయిన జమున కుమార్తె స్రవంతిని వృత్తిలో భాగంగా ఇంటర్వ్యూ చేయడానికి వాళ్లింటికి వెళ్లాను. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జమున ఇంట్లోనే గడిపాను. ఆ రోజు భోజనం చేస్తే తప్ప వెళ్లకూడదంటూ పట్టుపట్టారు జమున. ఇది నాకు దొరికిన అదృష్టం.

మరో అపురూపం. పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల సమయంలో తనతో పాటు నటించి స్వర్గస్తులైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు జమున తర్పణాలు వదిలేవారు. ఇంతే. జమున అంటే ఇంతే. ఇంతకంటే ఇంకేం లేదు.


ముక్కామల చక్రధర్‌,

సీనియర్ జర్నలిస్టు, 99120 19929

విశాలాంద్ర సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking