AP 39TV 16మార్చ్ 2021:
అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్రను లిఖించినట్లు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 48 డివిజన్లలో విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీని ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేశారు. డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక సమయంలోనే సామాజిక సమతుల్యత పాటించామని తెలిపారు. ముస్లింలకు 10 సీట్లు కేటాయించడంతో పాటు బీసీలకు సగానికి పైగా స్థానాలు ఇచ్చామన్నారు. మహిళలకు ఏకంగా 27 సీట్లు ఇచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతటి ఘోర ఓటమిని మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఎన్నడూ చవిచూడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారన్నది. ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. 50 డివిజన్లలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలుపొందలేదని, ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. అనంతపురం నియోజకవర్గంలో టీడీపీ ఉనికే లేదని స్పష్టమవుతోందన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అనంతపురం నగరంలో జరుగుతున్న అభివృద్ధి మా విజయానికి కారణమయ్యాయని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీ గుణపాఠం చెప్పారని, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అర్బన్ నియోజకవర్గ పరిధిలోని మూడు సర్పంచ్ స్థానాలను వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.