Header Top logo

Why did you cry for me నన్నెందుకు కన్నారు

Why did you cry for me
నన్నెందుకు కన్నారు?

నన్నెందుకు కొట్టావ్ నాన్నా?
నన్నెందుకు తిట్టావ్ అమ్మా?

అర్థం చేసుకోలేని వయసు నాది
మీరెందుకు కొడుతున్నారో ?
ఎందుకు తిడుతున్నారో?
తెలుసుకో లేని పసి మనసు నాది

అమ్మా…!
మీ సమస్యలతో….
మీ కోపతాపాలతో
నాకేమిటి సంబంధం?
అమ్మ మీద కోపం వస్తే
నాన్న నన్నే కొడతాడు
నాన్న మీద కోపం వస్తే
నువ్వూ నన్నే తిడతావు
ఇంతకూ నేను చేసిన తప్పేమిటి?

నొప్పిగా వుంది ..నాన్నా!
నువ్వుకొట్టిన దెబ్బలకి !!
బాధగా వుందమ్మా
నువ్వు తిట్టిన తిట్లకి !!
చెప్పుకోడానికి నోరు లేదు
భరించడానికి ఓపిక లేదు
ఇప్పటికీ నాకర్థం కావడం లేదు
నేను చేసిన తప్పేమిటో?

కడుపున వున్నప్పుడే నయం
కాళ్లతో తన్నినా కోప్పడలేదు
బుజ్జిగాడు తంతున్నాడని
మీరిద్దరూ ఆనందించడం

నాకింకా గుర్తుంది ..
నాన్న నీ బొజ్జపై చెవిపెట్టి
బుజ్జోడు పిలుస్తున్నాడని
ఎగిరి గంతేసిన క్షణాలు
నాకింకా గుర్తున్నాయమ్మా!
ఇప్పుడేమైంది నాన్నకు?
నీపై కోపం వచ్చినప్పుడల్లా
నన్ను చితక్కొడుతున్నాడు
నొప్పిగా వుందమ్మా!
భరించలేనమ్మా ఈ బాధను!!

నీ కడుపున పడ్డ వార్తవిని
నువ్వూ.. నాన్నా
ఎంత మురిసిపోయారో
నా గురించి ..
ఎన్నెన్ని కలలు కన్నారో
అన్నీ గుర్తున్నాయమ్మ నాకు

తొలిసారి వార్త విన్నాక నాన్న
నీ బొజ్జమీద పెట్టిన ముద్దుకు
నేనెంతగా పరవశించానో…
మురిసిపోయానో మీకు తెలీదు
ఇప్పుడేవమ్మా ఆ ముద్దులు?
ఏవమ్మా !ఆ మురిపాలు..!!

Why did you cry for me?

నవమాసాలు మోసినపుడు కూడా
నువ్వు బాధపడటం నేనెరుగనమ్మా!
కడుపులో వున్న నన్ను…
కళ్లలో పెట్టి చూసుకున్నావ్!
మరిప్పుడేమైందమ్మా ఆ ప్రేమ

నాన్న మీద కోపంతో నాపై…
కారాలు మిరియాలు నూరుతావు.
నాన్న తాగొస్తే కోపంతో నన్ను కొడతావ్
నువ్వు లేటుగా వస్తే నాన్న నన్నే కొడతాడు
తాగి రావడం నాన్నతప్పు కాదా?
లేటుగా రావడం నీ తప్పు కాదా?
మీ తప్పులు కప్పిపుచ్చడానికి శిక్ష నాకా?
ఏందమ్మా! ఈ ఆట (విక ) తత్వం?

నిన్నకు నిన్న నాన్న కొడితే తలకు గాయం
మొన్న కోపంతో నువ్వు తోసేస్తే కాలికి ఫ్రాక్చర్
డాక్టర్ దగ్గర తలకు కట్టు..కాలు తాకట్టు!
పసివయసు విచ్చనే లేదు..కాలు నిలబడనే లేదు
ఏందమ్మా ఇది.. పుట్టానని సంతోషించనా?
ఇలా జరుగుతున్నందుకు యేడ్వనా?

మీరు ముద్దులు పంచకున్నా ఫరవాలేదు
మీ కోపతాపాల్ని నాపై చూపకండి
మీరు ప్రేమతో లాలిస్తే ఇంటికి దీపం కానా?
మీరు అక్కున చేర్చుకుంటే కంటిపాప కానా?
మీరు ప్రేమ పంచితే నేనూ ప్రేమ పంచుతా
మీరు ద్వేషం నేర్పితే నేనూ ద్వేషిస్తా!
సమాజానికి ద్వేషం కాదమ్మా…ప్రేమ కావాలి
నేను ప్రేమించాలంటే మీ లాలన కావాలి!!

(బ్యాటెడ్ బేబీస్ అంతర్వేదన
అనే ఓ మూగ రోదన )

Abdul-Rajahussen-write

ఎ.రజాహుస్సేన్, కవి

Leave A Reply

Your email address will not be published.

Breaking