Yasangi rice planting poetry యాసంగి వరి నాటు – కవిత్వం
Yasangi rice plant
యాసంగి నాటు
దసరనీళ్ళుబోసుకుని
సాగుబాటుజేస్తందుకని
బాయికాడికిబోయిన నాయిన
జమ్మికాడికందరాంగనే
మనసు పాలపిట్టై పైకెగిరేది
సందకాన్నో,గూర్కోల్లు మొల్వంగనో
నాయింతోటి దాని శిత్తమొచ్చినట్లు
జాగిల్లుమూగిల్లాడేది కరంటు
గటికిబుక్కెడు నీళ్ళుదాపి
పసిబోరగాని దూపార్పినట్టు
ఒక్కొక్క బిల్లకు నీళ్ళుమల్పుకుంట
కోండ్ర కోండ్ర సాలిరువాలుగొట్టేది
బందంవ్లదిగబడ్డ అర్కెట్లగుంజేదో
అరిశెయ్యి మందం దండెబడ్డ దాపటెద్దు కాళ్ళకేఎరుక గాని
బతుకుబందంవ్లదిగబడ్డ
సంసారం గుంజలేక నాయిన
గుండెకుబడ్డ దండెలెన్నో దేవుడికేఎరుక
తుకంమడి రోకుజేసి
మండెగట్టి మొల్కల్కేటప్పుడు
పల్గురాల్లకు పసుపుకుంకుమరాసి
అల్కుడుబోనంబెట్టి నీళ్ళారబోసేది
పచ్చగబట్ననారు నాయినకండ్లల్ల
జీడికంటిపున్నపు దీపంతలయ్యేది
ఒడ్డొరంజెక్కి ఒంపుమిర్రలు సైజేసినంక
ఇర్రుంవంటున్న బుర్దకాళ్ళు
పలిగి పచ్చెలైనపాదాల్జూస్తే..
మమ్మల్నే కాదు నాయిన
దేశాన్ని మోస్తున్నట్లన్పించేది
తలా ఓ సెయ్యేసి అర్కలన్ని తోలుకొస్తే కరిగట్టునాడు బాయికాడ పెదగట్టు జాతరయ్యేది
చిన్నాయిన గొర్రుగుంజితే పొలంల
ఆకాశం మొకంజూసుకునేది
బారెడు బారెడు మునుంబట్టి
జానెడుకో కర్రజెక్కుతూ పల్లెపదం
పాడేతల్లులు పనీపాటల్ని
కవలల్నిజేసి ఆడించేటోళ్ళు
యాసంగి నాటు అయిపోయిందని
జొన్నగుగ్గిళ్లొండి గోవిందగొట్టి
నిండుగుండకల్లు మైసమ్మకింతొంపి
బొమ్మెడాకులుబట్టి కమ్ముగాదాగేది
రెక్కలకష్టందప్ప
లెక్కలపద్దులెరుగని ఆ జీవితాలు..
కష్టసుఖాలు కలబోసుకుంటుంటే
బాయిగడ్డమీద కుసోనీ బతుకుసిత్రం
జూస్తున్న నాకు పదాలుదొర్కని
మూగకైతేదో గుండెదన్నుకుని
పిక్కటిల్లేది..
– తుల శ్రీనివాస్, కవి
9948525853.
(జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా..)