Header Top logo

నిరుద్యోగులకు జరిగే అన్యాయానికి సీఎం కేసీఆర్ బాధ్యుడు

నిరుద్యోగులకు జరిగే అన్యాయానికి

సీఎం కేసీఆర్ బాధ్యుడు

  • జర్నలిస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

తెలంగాణ రాష్ట్రం కోటి ఆశలు, ముక్కోటి ఆకాంక్షలతో ఏర్పడ్డది. నీళ్లు,నిధులు,నియామకాల కోసం జరిగిన పోరాటంలో యువత ముందుండి కొట్లాడింది. కానీ నేడు అదే యువత భవిష్యత్తుపై ఆశలు లేక, నియమాక (TSPSC)సంస్థల మీద నమ్మకం లేక, నిరుద్యోగ భృతి జాడలేక  నిండా మునిగింది.

ఇంటికో ఉద్యోగం దేవుడెరుగు కానీ ఎప్పటికీ ఉద్యోగం రాదు ఏమోనన్న అపనమ్మకం ఇప్పుడు నిరుద్యోగ యువతను కమ్మేసింది. దీనికి కారణం, నైతిక బాధ్యత ముఖ్యమంత్రి KCR గారిదే. ఎందుకు అంటే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రధాన బాధ్యత ఉద్యమ సారధి, సీఎం KCR మీద ఉన్నది. మేధావి యువతను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి చేయాల్సిన బాధ్యత, కొత్త ఉద్యోగాలను సృష్టించి, ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన నైతిక బాధ్యత కూడా సీఎం పైనే ఉంది.

కానీ జరిగింది ఏమిటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మేధావిగా ముద్రపడ్డ ప్రొఫెసర్ గంటా చక్రపాణిని TSPSC చైర్మనుగా నియమించి యువతలో ఆశలు రేకెత్తిచ్చారు ముఖ్యమంత్రి KCR. కానీ ఆచరణలో, కార్యదీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం చెందింది. రాష్ట్రంలో అత్యున్నతమైన పోస్టులుగా భావించే గ్రూపు1 నోటిఫికేషన్ వేయలేని దుస్థితితో పదవీకాలం ముగించాల్సిరావడం ఘోర వైఫల్యం.

గతంలో ఎప్పుడో 2014కు ముందు నిర్వహించిన గ్రూపు1కు మెయిన్స్ పరీక్ష నిర్వహించడమే గొప్ప పని చేశాము అనే ప్రగల్భాలు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో యువతలో రోజురోజుకూ అసంతృప్తి, ఆగ్రహజ్వాలాలు తీవ్రమవుతున్న నేపద్యంలో KCR గారు సమర్థులన్న పేరున్న రిటైర్డ్ IAS అధికారి జనార్దన్ రెడ్డిని చైర్మన్ గా,  అనితా రామచంద్రన్ (IAS)కార్యదర్శిగా నియమించారు. కానీ ఏమైంది ఏమీ మార్పులేదు. మన ఆలోచన విధానంలో నాణ్యత నైపుణ్యం నిపుణత నూతనత్వం లేనప్పుడు ఫలితాలు శూన్యం.

TSPSC లో కమిటీ మెంబర్స్ భజనపరులే..

రాజకీయ నిరుద్యోగులు, భజనపరులు, తమ పదవీకాలంలో  అడుగులకు మడుగులు ఒత్తినవారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏమిటో కనీస అవగాహన, పరిజ్ఞానం లేని గంగిరెద్దులను సభ్యులుగా నియమించడం, కమిషన్ కార్యాలయంను పూర్తిగా “ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పునరావాస కేంద్రం” చేయడం మూలంగానే నేడు పరీక్ష పత్రాల లీకుకు కారణం. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, సమన్వయ లోపం కారణంగా నేడు TSPSC దేశవ్యాప్తంగా నవ్వులపాలు అయ్యింది. నిరుద్యోగుల పాలిట శాపమయ్యింది. అవినీతికి కేంద్రం అయ్యింది. పరీక్ష పత్రాలు అమ్మే కంపుకు నిలయం అయ్యింది.

జాబ్ వచ్చిన వారంతా దొంగలే అనే ఫీలింగ్..

కొందరి స్వార్థం, బాధ్యతరాహిత్యం వల్ల  TSPSC ద్వార గతంలో ఉద్యోగాలు పొందినవారందరి మీద కూడా ఇప్పుడు అనుమానాలు ఏర్పడ్డాయి. ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువతలో TSPSC మీద ఒక రకమైన అపనమ్మకం ఏర్పడింది.  TSPSCని నమ్ముకొని, అంతో ఇంతో ఆసరాగా ఉన్న ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని నెలల తరబడి కోచింగ్ కేంద్రాల్లో డబ్బులు వెచ్చించి చదువుకున్న నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.

తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద చదువుకుంటున్న నిరుద్యోగులు కొందరు, వయస్సు మీదపడి ఉద్యోగం వస్తేనే వివాహం చేసుకుంటాం, సొంతూరుకు పోతాం అని దాచుకున్న కోటి ఆశలు ఆవిరి అయినాయి. TSPSC స్వయం ప్రతిపత్తి అన్న మాటే కానీ పెత్తనం అంతా ప్రభుత్వ పెద్దలదే. TSPSC కార్యాలయంలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల ఎంపికలో కూడా  ఉన్నతాధికారులకు పట్టులేదు అంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో తెలుస్తుంది.

కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు..

ఉద్యోగాల కల్పన, నోటిఫికేషన్ల విడుదల, కార్యాలయం నిర్వహణ, TSPSCలో కనీస వసతుల కల్పన మీద ఏరోజు అయినా ముఖ్యమంత్రి KCR గారు 8 యేండ్లల్లో ఏనాడు అయిన చిత్తశుద్ధితో 8గంటల పాటు సమీక్ష నిర్వహించడా? ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలకు TSPSC చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఏరోజు అయినా సమావేశం అయ్యారా? అసలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉందా?

 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డప్పుడు, అప్పటికే ఖాళీలు ఉండి ఉంటే TSPSCకి ఆ సమాచారం ఇవ్వాలి అనే సోయి ఆయా శాఖల ఉన్నతాధికారులకు (IAS) ఉందా? అటువంటి ఆదేశాలు మంత్రిత్వ శాఖలకు ఇవ్వాలి అనే కనీస ధర్మం, నైతిక బాధ్యత అసలు తెలంగాణ ప్రభుత్వంకు గుర్తుందా?…

TSPSC అంటే మాములుది కాదు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే అత్యున్నత  కార్యనిర్వాహక వ్యవస్థను నిష్పక్షపాతంగా ఎంపిక చేసే సంస్థ. అటువంటి సంస్థ నేడు ఎందుకూ పనికిరాని సంస్థగా మారింది. TSPSC అనే సంస్థ ఉంది. దాని ద్వారా అనాదిగా దగాపడ్డ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కలిపించాలి కనీస బాధ్యత మన మంత్రుల్లో కనిపించడం లేదు.

మంత్రులు సోయి లేని మాటలు..

పేపర్లు లీక్ కావడం సర్వసాధారణం అన్నట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే TSPSC పేపర్ల లీక్ అంశం మీద సమీక్ష చేయడం తన స్థాయి అంశమే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కంటి తుడుపు సిట్ లు ఏర్పాటు వల్ల ఒరిగేదేమి లేదు. లీక్ అంశంలో పెద్ద తలకాయలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నప్పుడు సిట్టింగ్ న్యాయమూర్తులచే విచారణ చేయిస్తే దోషులు ఎవరో తెలుస్తుంది కానీ ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యల తీసుకోవడానికి నోటీసులిస్తే లాభం ఏమి ఉంటుంది?

2016లో నిర్వహించిన గ్రూపు1లో ఉద్యోగం పొందినవారిని కూడా విచారిస్తే తప్పు ఏమి ఉంది. గ్రూపు1తో పాటు గ్రూపు2, ప్రధాన పోస్టులకు ఎంపికైన అందరిని విచారిస్తేనే కమిషన్ చైర్మన్, సభ్యులు, ఉద్యోగులు, తెర వెనుక పెద్దల బండారం బయటపడుతుంది. ఏదైనా కొత్త సంస్థ తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడానికి వస్తే క్రెడిట్ అంతా నాదేనాని చెప్పే యువమంత్రులు, ఇతర శాఖల్లో జోక్యాల చేసుకునే పెద్దలు TSPSC పేపర్ల లీక్ మాత్రం మాకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది, నైతిక బాధ్యత నుండి తప్పించుకున్నటు ఉంది.

నిరుద్యోగ యువతకు నమ్మకం కలుగాలంటే..

TSPSC మీద యువతకు నమ్మకం కలగాలి అంటే లీక్ లో ఉన్నవారందరిపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. దోషులకు కఠిన శిక్షలు వేయాలి. కేసును తొందరగా ముగించాలి అంటే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి. నూతన TSPSC చైర్మన్, కార్యదర్శి, సభ్యులుగా నిజాయితీ, అనుభవం గల మేధావి వర్గంతో కూడిన రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, సమర్థులైన  అధికారులను నియామకం చేయాలి.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో రాజకీయ జోక్యాన్ని, ఆధిపత్యాన్ని పూర్తిగా నివారించాలి. యువతకు ఇలా చెప్పకూడదు ఏమో కానీ…..నిరుద్యోగ యువత కూడా జరిగిన దృష్టాంతాలను, దురదృష్టాన్ని మర్చిపోయి, మళ్లీ పరీక్షలకీ సన్నద్ధం కావాలి. అదృష్టంను పరీక్షించుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడాల్సింది మీరే. పాలకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి.

TSPSC పూర్తిగా ప్రక్షాళన చేసి గాడిన పెట్టాలి. దేశంలో అత్యున్నతంగా నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లను అధ్యయనం చెయ్యాలి. యువతలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద విశ్వాసం కలిగించే చర్యలు వెంటనే చేపట్టాలి.

  • రాజమల్లారెడ్డి, సినియర్ జర్నలిస్టు

Leave A Reply

Your email address will not be published.

Breaking