Header Top logo

సెల్‌ఫోన్‌కు బానిసలుగా పిల్లలు

సెల్‌ఫోన్‌కు బానిసలుగా పిల్లలు

ప్రతి పదిమందిలో 9 మందికి సెల్‌ఫోన్‌ వ్యసనం

43 శాతం మంది పిల్లలకు సోషల్‌ మీడియా ఖాతాలు

వీరిలో 79శాతం రోజుకు 2 గంటలపాటు ఫోన్‌తోనే

30.2% మంది పిల్లలకు సొంతంగా ఫోన్లున్నాయి

పిల్లలు మొబైల్‌ ఫోన్‌ను వదలడం లేదు! వారి ఆటాపాటా ఫోన్‌తోనే అవుతోంది. బడి, కాలేజీ సమయం తప్ప మిగతా టైంలో ఎక్కువ సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. కొందరు హోంవర్క్‌ టైంలోనూ ఫోన్‌ను చూస్తున్నారు. ఇది వారి శారీరక, మానసిక, సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్సీపీసీఆర్‌) సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 8-18 ఏళ్ల వయసు పిల్లలపై ఆరు రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. పద్దెనిమిదేళ్లలోపు పాఠశాల పిల్లల్లో 42.9 శాతం మందికి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలుండగా వీరిలో 79 శాతం మంది రోజుకు కనీసం రెండు గంటలైనా మొబైల్స్‌ను చూస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.

మొబైల్స్‌పై ఆధారపడటం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారింది. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత పిల్లలు ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. శారీరక, మానసిక వికాసం పెరిగే వయసులో పిల్లలు మొబైల్స్‌కు బానిస కావడం వారిలో అనేక సమస్యలకు కారణం అవుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

మొబైల్స్‌, ఇంటర్నెట్‌ ఆధారిత ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లతో పిల్లల్లో మానసిక రోగ లక్షణాలు పెరుగుతున్నట్లు తేలింది. ఈ లక్షణాల్లో ప్రధానంగా నిద్రలేమి, వణుకు, ఆందోళన, చిరాకు, అజీర్తి సమస్య వంటివి వస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.

రోజుకు 6 గంటలకు మించి ఇంటర్నెట్‌ ఆధారిత ఎలకా్ట్రనిక్‌ వస్తువుల తో గడిపేవారు జీవితంపై ఎక్కువ అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. కొవిడ్‌ వల్ల పిల్లల్లో ఎక్కువ మంది మొబైల్స్‌ ద్వారానే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యారు. అప్పటి నుంచి వాటికి మరింత అలవాటుపడ్డారు.

సర్వే ఇలా..

సర్వే కోసం దేశంలోని ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌, నార్త్‌ఈస్ట్‌ రీజియన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిసా, జార్ఖండ్‌, అస్సోం రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆ రాష్ట్రాలనుంచి మొత్తం 15 ప్రాంతాల్లో 60 పాఠశాలను అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు.

ఇందులో అధికాదాయం ఉన్న ప్రైవేటు స్కూల్స్‌, బడ్జెట్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అన్నిచోట్ల నుంచి 5,811 మంది పాల్గొన్నారు. ఇందులో 3,491 మంది విద్యార్ధులు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తం శాంపిల్స్‌లో 51 శాతం బాలురు, 49 శాతం అమ్మాయిలు ఉన్నారు. 8-18 మధ్య వయసు పిల్లలను స్టడీ కోసం ఎంపిక చేసుకున్నారు.

  • నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్సీపీసీఆర్‌) సర్వే రిపోర్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking