Header Top logo

ఈ జర్నలిస్టులు కూడా ఇలా తప్పు చేస్తారా..?

  నకిలీ ఐజేయూ సృష్టికర్తలకు….
చట్టపరంగా శిక్ష తప్పదు
– ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) నుండి బహిష్కరించిన వారిని, వారి వెంట ఉన్న వ్యక్తులను ఐజెయు నాయకులు అని చెబితే జర్నలిస్టులు ఊరుకోబోరని ఐజెయు, టియుడబ్లుజె హెచ్చరించింది. నకిలీ ఐజేయును సృష్టించి కేవలం ప్రభుత్వ పెద్దల వద్ద తమకు జర్నలిస్టులలో ప్రాబల్యం ఉందని చెప్పుకొని, జర్నలిస్టుల ప్రయోజనాలను పణంగా పెట్టి, వ్యక్తిగత , రాజకీయ పదవులు పొందేందుకే ప్లీనరీ పేరుతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. చైతన్యవంతులైన తెలంగాణ జర్నలిస్టులు విశ్వసించబోరని, తిరస్కరిస్తారని స్పష్టం చేసింది.

హైదరాబాద్ సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఐజెయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టియుడబ్లుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఐజెయు ప్లీనరీ పేరుతో తప్పుడు ప్రచారం చేసున్న సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టు సమస్యలు, సంక్షేమంపై పట్టింపులేని పదవీ కాంక్షా పరులు, పదవే జీవితాశయమనే కోరికలతో మిగిలిన వారు తప్పుడు పద్ధతులలో జర్నలిస్టుల వ్యతిరేక పద్ధతులలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తాము అనుబంధమని చెప్పుకుంటున్న ఐజెయుకు చెందిన వ్యక్తి ఏనాడైనా కార్మిక శాఖ వద్ద చట్ట ప్రకారం వార్షిక నివేదికలను సమర్పించారా అని ప్రశ్నించారు.ప్రతి ఏటా సభ్యత్వాలు, కమిటీలు, జాతీయ సంఘ అనుబంధ సంఘాల వివరాలు, ఆదాయ, వ్యవయాల ఆడిట్ వివరాలను సమర్పిస్తున్నారా? అని కె.శ్రీనివాస్ రెడ్డి అడిగారు.

ఈ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల సంఘాలలో తెలంగాణ తెచ్చింది మేమే , మా ద్వారానే రాష్ట్రం వచ్చిందనే మూర్ఖత్వం కలిగిన సంఘం తొమ్మిదేళ్ళలో ఆ పని చేసిందా? అని ప్రశ్నించారు. కార్మిక చట్టాల ప్రకారం వర్కింగ్ జర్నలిస్టుల సంఘంగా చెప్పుకునే అర్హత వారికి ఏనాడో పోయిందన్నారు.

పాలాభిషేకం చేస్తూనే, పాదాల కింద గోతులు తవ్వుతున్నారని విమర్శించారు. ఒక వైపు ప్రభుత్వం మాతోనే ఉందనే అవాస్తవ ప్రకటనలు చేస్తూ, మరో వైపు ప్రభుత్వ పెద్దలను ఆకర్షించేందుకు మాది ట్రేడ్ యూనియన్ అని, మాకు జాతీయ సంఘం ఉందని చెప్పుకొని బతకడానికి అబద్ధాల కోరులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ఐజెయు పదవ ప్లీనరీ చేస్తున్నామని, దానికి అనుబంధంగా ఉన్నామని, సమావేశానికి అఖిల భారత నాయకుడు వస్తున్నాడని , ఆయన ఐజెయు తరుపున ప్రెస్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఐజెయు తరుపున ప్రెస్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పే ధైర్యం ఆ వ్యక్తికి ఉందా? కనీసం వారికి అనుబంధ సంఘంగా చెప్పుకుంటున్న వారు రాతపూర్వకంగా ఈ విషయం చెప్పగలరా అని శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం సభ్యుల నియామకానికి అక్రమ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానిని ఐజెయు, ఐఎఫ్ ఎన్ , ప్రెస్ అసోసియేషన్ తదితర జాతీయ సంఘాలు,

ఐ.ఎన్.ఎస్ వంటి సంస్థలు వ్యతిరేకించాయని, ఢిల్లీ కోర్టులో కేసు వేసాయని వివరించారు. పంజాబ్ రాష్ట్రం చిన్న యూనియన్ నుండి ఆ వ్యక్తి ప్రెస్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అంతే తప్ప ఐజెయుకు కాదని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు ఐజెయు నుండి 20, 30 మంది ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా పని చేశారని, సెంట్రల్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఉన్నారని ఆయన అన్నారు. తమది ఐజెయు అని చెప్పుకునే వారికి సంఘం పేరుతో ప్రాతినిధ్యం ఉందా? అని ప్రశ్నించారు. కనీసం ఆయన పని చేసిన పంజాబ్ ట్రిబ్యూన్ 14 మందిని సస్పెండ్ చేసినా వ్యక్తిగతంగా లేదా సంఘ పరంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన ఇవ్వలేదని, ఐజెయునే పోరాడి సస్పెన్షన్ ఎత్తివేయించిందని తెలిపారు.

2011లో హైదరాబాద్ నగరంలో జరిగిన ఐజెయు 7వ ప్లీనరీలో వరుసగా మూడవ సారి అధ్యక్షునిగా కొనసాగాలనే కాంక్షతో ఉన్న వ్యక్తిని ప్లీనరీ బహిష్కరించినప్పుడు, ఆయనతో వెళ్ళి సంఘం పెట్టున్నారని, ఈ వ్యక్తి కూడా వారితో ఉన్నారని చెప్పారు.

తిరిగి ఆ సంఘమే ఐజెయులో విలీనమవుతామని ఏకగ్రీవంగా తీర్మానించి, విలీనం చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక లేఖలను శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో విడుదల చేశారు.

టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ,
గత కొద్ది రోజుల నుండి మీడియా, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి ఎలాంటి అవగాహన లేని కొన్ని శక్తులు, వారి వ్యక్తిగత , రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిస్టు ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.143 సంఘం అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి కోసం పని చేసిందని ప్రశ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపియుడబ్లుజె, తెలంగాణ ఏర్పడిన తరువాత టియుడబ్లుజెకు ఆరు దశాబ్దాల జర్నలిస్టుల ఉద్యమ చరిత్ర ఉన్నదని తెలిపారు. ఎందరో ప్రముఖ, సుప్రసిద్ధ జర్నలిస్టులు, క్షేత్ర స్థాయి నుండి రాష్ట్రా స్థాయి జర్నలిస్టులు ఈ సంఘంలో భాగస్వాములని, వారిని అడిగితే చరిత్ర తెలుస్తుందన్నారు.

కనీసం కార్మిక సంఘ నిబంధనలను కూడా పట్టించుకోకుండా కొత్త దుకాణం పెట్టి , తాము ఐజెయు అనుబంధమని ప్లీనరీ జరుపుకుంటున్న వ్యవహారం గతి లేని సంసారానికి మతిలేని మొగుడు వ్యవహారంలాగా ఉన్నదని ఎద్దేవా చేశారు.

ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తిని ఐజెయు నాయకుడని చెబుతున్నారని, ఇది వర్కింగ్ జర్నలిస్టు ఉద్యమాన్నే అవమానించడమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ రికార్డులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికార్డులు, కేంద్ర సమాచార శాఖ రికార్డులు పరిశీలిస్తే ఐజెయు ఎవరిదో తెలుస్తుందని, అసలు ఐజెయు పేరు వాడుకునే హక్కు 143 సంఘానికి లేదని, చట్ట ప్రకారం శిక్షకు గురై అభాసు పాలవుతారని విరాహత్ తీవ్రంగా హెచ్చరించారు.

ఇటీవలే చెన్నైలో ఐజెయు పదవ ప్లీనరీ ఘనంగా జరిగిందని, 22 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యారని, ఐజెయు అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్మూలతో సహా నూతన కార్యవర్గాన్ని సైతం ఎన్నుకున్నామని చెప్పారు.

తాము ఒక జాతీయ సంఘాన్ని తెచ్చామని ప్రభుత్వానికి కల్లబొల్లి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తున్నారని, సిఎం కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఐజెయు ఏమిటో, కార్మిక శాఖలో ఎవరి నాయకత్వాన ఐజెయు ఉన్నదో ఆయనకు స్పష్టంగా తెలుసునన్నారు.

తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న సంఘాన్ని మొన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో, నిన్న వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మట్టికరిపించారని అన్నారు. కనీసం 33 జిల్లాల్లో మహాసభలు పెట్టుకునే శక్తి లేక ఉమ్మడి జిల్లా మహాసభలు పెట్టి, కార్మిక సంఘ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా కాగితాలపై కమిటీల పేర్లు రాసుకుంటున్నారని దుయ్యబట్టారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఒక నాయకునికి నిద్ర పట్టడం లేదని, నిఘా విభాగాలు ఓటమి ఖాయమని చెబుతుండడంతో జర్నలిస్టుల ఉద్యమాన్ని వాడుకుంటున్నారని అన్నారు. అసలు ఆ నాయకుని స్వంత జిల్లాలో జర్నలిస్టులకు ఏమి చేశారని ప్రశ్నించారు. తమ సంఘం కృషితో దాదాపు 330 మంది జర్నలిస్టులకు ఆ జిల్లాలో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లభించాయన్నారు.

టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రయోజనాలను ప్రభుత్వ పాదాల దగ్గర పణంగా పెట్టి పబ్బం గడుపుకుందా మనుకుంటున్న సంఘం మరో నాటకానికి తెర తీసిందని మండిపడ్డారు. జర్నలిస్టులు అనుభవిస్తున్న ప్రతి హక్కు, సంక్షేమ పథకం ఉమ్మడి రాష్ట్రంలో ఎపియుడబ్లుజె, తెలంగాణలో టియుడబ్లుజే పోరాటల ఫలితమేనని చెప్పారు.

ప్రభుత్వ సంఘమని వారు చెప్పుకుంటున్నప్పటికీ జర్నలిస్టుల నుండి వారి సభ్యత్వ కార్యక్రమానికి స్పందన రాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర మహాసభలను రాజకీయ మేళాలాగా చేస్తున్నారని అన్నారు. చాలా మంది 143 నుండి ఐజెయులోకి వస్తుండడంతో , ఇప్పుడు ఐజెయు ప్లీనరీ అంటూ అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎడెనిమిదేళ్లుగా రాష్ట్ర సంఘం ఉన్న వాళ్లకు ఇంత కాలం కూడా జాతీయ స్థాయి సంఘానికి అనుబంధంగా లేకపోయారని చెప్పారు. మహాసభలను నగరంలో పెడతామని ప్రకటించి, నగర శివారులో పెట్టడం వెనక మతలబేంటని ఆయన ప్రశ్నించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking