Header Top logo

పరిషత్‌ ఎన్నికలు ఏకపక్షం – ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అనంత స్పష్టీకరణ

AP 39TV 06ఏప్రిల్ 2021:

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో వచ్చిన తీర్పే మళ్లీ రాబోతోందన్నారు. ఈ విషయం ముందుగానే గ్రహించే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నాటకం ఆడారని అన్నారు. మంగళవారం రాజీవ్‌ కాలనీ, నారాయణపురం పంచాయతీల్లో ఎంపీటీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ‘ఫ్యాన్‌’ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతపురం నగరానికి దీటుగా పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ  అనంతపురం నియోజకవర్గంలో పంచాయతీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ ఖాతా కూడా తెరవలేదన్నారు. అదే తరహాలో ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. నియోజకవర్గంలో రూ.170 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. రోడ్లు, డ్రెయినేజీ సమస్యల్లేకుండా చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పరిపాలన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరుస్తున్న ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు మునిసిపల్‌ ఎన్నికల తర్వాత తన పార్టీ పరిస్థితి ఏంటో అర్థమైపోయిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఆయన దిట్ట అని విమర్శించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పొత్తు పెట్టుకోవడం వల్లే ఇన్నాళ్లూ ఆ పార్టీ విజయం సాధించిందన్నారు. ఓ వైపు చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు పలు చోట్ల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం టీడీపీ కన్‌ఫ్యూజన్‌లో ఉందని తెలిపారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబు తిరుపతిలో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. నారా లోకేశ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండడం వల్లే లోకేశ్‌ మంత్రి కాగలిగారన్నారు. అధికారంలో ఉండగా ఏనాడూ ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. అందుకే ఇప్పుడు టీడీపీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఢీకొడతామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, బీజేపీలే కారణమన్నారు. 2014 ఎన్నికల్లో వెంకన్న సాక్షిగా తిరుపతిలో హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చారని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో మరోసారి ప్రజలు వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking