Header Top logo

Gangadi Sudhir’s book ‘Iguram’ ‘ఇగురం’ చెప్పే గంగాడి సుధీర్ పుస్తకం

Gangadi Sudhir’s book ‘Iguram’

‘ఇగురం’ చెప్పే గంగాడి సుధీర్ పుస్తకం

నీకు ఇగురం లేదెమురా..? ఇగురంతో పని చేయురా..? ఇగురం లేక పోతే ఎట్ల బతుకుతావురా..? ఇగో గిట్లాంటి మాటలు తెలంగాణ పల్లెలో ఎక్కువగా వినిపిస్తాయి. గంగాడి సుధీర్ ది పల్లెటూర్.. ఆయనది సిరిసిల్లా దగ్గర ఆవునూరు చిన్న పల్లె. పుట్టుకతోనే ఆ పల్లె వాసనతో పెరిగినోడు. మట్టితో.. చెట్లతో.. గుట్టలతో.. పొలంతో దోస్తాన్ చేసినోడు కాబట్టి కళ్ల ముందు జరిగిన సంఘటనలను కథ వస్తువుగా సెలక్ట్ చేసుకుని రాసుకుంటా పోయిండెమో.. అందరికి ఇగురం చెప్పడానికి ఇగో గంగాడి సుధీర్ రాసిన కథల పుస్తకంకు ‘ఇగురం’ పేరు పెట్టి మంచి పని చేసిండు.

పరిచయం..
గంగాడి సుధీర్ వాట్సాప్ లో ‘‘జర్నలిస్ట్ మంచి పుస్తకం-అనుభవం’’ గ్రూప్ ద్వారా పరిచయం.. అప్పుడప్పుడు అతను రాసే కథలు.. కవిత్వం చదువుతుంటి. నచ్చితే లైక్ కొడుతుంటి. బాగా నచ్చితే షేర్ చేస్తుంటి.

జిందగీలో స్టోరి

‘ఇగురం’ పుస్తకం ప్రింట్ చేస్తున్నాడని తెలిసి జిందగీ వెబ్ సైట్ లో గంగాడి సుధీర్ జర్నీ రాయాలనిపించింది. ఫోన్ లో అతనితో చర్చించి జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు ‘ఇగురం’ పుస్తకం గురించి నాలుగు మాటలు రాసి ఫోటోలు పంపుమని కోరాను. అంతే.. నా మాటను గౌరవించి పుట్టిన నుంచి అతని జర్నీని రాసి పంపాడు. జిందగీ వెబ్ సైట్ లో ప్రచురించిన లింక్ ఇదే.. Introduction to book ‘Iguram’ ‘ఇగురం’ పుస్తక రచయిత గంగాడి సుధీర్ పరిచయం https://zindhagi.com/introduction-to-book-iguram/

ఇరువై రోజుల్లో పుస్తకం..

గంగాడి సుధీర్ ఉండేది అల్వాల్ లో.. నేనూ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటాను. సో.. ‘ఇగురం’ పుస్తకం తీసుకుని సుధీర్ ఇటీవల ఇంటికి వచ్చాడు. అతనిని ప్రత్యక్షంగా చూడటం అదే మొదటి సారి. పుస్తకాలు ఇరువై రోజుల్లో అమ్ముడు అయ్యాయంటే ఆశ్చర్య పోయాను. నిజంగానా..? అన్నాను. నమ్మలని పించలేదు. కానీ.. నిజం.. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో పుస్తకాలు ఎలా అమ్ముడు పోయాయో ఆ సీక్రెట్ అడిగాను. సుధీర్ లో రచయిత లక్షణాలే కాదు. మార్కెటింగ్ టాలెంట్ ఉందనిపించింది. పిచ్చాపాటి మాట్లాడిన తరువాత అతను వెళ్లి పోయాడు.

‘ఇగురం’ పుస్తకం తెరిసి..

‘ఇగురం’ పుస్తకం తెరిసి కథల పేర్లు చదువుతుంటే ముప్పయి ఏండ్ల నుంచి మా ఊళ్లో విన్న పేర్లే అనిపించింది. వలసలు కథ.. అంటే గల్ఫ్ లేదా బొంబాయి వలసులు గుర్తోచ్చాయి. ఇగురం కథ.. అంటే ఊళ్లో పోరగాండ్లు తప్పుడు పని చేస్తే ‘ఓరేయ్ ఇగురం లేదావురా..?’ అనే మాటలు యాదికచ్చినయి. నిశ్చబ్దం.. సమ్మే.. లాక్ డౌన్.. కరోనా టైమ్ ఇగో ఇవన్నీ పేర్లు తెలిసినవే. తెల్లారి పుస్తకంలోని కథలు చదువుడు స్టార్ట్ చేసిన. ఇగ అంతే.. ఆ కథలన్నీ చదువకుండా ఆ ‘ఇగురం’ పుస్తకం వదులాలనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అరటి పండు పొట్టు తీసి తినిపించినట్లు కథలు ఉన్నాయి.

ఎవ్సయం చుట్టే ఎక్కువ..

గంగాడి సుధీర్ పల్లెటూర్ పుట్టిన నుంచి ఎవ్సయం చూసినోడు గదా.. ఎక్కువ కథలలో రైతుల బాధలు గుర్తు చేసిండు. తెలంగాణ మాండలికంలో రాసిన గా కథలు చదువుతుంటే చాలా రోజులకు హాయిగా పల్లె ముచ్చట్లు విన్నట్లు అనిపించింది. పల్లెటూర్ లో ఇగురం చెప్పినట్లే రాసిండు. సస్పెన్స్ తో రాసిన ఈ కథలు చదువడం ప్రారంభిస్తే మధ్యలో వదులలేము. ఆంధ్రల్లోకు గీ కథలు నెత్తికెక్కయెమో కానీ.. తెలంగాణ పల్లెలోల్లకు ఈ కథలు ఇగురం చెబుతాయి. వలసలు.. ఈ కథ చదువుతుంటే బతుకు తెరువు కోసం దుబాయ్ లేదా బొంబాయి వెళ్లిన అభాగ్యులు గుర్తుకు వచ్చారు.

పిల్లగాళ్లు తప్పు చేస్తే ఇగురం

ఇగురం.. ఈ కథ చదువుతుంటే పిల్లగాళ్లు తప్పు చేస్తే ఇగురం లేదావురా.. అనే మాటలు గుర్తుకు వచ్చాయి. సమ్మే.. ఆర్టీసి సమ్మేతో సామాన్యుల బాధలే కాదు.. ఆర్టీసి అధికారులు టెంపరరీ కార్మికులకు తక్కువ డబ్బులు ఇవ్వడం దోపీడిని బాగా చెప్పారు. లాక్ డౌన్.. కరోనా టైమ్స్ కథలు చదువుతుంటే పోలీసులు లాఠీలతో కొట్టిన దెబ్బలు.. వలస కార్మికులు రోడ్ పోవడానికి వారు పడిన బాధలు ఇగో ఇట్ల ఎన్నో ముచ్చట్లు ‘ఇగురం’ పుస్తకం చెబుతుంది.

సస్పెన్స్ క్రియేట్ చేయడంలో..

‘ఓ గెలుపు జ్ఞాపకం’ కథ చదువుతున్నాంత సేపు ఏమి జరుగచ్చో అనే సస్పెన్స్ క్రియేట్ చేయడంలో రచయిత గంగాడి సుధీర్ సక్సెస్ అయ్యాడు. లవ్.. కథ వస్తువుగా డిగ్రీ చదువుతూ నడిపించిన తీరు చూస్తుంటే నిజంగా రచయిత స్వీయ అనుభవం అనిపించింది. అంత బాగా రాసాడు. కథ చివరలో ఆ ప్రేమికులు పెద్దల ఒత్తిడితో ఇతరులను పెళ్లి చేసుకుంటారెమో.. అలా చేసుకోవద్దు అని నా మనసు చెబుతున్నట్లుగానే ముగింపులో ప్రేమికులు పెళ్లి చేసుకోవడం భలేగా నచ్చింది.
‘ఇగురం’ పుస్తకం రాసిన గంగాడి సుధీర్ కు మంచి భవిష్యత్ ఉంది. మరిన్నీ కథలు నీ కలం నుంచి రావాలని మనసారా కోరుకుంటూ…

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

1 Comment
 1. Sudheer says

  Thank you sir,
  అప్పుడు నాగురించి చెప్పినా……
  ఇప్పుడు కథల రివ్యూ ఇచ్చినా మీ అభిమానానికి వెలకట్టలేను.

  మీలాంటి నిఖార్సైన జర్నలిస్టు, జీవితాన్ని అన్ని విధాలుగా అనుభవించి, అన్ని పార్శాల్లో రాటుదేలిన వ్యక్తి నుండి వచ్చిన ఈ మాటలు నాకు, ఇగురం పుస్తకానికి అత్యంత విలువైనవి.

  ఇవి మన కథలు, మన మధ్యతరగతి కథలు, అందుకే మీరైనా…
  సుప్రసిద్ధ కవి, రచయిత నందిని సిధారెడ్డి గారైనా….
  ప్రఖ్యాత జర్నలిస్టు కె రామచంద్రమూర్తి గారైనా….
  మరెందరో కవులు, రచయితలు, జర్నలిస్టు మితృలు, పాఠకులు, మామూలు మధ్యతరగతి మనుషులు అందరూ ఈ కథల్ని స్వీకరిస్తున్నారని నేను భావిస్తున్నాను.

  Thank you very much sir

Leave A Reply

Your email address will not be published.

Breaking