They killed Gandhi and Gauri గాంధీ మరియు గౌరీని వాళ్లే చంపేశారు
They killed Gandhi and Gauri
గాంధీ, గౌరీని వాళ్లే చంపేశారు
గౌరీ
నిన్నటి రోజు నిన్ను
కొన్నేళ్ల క్రితం ఇదే రోజు పూజ్య బాపూని
వాళ్లే చంపేశారు.
స్వతంత్ర భారతంలో తొలి హత్యని
వాళ్లే చేసి
బుద్ధుడు నడిచిన పవిత్ర నేలని
ఎప్పుడూ
వాళ్లే అపవిత్రం చేస్తున్నారు.
వాళ్ల బుర్రనిండా మకిలి నెత్తురు.
వాళ్ల ఆలోచనల నిండా విభజించి పాలించే
కుట్రల నెత్తుటి దాహపు చిత్తడి.
గౌరీ
వాళ్లు ఫాసిస్ట్ నాజీ హిట్లర్ వారసులు.
వాళ్లది దేశభక్తి నినాదం
దేశ విచ్ఛిన్న విరోధం.
వాళ్లెప్పుడూ
మనిషిని మనిషి గాను చూడరు
మట్టిని బువ్వ పెట్టే మహోన్నతంగానూ చూడరు.
దేశపు విభిన్నత శాంతి మంత్రాన్ని
దహనం చేసిన దుండగులు వాళ్ళు.
నూరు పూలు వికసించే చోట
కమలోన్మాదంతో
బాబ్రీని కూలగొట్టిన విధ్వంసకులు వాళ్ళు.
గుజరాత్ మత మైనారిటీల రక్తం ఏరులై పారించిన వినాశకులు వాళ్ళు.
బాపూ… దుఃఖించకు.
నువ్వు
రాముడిని కీర్తిస్తూ ఉండగానే
అదే రామనామంతో కిరాతకంగా
నిన్ను హత్య చేసి బోర విరుచుకుని తిరుగుతున్నారు వాళ్ళు.
నిన్నే కాదు
ఇప్పుడు
నీ బొమ్మల్ని కూడా నిర్లజ్జతో
హత్య చేస్తూనే ఉన్నారు వాళ్ళు.
పార్లమెంటులో పగటి వేషాల్లో నిలబడి
నీత్యాగాన్ని గేలి చేస్తూ
ఉన్మాద నృత్యం చేస్తున్నారు వాళ్ళు.
వాళ్లు
ఈ దేశపు నదుల్ని కలుషితం చేసి
యువతరం పునాదుల రక్తాన్ని
విషపూరితం చేస్తున్నారు.
వాళ్లది ఒక నెత్తుటి క్రీడ
వాళ్లది ఒక పైశాచిక కల.
అయినా
ఇది బుద్ధుడు నడిచిన భూమి.
యావత్ భారత సమత్వం కోరిన అంబేద్కర్ నినదించిన నేల.
పాక్కుంటూనో
దేక్కుంటూనో
రాజ్యాంగం నడయాడే నేల మీద
బాపూ…
నీ అడుగులు పరిమళిస్తాయి.
గౌరీ
నీ నెత్తుటి తడిలో ప్రశ్నలు మొలకెత్తుతూనే ఉంటాయి.
(మిత్రుడు గౌరవ్ కి కృతజ్ఞతలు)