Header Top logo

జర్నలిస్ట్ అమరయ్య ఆకుల స్వీయానుభవం

నేనూ స్టాన్‌ఫోర్ట్‌ వర్శిటీ మెట్లెక్కా!
-విజ్ఞాన వీచికల రాదారి
– అమరయ్య ఆకుల, జర్నలిస్ట్

డాక్టర్‌ అబ్దుల్‌ కలాం చెప్పినంత కాకపోయినా నాకూ పేద్దపెద్ద కలలే వచ్చేవి చిన్నప్పుడు! చెడ్డీ చిరిగి చాటంతైనా మాచికలకు తికాణా లేకపోబట్టి గాని లేకుంటే గుర్రం ఎగిరేదేమో! మా ఊరు అడవిపాలెం నుంచి అడ్డరోడ్డు మీదుగా నరసరావుపేట దాటి గుంటూరు హిందూ కళాశాల చేరినప్పటి నుంచి మనోటితో పాటు నాలుగైదు విదేశీ యూనివర్శిటీల పేర్లు నోట్లో ఉండేవి. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్, హార్వార్డ్, గ్లాస్గో, మాస్కో లాంటివేవో.. ఏమైతేం, ఏ యూనివర్శిటీ మెట్లెక్కకుండానే పొద్దు వాలింది. కల చెదిరింది. వాటిల్లో చదవకున్నా ఓసారి చూస్తే బాగుండన్న కోర్కే మాత్రం చావలేదు. అదిగో అలా ఇప్పుడొకటి నెరవేరింది.

స్టాన్‌ఫోర్డ్‌ వయా శాన్‌ఫ్రాన్సిస్కో…

అమెరికాలో చూడాలనుకున్న ఐదారిట్లో స్టాన్‌ఫోర్డ్‌ వర్శిటీ ఒకటి. కాలిఫోర్నియా ఒకప్పటి రాజధాని శాన్‌ఫ్రాన్సిస్కో. చైనా, వియత్నాం, కొరియా, జపాన్‌ వంటి ఆసియా దేశాల వాళ్లూ ఎక్కువే. చైనా టౌన్‌ షిప్‌ ఉండనే ఉంది. సంపన్న రాష్ట్రం. అందమైన ప్రాంతం. పసిఫిక్‌ సముద్రపు రెండు కొనల్ని కలిపేలా 1933నాటి ఊగే వంతెన (సస్పెన్షన్‌ బ్రిడ్జి– గొల్డెన్‌ గేట్‌), అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మాదిరి దేశ ద్రోహుల్ని, దొంగల్ని, కరుడుకట్టిన నేరస్తుల్నుంచేలా సముద్రం మధ్యలో ఓ కొండపై కట్టిన అల్కట్రాజ్‌ ఐలాండ్‌ జైలు, ఓ వందమైళ్ల దూరంలో వైన్‌ తయారీకి పేరుగాంచిన నేపా వ్యాలీ, నాలుగైదు మంచి బీచ్‌లు, పెద్ద హార్బరు, భూమి కింద, పైన నడిచే మెట్రో, మోనో రైళ్లు, మెలికలు, మలుపులు తిరిగే రోడ్లున్న డౌన్‌టౌన్‌తో పాటు మన కింగ్‌కోటీ, అడ్డగుట్ట మొదలు హైటెక్‌ సిటీని పోలిన టౌన్‌షిప్పులు కళ్ల ముందు మెదులుతాయి. బాగా రద్దీ సిటీలలో శాన్‌ఫ్రాన్సిస్కో ఒకటి. చాలా ప్రాంతాల్లో పార్కింగ్‌ పెద్ద సమస్య. ఐటీ మొఘల్‌ సిలికాన్‌ వ్యాలీ ఇక్కడిదే. యాపిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్‌డెన్‌ వంటి ఐటీ దిగ్గజాల హెడ్‌క్వార్టర్లూ ఇక్కడే. మనవాళ్లు ఎక్కువ మంది ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు.

అసలు పేరు లేలాండ్‌ స్టాన్‌ఫోర్డ్‌ జూనియర్‌ యూనివర్శిటీ..

శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌ పోర్టు నుంచి 50,60 మైళ్ల దూరంలో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం. పూర్తి పేరు లేలాండ్‌ స్టాన్‌ఫోర్డ్‌ జూనియర్‌ యూనివర్శిటీ. ఇదో ప్రైవేట్‌ పరిశోధనా విశ్వవిద్యాలయం. 8 వేల 180 ఎకరాల క్యాంపస్‌. అమెరికాలోనే అతిపెద్దది. 17 వేల మందికిపైగా విద్యార్థులు, అంతే సంఖ్యలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఇదొకటి.

2023 జనవరి 2.. మిట్టమధ్యాహ్నమే గాని ఎండ వేడేమీ లేదు. యూనివర్శిటీ మెయిన్‌ గేట్‌ దాటి లోనికి పోవడంతోనే ఏదో ఓలాంటి ఫీలింగ్‌. చేతిలో పుస్తకంతో క్లాస్‌కి పోతున్నట్టు, ఆర్ట్స్‌ కాలేజీలో ఏదో రాస్తున్నట్టు, ఆర్ట్స్‌ సెంటర్‌లో చిత్రవిచిత్రమైన బొమ్మల్ని చూస్తున్నట్టు.. ఇలా ఏవేవో మెదిలి కారులోంచి కాలు కిందపెట్టేసరికి వళ్లు జల్లంది. ఆ చేవిలో గాలి ఈ చెవిలోకి కొడుతోంది. స్వెట్టర్లు తగిలించుకుని ముందున్న పచ్చటి మైదానమంతా కలతిరిగి యూనివర్శిటీ మెట్లు ఎక్కా. ఏదేమిటో చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. నోటీసు బోర్డులు స్కాన్ చేసుకుంటూ మనమే ముందుకుపోవాలి. నోటీసు బోర్డును ఎగాదిగా చూసి క్యాంపస్‌లోకి అడుగుపెట్టాం. ఎదురుగా పెద్ద చర్చి. దానికి పక్కగా స్టాన్‌ఫోర్డు విగ్రహం.

కొడుకు జ్ఞాపకార్ధం కట్టారట…

ఇప్పటికి 132 ఏళ్ల నాటి మాట. 1885 నాటి ముచ్చట. కాలిఫోర్నియా 8వ గవర్నర్‌ అమాస్‌ లెలాండ్‌ స్టాన్‌ఫోర్డ్‌ పేరున్న పారిశ్రామికవేత్త. ఆయన భార్య జేన్‌ ఎలిజబెత్‌ లాత్రాప్‌ మనసున్న మనిషి, దానశీలి. వీరికి ఒకేఒక కొడుకు. పేరు లేలాండ్‌ స్టాన్‌ఫోర్డ్‌ జూనియర్‌. 15 ఏళ్ల వయసులో టైఫాయిడ్‌ జ్వరంతో చనిపోతాడు. కుమారుడి జ్ఞాపకార్థం ఏమైనా చేయాలనుకున్న ఆరేళ్ల తర్వాత ఆ దంపతులు– స్వేచ్ఛా వీచికలు వీయనీ– అనే ఉద్దేశంతో 1891లో వాళ్ల వ్యవసాయ క్షేత్రం (ఫారం)లో ఆడ, మగపిల్లలు కలిసి చదువుకునేలా విశ్వవిద్యాలయాన్ని పెట్టారు. న్యూయార్క్‌లోని కార్నెల్‌ యూనివర్శిటీకి దీటుగా ఆంగ్లేయుల మాదిరి ఆర్కిటెక్చర్‌ ఉట్టిపడేలా ఈ వర్శిటీని కట్టారు. 1893లో పెద్దాయన చనిపోవడంతో ఈ వర్శిటీకి కష్టాలు మొదలయ్యాయి. ఆయన ఫారంపై ప్రభుత్వం వేసిన దావాను ఆయన భార్య తిప్పికొట్టింది. ఏ లోటు లేకుండా చేసింది. అలా ఆరేడేళ్లు గడిచాయో లేదో 1906నాటి శాన్‌ఫ్రాన్సిస్కో భూకంపం యూనివర్శిటీని అతలాకుతలం చేసింది. చాలా భవనాలు నేలమట్టమైయ్యాయి. మరికొన్ని రూపురేఖల్లేకుండా పోయాయి. అయితే ఈ యూనివర్శిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డేవిడ్‌ స్ట్రార్‌ జోర్డన్‌ విశేష కృషితో ఐదారేళ్లలో నిలదొక్కుకుంది. 1910 నాటికి మెడిసిన్, లా కోర్సుల్నీ ప్రవేశపెట్టింది. ప్రకృతి విపత్తులతో ప్రతిభాపాటవాలేమీ ఆగలేవనిపించుకుంది.
ఈ యూనివర్శిటీ క్యాంపస్‌ ఎంత ఫేమస్సో అంతకుమించి చూడదగ్గది అక్కడున్న చర్చి. లేలాండ్‌ జ్ఞాపకార్థం ఆయన భార్య జేన్‌ దీన్ని కట్టించారు. 1903లో పూర్తయిన ఈ చర్చి రోమన్‌ ఆర్కిటెక్చర్‌కు దగ్గరగా ఉంటుంది. చర్చి దగ్గర్లో స్టాన్‌ఫోర్డ్‌తో పాటు మేధావులనేకుల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ యూనివర్శిటీని పూర్తిగా చూడడం ఒక్కరోజులో అయ్యే పని కాదు. అన్నీ తిరిగి చూడాలంటే కనీసం రెండు మూడురోజులు పడుతుంది.

సోల్జెత్సిన్‌ ఉన్నది హోవర్‌ టవర్‌లోనే..

కానీ చూడాల్సిన వాటిల్లో ముఖ్యమైంది హోవర్‌ టవర్‌… మేధావులకు, మేధోమధనానికి నిలయం. దేశ దిశానిర్దేశాలకు ప్రణాళికలు రచిస్తుంటారట. యువ స్టార్టప్‌లు పురుడు పోసుకుందీ ఇక్కడేనట. ప్రతి వారం ఏదోక అంశంపై పబ్లిక్‌ టాక్‌ ఉంటుందనే దానికి రుజువే అక్కడ పెట్టిన పోస్టర్‌. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమంజసమా? అనే దానిపై అక్కడ త్వరలో చర్చ జరగబోతోంది. 285 అడుగుల ఎత్తు, 12 అంతస్తులు. మొదటి 9 అంతస్తుల్లో లైబ్రరీలు, ఆర్కైవ్స్, మిగతావాటిల్లో ఆఫీసులు, పరిశోధకుల బసలు. అమెరికా అధ్యక్షుడు కాక ముందు ఇక్కడి విద్యార్ధి హెర్బర్ట్‌ హోవర్‌. 20వ శతాబ్దపు తొలినాళ్ల చరిత్ర మొదలు ‘యుద్ధం, శాంతి, విప్లవం వంటి వాటిపై ఆయన లెక్కకు మిక్కిలి పుస్తకాలను సేకరించి విరాళంగా ఇచ్చాడు. అందుకే ఈ టవర్‌కు ఆయన పేరు పెట్టారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్శిటీ 50వ వార్షికోత్సవానికి గుర్తుగా 1941లో ఈ టవర్‌ ప్రారంభమైంది.
ఈ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు సోవియెట్‌ యూనియన్‌ వ్యతిరేకి, దేశ బహిష్కృతుడైన రష్యా రచయిత, పరిశోధకుడు అలెగ్జాండర్‌ సోల్జెత్సిన్‌ 1976లో మాస్కో వెళ్లడానికి ముందు వరకు కొంతకాలం 11వ అంతస్తులో ఉన్నాడు. అబ్జర్వేషన్‌ డెక్‌పైకి పోవడానికి టిక్కెట్‌ ఉంటుంది. 1970 డిసెంబర్లో ఈ టవర్‌ పిడుగుపాటుకు దెబ్బతింది.

యూనివర్శిటీకి దగ్గర్లోనే సిలికాన్‌ వ్యాలీ..

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, స్టాన్‌ఫోర్‌ యూనివర్శిటీ ప్రధాన పరిపాలనాధికారి ఫ్రెడరిక్‌ టెర్మాన్‌ చేసిన కృషి అపారం. యూనివర్శిటీ అభివృద్ధికి సాయం కోరడంతో పాటు చుట్టుపక్కల పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా విద్యావంతులను ప్రోత్సహించారు. అలా అభివృద్ధి చెందిన ప్రాంతాన్నే ఇప్పుడు సిలికాన్‌ వ్యాలీ అంటున్నారు.
ప్రతి వంద మందిలో నలుగురికే ఛాన్స్‌…
విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏడు స్కూళ్లున్నాయి. (మనలెక్కలో కళాశాలలు), అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో 40 విద్యా విభాగాలున్నాయి. విద్య, వైద్యం, చట్టం, ఎంబీఏ వంటి బిజినెస్‌ కోర్సులు, ఇంజినీరింగ్‌ వంటి గ్రాడ్యుయేట్‌ కోర్సులకు బాగా డిమాండ్‌. దరఖాస్తు చేసుకునే ప్రతి వందమందిలో నలుగురికే ఛాన్స్‌ ఉంటుందట. అయితే యూనివర్శిటీ పేరు ప్రతిష్టలు పెంచే ప్రోగ్రాం కింద– పేరుండీ లక్షలాది మందికి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారి పిల్లలకు ప్రత్యేక కోటా కింద సీటిచ్చే అవకాశం ఉంటుందని విన్నా. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌కి సీటు అలా వచ్చిందనే చెబుతారు. పబ్లిక్‌ పాలసీ థింక్‌ ట్యాంక్‌ ఉంది. 36 రకాల క్రీడాపోటీలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి డిబేట్లు జరుగుతుంటాయి. 2022 సంవత్సరానికి స్టాన్‌ఫోర్డ్‌ వర్శిటీ నేషనల్‌ కాలేజిటివ్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీఏఏ) ఛాంపియన్‌గా ఉంది. 2021 నాటికి స్టాన్‌ఫోర్డ్‌ ప్రస్తుత, పూర్వ విద్యార్థులెవరైతేనేం 150 బంగారు, 79 వెండి పతకాలతో సహా కనీసం 296 ఒలింపిక్‌ పతకాలను గెలిచారు. ఇప్పటి వరకు 85 మంది నోబెల్‌ గ్రహీతల్నీ, 29 మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తల్నీ అందించింది. స్టార్ట్‌–అప్‌లకు నిధులు రాబట్టడంతో అద్భుత విజయాల్ని సాధించిన వర్శిటీలలో స్టాన్‌ఫోర్డ్‌ అగ్రస్థానంలో ఉంది. స్టాన్‌ఫోర్డ్‌ పూర్వ విద్యార్థులు అనేక కంపెనీలను స్థాపించారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం ఇద్దరు అమెరికన్‌ ప్రెసిడెంట్లనూ అందించింది. ప్రెసిడెంట్‌ హెర్బర్ట్‌ హోవర్‌. జాన్‌ ఎఫ్‌ కెన్నడీ. 74 మంది బిలియనీర్లు, 17 మంది వ్యోమగాములకు నిలయమైంది.
హోవర్‌ టవర్‌ చూసేటప్పటికే నాలుగు దాటింది. ఇంకా కాంటర్‌ ఆర్ట్స్‌ సెంటర్‌ చూడాలి. ఆరు గంటల్లోగా కట్టేస్తారు. రెండు అంతస్తుల్లో ఈ మ్యూజియం ఉంది. టిక్కెట్‌ ఉండదు గాని ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని వెళుతుంటారు. మేము నేరుగా వెళ్లాం. వేరే లైన్లో రమ్మని చెప్పి లోనికి అనుమతించారు. శాన్‌ఫ్రాన్సిస్కోకి ఆసియా వాసులకు దగ్గర సంబంధం ఉండడం వల్లనేమో ఎక్కువగా ఆసియా, అమెరికా దేశాల చిత్రాలే ఉన్నాయి. ఆరింటికి ఠంచన్‌గా బెల్‌ కొట్టారు. కిందికి దిగాం. కానీ, పూర్తిగా యూనివర్శిటీని చూళ్లేదనే వెలితి ఉండనే ఉంది. చివరకు కార్లోనే వర్శిటీ ప్రాంగణాన్నీ చుట్టివచ్చాం. అలా నా సందర్శన యాత్ర ముగించి స్టాన్‌ఫోర్డ్‌లో చదివినట్టు ఫీలయిపోయా! కలంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనీయకుండా చేసేదే అని అబ్దుల్‌ కలాం చెప్పింది నిజం చేసుకోలేకపోయానే అనుకుంటూ ఇంటికి చేరా..

అమరయ్య ఆకుల, జర్నలిస్టు
9347921291

Leave A Reply

Your email address will not be published.

Breaking