Header Top logo

పిల్ల కాలువ ( కథ ) పర్కపెల్లి యాదగిరి

పిల్ల కాలువ ( కథ )

చీకట్లు పలుచబడుతున్న వేళ…  పక్షులు శ్రావ్యమైన గొంతులతో సుఫ్రభాతం ఆలపిస్తూ ఉంటే, సూర్యుడు అరుణవర్ణపు కంబళిలో కదులుతూ ఉన్నాడు.చలిగోవు వాత్సల్యంతో ప్రకృతి దూడని అణువణువూ నాలుకతో మృదువుగా స్పృశిస్తూ ఉన్నది.రంగనాయకుల గుట్టని ఆనుకొని ఉన్న కొలనులోని నీరు మంచుపొర కింద గజగజా వణికిపోతోంది.తామర దళములు తమ అరచేతిలో రాలిన మంచుబిందువులు పాదరసం లాగా అటూఇటూ కదులుతూ ఉంటే మురిసిపోతున్నాయి.ఈదురు గాలికి గుట్టమీద నర్రెంగా చెట్లు ఆకుల కోసల మీద మంచు బుడగలు కిందకు రాలేందుకు సిద్ధంగా ఉన్నాయి, వాటిలో వేకువ రంగు ప్రతి బింబిస్తున్నది. చలికి తాళలేక దాని కొమ్మలు కిర్రుమంటూ రొద చేస్తూ ఉన్నాయి.

రంగాచారి గుట్ట మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. పంచె కట్టుకొని భుజం మీద కండువా వేసుకున్నాడు. ఒంటి మీద మరేమీ లేక పోయేసరికి చలిగాలి తాకిడికి గజగజా వణికి పోతున్నాడు. పెదవులు అతడి ఆధీనం కోల్పోయి వీణా తంత్రుల్లాగా కంపిస్తున్నాయి. అతడి నగ్నపాదాలు స్పర్శని కోల్పోవడంతో, తూలి పడబోయి బండని పట్టుకున్నాడు. ఒళ్ళంతా జలదరించింది. ఆయాసపడుతూ ఆగి గుడివైపు తలెత్తి చూస్తూ ” రామా..రామా..” అంటూ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. నెమ్మదిగా గుడివరకు చేరుకొని ద్వారపూజ ముగించి అర్చన ఆరంభించాడు.భక్తులు ఒక్కొరొక్కరుగా వస్తూ ఉన్నారు.
నిత్యం దర్శనానికి వచ్చే కైలాసం కూర్చొని భారీ కాయపు అలసట తీర్చుకుంటూ లోపల్లోపలనే దైవనామ స్మరణ చేస్తున్నాడు.
” స్వామీ..మేము రోజుకు ఒకసారి ఎక్కి దిగితేనే ఒచ్చే పోయ్యే ప్రాణాలు అయితానయి. మీరు రోజుకు రొండు మూడు సార్లు ఎక్కి దిగుతరు..ఊ..” అన్నాడు కైలాసం రంగాచారిని ఉద్దేశించి.
రంగాచారి గలగలా నవ్వాడు.” మాకు తప్పదు గదా సావుకారి, మా తాతలు ముత్తాతలప్పుడు ఈ తంతెలు కూడా లేవట, మా తండ్రి చిన్నతనాన ఇవి కట్టిండ్లట, ఇంకా వాళ్ళ కష్టం ఎట్లా..ఉండి ఉంటది..మా పూర్వీకులు నాకు వారసత్వంగా ఇచ్చింది ఈ గుడి అర్చకత్వమే..నేను ఏ కష్టమైన ఓర్చుకొని కొనసాగించడం నా బాధ్యత…మా తాత ఇవన్నీ చెప్పేవాడు..ఈ కష్టాలకు భయపడ వద్దని..”
” అవునా… స్వామీ.. ఈ కాలం శిన్న ఈడొల్లకే మొకాళ్ళ నొప్పులు రావట్టే, ఇంతమీదికి ఎక్కలేక శాన మంది రారు.గుడి కింద ఉండుగదా మత్తు డెవలాఫ్ అవ్వు”
రంగాచారి గొల్లున నవ్వాడు.” దేవుడు భక్తుల దగ్గరికి రాడు, భక్తులే దేవుని దగ్గరకు రావాలే, చేతగాక పోతే కింది నుంచే దండం పెట్టుకోవాలె. మీదికి ఎందుకు రాలేదని దేవుడు కొడుతడా.. నడవ లేని పెద్దమనుషులు వాకిట్లోంచి కనబడే గుడి గోపురాన్ని చూసుకొని మొక్కు కోవాలే.. అసలు ఈ గోపురాలు కట్టేదే దూరంగా ఉన్నవాళ్లు మొక్కుకోవడానికే అని మా పెద్దలు చెపుతారు, మన తృప్తి మీద ఆధారపడి ఉంటది”


” సామీ.నా బాధ మీ గురించే.. భక్తులు శాన వస్తే మీకు సుతం ఎల్లువాటు అయితది, మల్ల మీది సోచ్చుకపోయ్యే గునం కాదు..మీవోళ్లు అందరు ఇంతే.. నేను సూత్తనే ఉంటి..”గొంతు తగ్గించి అన్నాడు.
రంగాచారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, నవ్వుతూనే ” భగవంతుడే దిక్కుమాకు, మాతాత గారి హాయాములో ఈ మాత్రం భక్తులు కూడా వచ్చేవారు కారట, ఇంకా ఈ గుట్టమీది గుడ్డేలుగులు ఉండేవట, చలికాలంలో తెల్లవారు ఝామున దివిటి పట్టుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ గుట్ట ఎక్కేవాడంటా వాళ్ళ కష్టంలో నేను పడేది ఎంత ”
” అప్పటి బతుకుడు వేరు, ఇప్పటి బతుకుడు వేరు, అప్పుడు కడుపు నిండితే చాలు.ఇప్పుడు ఇంకెన్ని కావాలె..మల్ల పది పన్నేడేండ్ల ఆడివిల్లలు ఉండిరి.. వాళ్ళ సదువులు ఫీజులు…మల్ల మీకు రిజర్వేషన్ ఉండదాయే..వాళ్లకు నౌకర్లు దొరుకుడు కష్టమే..వాళ్ళ లగ్గాలు ఊకేనే అయితయా.. అయ్యగార్లాయే…ఎట్లనో ఒగట్ల ఉండలేరాయే..” అన్నాడు కైలాసం.
” కొందరు బాగానే బతుకుతున్నరు.. కొందరు నావంటి పేదలు కూడా ఉన్నారు..మా అదృష్టం గిట్ల ఉన్నది….. అంత స్వామి దయ..ఆయననే నమ్ముకొని బతికేటోళ్లం… ఇవన్నీ ఆలోచించుకుంటే భరించలేము..డిగ్రీ దాకా చదువుకున్న..ఏదైనా ఉద్యోగం చేయొచ్చు.. వారసత్వంగా వచ్చే రోగాలూ, ఆస్తులు అనుభవించినట్టే.. వారు ఒప్పచెప్పిన బాధ్యతని కూడా నెత్తిమీద వేసుకోవాలి..” జీర ధ్వనించింది గొంతులో.
పదకొండు గంటలు దాటింది, చిల్లర నోట్లు లెక్కించగా మొత్తం ఎనుబది ఆరు రూపాయలు ఉన్నాయి. నాలుగు కొబ్బరి ముక్కలు పట్టుకొని మెట్లు దిగుతూ ఉంటే, రెండు కోతులు ఎదురు రాగా రెండు కొబ్బరి ముక్కలు వేసాడు, ఒక కోతి పట్టుకొని చెట్లలోకి వెళ్ళిపోయింది, మరో కోతి చూస్తోంది కానీ ముట్టుకోవడం లేదు.
‘ హు.. కడుపునిండిన కోతికి కొబ్బరిముక్క చేదు, ఎండిన కోతికి పరమాన్నం ‘ అనుకున్నాడు.
రంగాచారి ఇంటి గడపలో అడుగు పెడుతూ ఉంటే, చిన్నకూతురు ఎదురుగా వచ్చి” నాన్నా…ఫీజు కట్టలేదని అక్కనూ నన్నూ ఎగ్జామ్ రాయనీయలేదు..మల్ల ఇంటికి పంపించారు ” అంది.
నవ్వుతూ ” రెండు రోజుల్లో..కట్టేద్దాం..తర్వాత రాపిస్తారమ్మా…ఏం బెంగ పెట్టుకోకండి” అంటూనే డబ్బులు భార్య సుగుణ చేతిలో పెట్టాడు.
ఆమె అతని ముఖంలోకి చూసింది.ఆమె కళ్ళు పిల్లకాకి నోరులాగా ఉన్నాయి.ఏడ్చినట్టు గమనించి వాకిట్లోకి వెళ్ళాడు.
” స్కూల్లో సారుకు చెప్పిరాండి…పిల్లలు బెంగ పెట్టుకున్నారు, మళ్లీ చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు” సుగుణ గొంతు పూడుకు పోయింది.
” ఏం చెప్పమంటావ్ పోయి..నాకే సిగ్గనిపిస్తోంది..చెప్పీ చెప్పీ…వారికి కూడా బిల్డింగ్ రెంట్, టీచర్స్ సాలరీలు ఇవన్నీ మనం పే చేస్తేనే అవన్నీ ఎల్లుతాయి…వాళ్ళ తిప్పల్లు వారికి ఉన్నాయి ” అన్నాడు రంగాచారి.
” చిన్నారీ…చిన్నతాతగారు గుల్లో ఉంటారు..నువ్ వెళ్లు, నేను ఫోన్ చేసి చెప్తాను” అంది సుగుణ.
చిన్నారి కుందేలు పిల్లలాగా పరుగెత్తింది.
సుగుణ ఫోన్ డయల్ చేసి ” చిన్నాన్న… చిన్నారి వస్తోంది, ప్రసాదం ఉంటే పంపండి ” అంది.
మూడురోజులు గడిచాయి..
రంగాచారి గుడినుండి ఇంటికి చేరుకున్నాడు.సగం వరకు పులిహోర ఉన్న గిన్నె కనపడింది.
” సుగుణా.. ఈరోజు కూడా చిన్నమామగారి వద్దకు పంపించావా” అన్నాడు.
” పిల్లలు రాత్రే అర్ధాకలితో నిద్రపోయారండీ… బంగారు తల్లులు..అర్ధం చేసుకుని అన్నం పెట్టమని కూడా అడగరు, మీరు వచ్చేప్పుడు మూటలు కట్టుకోని వస్తారనే ఆశ లేదు కదా… ” ఆమె మాటలు తెగిపోయాయి, ఆమె కళ్ళల్లో నీళ్ళు మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి.లోపలికి వెళ్ళిపోయింది.
” అయ్యో…ఇప్పుడు ముహూర్తాలేం లేవు కదా…ఇంకా నెల గడిస్తే మొదలవుతాయి..ఇప్పుడు కొంచెం ఓపిక పట్టాలి ”
” అపుడు మాత్రం ఏముంటాయి…పొట్టకు ఇబ్బంది ఉండదు..ఇలాంటి రోజుల్లో ఈ ఘోష మళ్లీ ఉండేదే..” అంది లోపల నుండే.
అరుగుమీద కూర్చున్నాడు, కన్నీళ్ళు కార్చాడు రంగాచారి.’ ఈ బతుకు బతికేకంటే చచ్చిపోయింది మేలు’ అనుకుంటూ బయటకు వచ్చాడు.
‘ ధర్మన్నగాడు..ఎక్కడున్నాడో..వాడ్ని కలిస్తే ఏదన్నా మార్గం చూపే వాడేమో..వాడు ఇప్పుడు ఎక్కడ దొరుకాలే..ఐదేళ్లు దాటే..వాడి మొహం అగుపడక..’ అనుకున్నాడు.
అగమ్యగోచరంగా చాలాసేపటినుండి చెప్పులు లేకుండా నడుస్తూనే ఉన్నాడు.పాదాలు దుమ్ముకొట్టుకుపోయాయి. వేళ్ళనుండి రక్తం కారుతోంది, అంగీ లేకపోయే సరికి ఎండవేడిమికి ఒళ్ళు బగ్గుమంటుంది,గొంతు తడారి పోతోంది, పెదవులు నాలుకతో తడుముకున్నాడు, శ్వాసవేగం పెరిగింది, ఆయాసపడుతూ ఉన్నాడు,ఛాతీలో నొప్పి మొదలయ్యింది.
‘ నాకు చావు రావలసిందే..ఎందుకూ పనికిరాని ఈ శరీరం, భార్యా పిల్లలకు బుక్కెడు కూడు పెట్టలేని శరీరం..నిప్పుల్లో కాలి పోవలసిందే..అప్పుడు గాని ఈ ఒంటిమీద నాకు కసిదీరదు ‘ అనుకున్నాడు.
ఆవేశం క్షణం క్షణం పెరుగుతోంది, నడకవేగమూ పెరిగింది బోర్లాపడిపోయాడు, బొడ్లో నుండి డబ్బులు రాలిపోయాయి.తువ్వాలు అంచుకు ముడివేసి ఉన్న కొబ్బరి ముక్కల మూట దూరంగా పడింది. నెమ్మదిగా లేచాడు, తువ్వాలు చేతికి చుట్టుకున్నాడు. ఒళ్ళంతా మట్టి అంటుకున్నది, మోకాళ్ళు మోచేతులూ నెత్తురోడుతున్నాయి, కళ్ళు మూస్తూ తెరుస్తూ, తూలుతూ రోడ్డుపక్కన గల చెట్టుమొదట్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు రంగాచారి.
“ఉల్లిగడ్డా…ఆ ఉల్లీగడ్డా…” అరుస్తూ బండి నెట్టుకుంటూ వచ్చే అతడికి కింద పడిన డబ్బులు కనపడగా తీసుకొని రంగాచారి వైపు చూసాడు. ” పంతులూ…పంతులూ..ఈ పైసలు నియ్యేనా.. ” అడిగాడు.
రంగాచారి ఆశ్చర్యపోయి అతడి వైపే చూస్తూ ఉన్నాడు.
” రంగన్నా…నువ్ ఇక్కడేందిరా…ఈ దెబ్బలూ..ఈ దుమ్మూ..ఈ అవతారమూ ఏందిరా..లెవ్..నిలబడు..
“ధర్మన్నా..ధర్మన్నా…నువ్ బాగున్నావురా ” అంటూ నిలబడ్డాడు రంగాచారి.
” నేను బాగానే ఉన్నానురా..ఏంది ఇదంతా”
” తూలి పడిపోయినరా..”
ధర్మన్న తన తలకు చుట్టుకున్న తువ్వాలు తీసి దుమ్ము దులిపాడు, సీసాతో నీళ్లుతెచ్చి తాగించాడు, గాయాలమీద నీళ్లు చల్లాడు.” పా ఇంటికి పోయి మాట్లాడుకుందాం, మెల్లగా నడువ శాతనైతది గదా..”
” అప్పట్లో.. గాయత్రి టాకీస్ వెనుక అంబెడ్కర్ నగర్లో.. ఉన్నా అన్నావ్..అక్కడ్నే ఉన్నావారా..నువ్ దొరుకుతవో లేదో అనుకుంటనే బయలుదేరినరా ” అన్నాడు.
” ఆ..అవును ఆడనే ఉన్న.. ఎహె ఉల్లిగడ్డ ధర్మన్న అంటే ఏ ఉల్లిగడ్డ అమ్మేటోన్ని అడిగినా చెప్తడు.. అంబేత్కర్ నగర్ కొచ్చి అడిగితే సాలు ”
రేకులతో, చెక్కలతో, అట్టలతో, ప్లాస్టిక్ కవర్లతో ఉన్న ఇళ్ల మధ్యలో, ఇరుకు సందులగుండా కాలువలు దాటుతూ ఇంటికి చేరుకున్నారు.
కండువా మూట విప్పి రెండు కొబ్బరిముక్కలూ, రెండు అరటిపండ్లు తీసి ” ధర్మన్నా.. పిల్లలకోసం ఏమి తేలేక పోయానురా” అన్నాడు రంగాచారి.
” నువ్ నాకు ఇయ్యాల ఇట్లా కండ్లవడుడే ఎక్కువ, అట్లా ఏమి అనుకోకు, అసలు ముచ్చట ఏందో చెప్పు ”
రంగాచారి తన విషయం అంతా చెప్పాడు.
” ఇన్ని కష్టాలల్ల నేను నీకు యాదికి రాలేదార.. నేను సచ్చిపోయినా అనుకున్నవా..భార్యా పిల్లల్ని ఉపవాసం ఉంచుతున్నవ్ కనీ నాదగ్గరికి రాలేదు” అన్నాడు ధర్మన్న.
ఇయ్యాల…చచ్చి పోవాలనిపిచ్చిందిరా..నువ్ గుర్తుకు వచ్చినవ్..నిన్ను వెతుక్కుంటూ బయలుదేరిన.. నీ గురించి చెప్పురా ”
” నా గురించి ఏమున్నదిరా.. రొండు కిడ్నీలు కరాబయినయట, డయాలసిస్ చేయించుకుంటున్న..” అంటూ మెడ చుట్టూ ఉన్న తువ్వాలు తీసి నీడిల్ చూపించాడు. “అసలు..నాకు బీపీ సుగరూ ఉండేనట, నాకు ఏర్పల్లేదు, కొన్ని దినాలు..ఈ బస్తిల ఆరేంపి దగ్గర సూదులు ఏసుకున్నరా… కాల్లు జేతులు వాసి దావుకానకు పోతే చెప్పిండ్లు ” అన్నాడు ధర్మన్న.
కొద్ది క్షణాలు రంగాచారి మౌనంగా ఉండిపోయాడు.
” అయ్యో… నువ్ బ్యారం చేయడం ఆపేసి రెస్ట్ తీసుకోవాలి, అంతబరువు నెట్టటం మంచిదికాదు.”
” రోజువారీ చిట్టీలు కట్టాలె, ముగ్గురు ఆడివిల్లలు ఒకలు పది మరొకలు ఎనమిది శిన్నది ఐదు సదువుతున్నరు..కిడ్నీలు కరాబు అయినోళ్లు షానొద్దులు బత్కరట…జెరంత మంచిగుండంగానే నీడ ఏదన్నా దొరింపు చెయ్యాలనని తండ్లాతన్న..పానం మునుపటి లెక్క శాతనైతలేదు ”
” గిప్పుడేం తండ్లాడుతవురా…గీ జబ్బు పెట్టుకోని.. ఇన్ని రోజులు ఏమి వెనుకేయలేదారా..”
” వాళ్ళమందం జాగలు కొన్న..ఇంతంత నగతు కూడా ఫిక్స్ చేసిన..”
కొద్ది నిముషాలుగా రంగాచారి తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు.
” ఏందిరా బీరిపోయి కూసున్నవు.. రంది పడితే అయితదా.. ధైర్నం చెడొద్దురా.. జెరంత తిను..ఎప్పుడు తిన్నవో ఏమో.. మొకమంత గుంజుక పోయింది. ఏమి పట్టింపులు గిట్ల లెవ్వుకదా.”
” నేను ..టెన్త్ లో ఉన్నప్పుడు నీ టిఫిన్ల కూర తినని రోజు ఉండేదారా..” అన్నాడు రంగాచారి.
” ఇప్పుడు గుల్లే పూజారివైతివీ..కార్యాలు చెయ్యవడితివనీ..” నవ్వాడు.
” మేము బియ్యం..ఉప్పులు పప్పులు ఎవ్వరిచ్చినా వండుకొని తింటం.. పారేయ్యంగదరా.. మీ ఇంట్ల వండింది తింటేనే పోతదా… గవన్ని మాకైతే లేవు ”
” అవును..నిజమే..చిన్నప్పుడు మనం ఒగలది ఒగలం గుంజుకోని తింటిమీ ” అన్నాడు ధర్మన్న.
రంగాచారి అన్నం తింటూ ” అరేయ్ ధర్మన్నా…నేను మల్ల చెపుతున్న.. ఈరోజు చచ్చిపోవాలనే బయటకు వచ్చిన..నువ్ దేవునిలాగా గుర్తుకు వచ్చినవ్..ఇటు తొవ్వ పట్టుకొని వచ్చిన.. నువ్ ఇంత అనారోగ్యంతో కూడా పని చేస్తున్నవ్..నిన్ను చూసినంక నాకు బాధ కలుగుతాందీ.. ధైర్యం కూడా వచ్చిందిరా” అన్నాడు.
” నీ మొకం సచ్చినవ్ తీ… నా దగ్గర ఐదువేయిలు న్నయి.. తీసుకపో..ఇంట్లకు సామాను తెచ్చిపెట్టు..”
” ధర్మన్నా.. చేపలు పట్టడం నేర్పాలరా..పట్టి ఇవ్వొద్దు..సోమరులు అయితరు, నేను కూడా ఉల్లిగడ్డ బేరం చేస్తా…నాకు నువ్వే అన్ని ఏర్పాటు చెయ్యాలే”
” ఇన్నోద్దులు పూజారి పని చేసినవు.. బ్యారం నీతోటి ఏమైతదిరా..సప్పుడుజెక ఊకో..”

” నేను అన్నిటికీ సిద్ధమైనరా..మా బంధువులు చాలా మంది ఉద్యోగాలు..వ్యాపారాలు..చేస్తున్నారు..మెకానిక్..రెగ్జిన్ పని కూడా చేస్తున్నారు..
…పెండ్లాం పిల్లల సాదుకుంటే అయపాయే..”
” డిగ్రీ దాకా సదువుకుంటివీ..ఏదన్నా నీడపట్టు పని సూస్కపోరా.. వచ్చేది ఎండాకాలం..గాబరై అడ్డం బడుతవ్.. ఇంట్ల భార్య పిల్లలు..సుట్టాలు ఏమన్నా అనుకుంటరు.. నీతోని గాదు.. ఆ ఐదువేయిలు తీసుకోని పోరా..నీకు ఎల్లిన్నాడు తెచ్చియ్యి..” నవ్వుతూ అన్నాడు ధర్మన్న.
” నేను బ్యారమే చేస్తారా..ఎవ్వరేమి అనుకోరు..అనుకున్నా బాధలేదు..నా భార్యకు గుడి ఒప్పజెప్తా.. ”
” మరి బైటి కార్యాలప్పుడు నువ్ పోతవా.. అట్ల పోతే మాల్ కరాబైతదీ..దిగితే మొత్తం దిగాలే..”
” బయట కార్యాలకు ఆమెనే పంపిస్తా..నువ్వేం బెంగ పడకు..”
” ఆడిమనుషులు చెయ్యంగైతే నేను యాడ సూడలేదు మరీ..”
” పెళ్లిళ్లు చేసే మహిళలు కూడా ఉన్నారు..నీ బ్యారం నాకు నేర్పు..వారం తర్వాత నీ బండి నాకు ఒప్పజెప్పు.. నీకు ఇచ్చేది నీకిస్తా..నేను తీసుకునేది నేను తీసుకుంటా.. నువ్ ఇదే వాడల కూరగాయల దుకాణం పెట్టుకోరా…వచ్చేది ఎండాకాలం..నీళ్ళు తక్కువ తాగేడిది ఉంటది..”
” అవ్.. ఇప్పటికే డాక్టర్ దినామ్ లీటరు లీల్లే తాగుమన్నడు.. ఎండకు తిరుగుట్ల ఎక్కువ తాగుడు అయితున్నది..” అన్నాడు ధర్మన్న.
” ఏం పర్వాలేదు..డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు తీసుకో..నాకు తెలిసిన హోమియో..ఆయుర్వేదం డాక్టర్లను కలుద్దాం..భగవంతుడున్నడు.. అన్యాయం చెయ్యడు.. మనకు..అంత మంచే జరుగుద్ది..నేను బండి నెట్టుత.. నువ్ అమ్ము..ఒక వారంలో నాకు అన్ని బోధపడుతాయి.. ”
” ఏమోర వారి..నువ్ బ్యారం చేసుడు.. నాకు ఎట్లనో అనిపిత్తా ఉన్నది ” అన్నాడు ధర్మన్న.
” ఏమి చెయ్యకుండా ఉంటే..నా పిల్లలు నేను ఆత్మ హత్య చేసుకునుడే ఉంటది..మేము బతుకు పోరులో అలిసిపోయినంరా..నాకు ఒక్క అవకాశం ఇయ్యిరా ధర్మన్నా..”
వారం రోజులు గడిచాయి..
ధర్మన్న తాను నివాసం ఉండే బస్తీలో కూరగాయలు అమ్ముతున్నాడు..
రంగాచారి బండి మీద ఉల్లిగడ్డ ఆమ్ముతూ ఉన్నాడు.

పర్కపెల్లి యాదగిరి, రచయిత
9299909516

Leave A Reply

Your email address will not be published.

Breaking