బీఆర్ఎస్ ను బొంద పెడితేనే సర్పంచులకు పూర్వ వైభవం
*తండ్రీ, కొడుకులు రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చారు
*సర్పంచుల వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారు
*సర్పంచులకు రావల్సిన నిధులను విడుదల చేయాలి
*బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి
*ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్పంచుల ఆత్మహత్యలు
*చనిపోయిన ప్రతీ సర్పంచ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ను బొంద పెట్టి, కేసీఆర్ కు అధికారం లేకుండా చేస్తేనే సర్పంచులకు పూర్వ వైభవం వస్తుందన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ సర్పంచుల వ్యవస్థను సర్వం నిర్వీర్యం చేశాడని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 60మంది సర్పంచులు చనిపోయారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ వైఖరి వల్ల చనిపోయిన ప్రతీ సర్పంచ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని చెప్పారు. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని తెలిపారు.
సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందన్నారు. అయినా హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని, ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలిపారని చెప్పారు రేవంత్.
సర్పంచులకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాల్సి ఉంటుందని, కానీ వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోందని విమర్శించారు.
సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి, వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే సర్పంచులకు రావాల్సిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా చెట్టు చనిపోయినా సర్పంచ్ ను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చెట్టు చనిపోయినందుకు సర్పంచ్ ను సస్పెండ్ చేస్తే… నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలని రేవంత్ ప్రశ్నించారు.
కేటీఆర్ నిర్లక్ష్య వైఖరితో మూసీలో మునిగి 30 మంది చనిపోయారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మామూలు పరిస్థితులు లేవని, ఇందులో మునిసిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు.
రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని తెలిపారు రేవంత్.
తెలంగాణలో పుట్టబోయే బిడ్డమీద కూడా కేసీఆర్ రూ.1లక్షా 50వేల అప్పు వేశాడని, తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి
బీఆరెస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని భస్మాసుర సమితి అని ఎద్దేవా చేశారు రేవంత్.
సర్పంచుల వ్యవహారంలో తన బుద్ది మార్చుకోకపోతే భస్మాసుర సమితి కూడా కేసీఆర్ ను కాపడలేదని హెచ్చరించారు.
4వేల కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్.. వాటిలో ఎక్కడైనా భవనాలు కట్టించారా అని నిలదీశారు.
ప్రగతి భవన్, సెక్రటేరియట్‌లకు వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ సర్పంచులకు నిదులు విడుదల చేయడంపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ అధికారం పోవాలని, బీఆరెస్ ను బొంద పెట్టాలన్నారు.