Header Top logo

Revolution Marriage problems విప్లవమూ వివాహ సమస్యలు

Revolution  Marriage problems..

విప్లవమూ… వివాహ సమస్యలు ?

(ఇది పాత కథే )

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి చెట్టుమీదనుంచీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం వైపు మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నిన్ను చూస్తుంటే.. కుటుంబము అనేది రాజ్యం నమూనా అని చెప్పిన ఏంగెల్స్ ను భుజానికెత్తుకుని వివాహ వ్యవస్థ మీద విపరీతమైన గౌరవం చూపించిన కమ్యునిస్టు లు, నక్సలైట్లు గుర్తొస్తున్నారు .

శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకో కధ చెప్తాను విను …

Revolution Marriage problems

పూర్వము నల్లమల అడవుల్లో నక్సలైటు దళాలు విస్తృతంగా తిరిగేవి.
వాటిలో ఓ దళానికి ఓ బ్రాహ్మణ యువకుడు కమాండరుగా ఉండెడివాడు ..
కులం లేదు అనే నమ్మకం బలంగా ఉన్న ఆ నాయకుడు ఓ దళిత మహిళను వివాహమాడాడు …
ఈ వివాహానంతరం వాళ్ల కాపురం అలాగే అడవుల్లో ప్రశాంతంగా సాగుతుండగా దళంలో ఓ అత్యుత్సాహవంతుడైన బీసీ యువకుడు ఒకడు చేరెను.

ఆ కుర్రవాడి మాటకారి తనానికి ఈ నాయకుడి భార్య అయిన దళిత యువతి … ఆకర్షితురాలు అవసాగెను.
ఒక దశలో … అతనితో తనకున్నది ప్రేమ అని ఆమె గమనించెను .
ప్రస్తుతం తను వివాహమాడిన నాయకుడితో పార్టీ ఆదేశాల మేరకు వివాహమాడెను తప్ప అతనితో తన మనసు కలవ లేదని తలంచసాగెను.

ఆ అమ్మాయి కాస్త చురుకు..

ప్రతి అంశానికీ స్పందిస్తుంది ..
ఆవిడ భర్త నాయకుడు కాస్త రిజర్వ్డ్ టైపు. ఆయనకి రాజకీయంగా ఎదగాలనీ … పార్టీని ఎటో తీసుకెళ్లాలని … ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి … వీటికి తోడు ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజల సమ్యలు వాటి పరిష్కారాల గురించిన ఆలోచనలతో ఆయన బుర్రెప్పుడూ బిజీగా ఉండేది. దీంతో ఈ అమ్మాయి అనుకున్న కంపేనియన్ షిప్ దొరకలేదు … ఆ వివాహ చట్రంలో …
అదే సమయంలో…ఈ కొత్తగా వచ్చిన కుర్రాడి పట్ల మనసు ఆకర్షితం కావడం … తనకు బావున్నట్టు అనిపించింది .. ఇలాంటి వాడితో కాపురం చేయొచ్చుగానీ …

అలా రిజిడ్ గా ఉండేవాడితో ఎవరైనా ఎ లా సుఖపడతారు లాంటి అనేక అనుమానాలతో ఆమె కొట్టుమిట్టాడుతూ … ఓ నాలుగు నెల్లు గడిపెను. ఈ నాలుగు నెల్లలో నాయకుడు తన భర్త అయిన సదరు పెద్ద మనిషి నుంచీ మానసికంగా చాలా దూరం జరిగింది …

అలాగే ఆ కొత్త కుర్రాడి యందు అధికంగా అనురక్తురాలూ అయ్యింది …
ఇది అంతయూ దళంలో ఉన్న మరో పెద్ద మనిషి గమనిస్తున్నాడనే ఎరుక వీరెవరికీ లేకపోయింది.
ఆ పెద్ద మనిషి నాయకుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయాడు ..
సమ్ థింగ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద టూ పీపుల్ అని పక్కింటి నాంచారమ్మ ఎదురింటి వెంకాయమ్మ గురించి పొరుగించి సుబ్బాయమ్మకు చెప్పినట్టుగా చెప్పాడు.

నాయకుడు ఖంగారు పడి …

అంతలోనే తన పెద్దమనిషిత్వమూ గుర్తొచ్చి … మాట్లాడే ప్రయత్నం చేశాడు.
ఈ ప్రయత్నం సాగుతుండగా తమ మధ్య ఏదో ఉందనే విషయం పార్టీకి అనుమానం వచ్చిందనే అనుమానం ఈ ప్రేమికులకూ రావడంతో …

ఒన్ ఫైన్ నైట్ వారిద్దరూ చాలా చాకచక్యంగా దళం నుంచీ తప్పించుకుని దగ్గరలో ఉన్న టౌనుకు చేరుకుని … వివాహమాడారు.
ఏదో విధంగా బతికేయవచ్చు అనుకుని బయటకు వచ్చారుగానీ …
ఇద్దరివీ అంతంత మాత్రమే చదువులు కావడంతో నానా కష్టాలూ పడాల్సి వచ్చింది.
ఫైనల్ గా ఈ కష్టాల్లో వారి మధ్య చిగురించిన ప్రేమ తన్నేసింది.

ఎండిపోయింది.

చిరాకుగా చీదరగా రూపాంతరం చెందింది.
తప్పు చేస్సేమనే ఫీలింగ్ ఇద్దరికీ కలగడం ప్రారంభించింది.
ఇలా ఓ ఆర్నెల్లు కాలం గడచిపోయింది.

అతను తాగుడుకు అలవాటు పడ్డాడు …
ఆమె ఏదో ఒక పనికి వెళ్లి నాలుగు డబ్బులు తేవడానికి పరిమితం అయ్యింది …
ఇద్దరిలోనూ విప్లవమూ … ఆత్మ గౌరవమూ ఇంకా బ్రతికి ఉండడం వల్ల…
ఒకరినొకరు తిట్టుకోవడమూ …

తరచుగా కొట్టుకోవడమూ జరుగుతూ ఉన్న దశలో ఒక రోజు ఆమె …
తను గర్భవతిని అనే విషయాన్ని తెల్సుకుని ఇలా లాభం లేదని విపరీతమైన ఒంటరితనాన్ని ఫీలవుతూ …
తన దగ్గరున్న కొద్ది పాటి డబ్బులతో …
బస్సెక్కి తల్లి దగ్గరకు పోయింది.
ఆ తల్లి ఓ సిటీలో మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు.
భర్త లేడు .

విప్లవంతో భర్త ద్వారా ఏర్పడిన సంబంధాల వల్ల కూతురుని ఆ దిశగా వెళ్లడానికి దోహదం చేసింది.
కూతురు ఇలా చేసిందని తల్లడిల్లింది.
ఆచూకీ కోసం పార్టీ వారి ద్వారానే ప్రయత్నించింది. ఇంతలో ఆ కూతురే ఇంటికి చేరే సరికి ఏం చేయాలో దిక్కుతోచక తిరిగి పార్టీ వారినే ఆశ్రయించింది.
అలా ఎలా చేశావ్ అని నిలదీశారు పార్టీ వారు … అతను ఎంత బాధ పడ్డాడో తెల్సా?
అని ప్రశ్నించారు.

అప్పుడు ఆ పిల్ల ఏం చెప్పి ఉంటుందో … ఒక్క సారి ఆలోచించు రాజా …
ఒకటి … తప్పై పోయింది … నాకేదైనా దారి చూపించండని పెద్దగా ఏడ్చి ఉండవచ్చు …
రెండు … అప్పుడు నేను చేసింది కరక్టే … నా మనసు ఇలా చెప్పింది …
దాన్ని బహిరంగంగా చెప్పుకోగలిగే స్వేచ్చ అక్కడ నాకు కనిపించలేదు … అందుకనే వెళ్లిపోయాను …
ఆ తర్వాత నేను నమ్మిన వ్యక్తిలో కూడా మగ లక్షణాలు అధికం అవడంతో వాడు బయట ప్రపంచంలో మరింత రెచ్చిపోయాడు
వ్యవస్థతో పోరాడడానికి సిద్దమైన వాడు పరిస్తితులతో పోరాడడానికి జంకి తాగుడుకు బానిసై నా జీవితాన్ని నరకం చేయాలని చూశాడు … అందుకని కొత్త జీవితం ఎంచుకునే స్వేచ్చ నాకు ఉంది కనుక …
నాలో పోగుపడిన ఒంటరి తనం నుంచీ బయటకు రావడానికి కాస్త ఊపిరి పీల్చుకోడానికీ అమ్మ దగ్గరకు వచ్చాను …
నా మొదటి భర్త గొప్పవాడు …

అంత గొప్పవాడు నాకు అక్కర్లేదు …

నా రెండో భర్త ఊహల్లో బతికేవాడు . అలాంటి వాడూ నాకు అక్కర్లేదు . నా టెంపర్మెంటుకు తగిన వాడ్ని నేను చూసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే స్దిమితాన్ని చిక్కించుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను. చేతనైతే నాకు సహకరించండి … లేకపోతే వదిలేయండి అనైనా చెప్పుండాలి. ఏ రెంటిలో ఆ అమ్మాయి ఏ సమాధానం చెప్పి ఉంటుంది?

ఈ రెండూ కాక ఇంకేం చెప్తే బాగుంటుంది?

ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుంది అని కథ ముగించాడు శవంలోని భేతాళుడు.
రెండో సమాధానమే బాగుంది. అయితే ఆ అమ్మాయి కోరినట్టు.. ఆమె కొత్త జీవితానికి దోహదపడే సాయం వారు చేశారా?
లేక తమ పార్టీ నాయకుడ్ని వదిలేసొచ్చిన ఆ అమ్మాయి పట్ల వారిలో అప్పటికి ఉన్న వ్యతిరేకత … తో పాటు పెళ్లి మీదున్న గౌరవంతో… లేచిపోయిందనే నెపం ఉన్న ఈ అమ్మాయి మీద వారు సానుభూతితో వ్యవహరిస్తారని కూడా నేను అనుకోవడం లేదు .. కనుక

ఆ తర్వాత ఆ అమ్మాయి గర్భం తీయించేసుకుని ఏదో పన్జేసుకుంటూ తల్లి చాటు సాంప్రదాయ వివాహం చేసుకుని అడ్జస్ట్ అయి అయినా ఉండాలి …

లేదా తల్లిని చూపించి తను ప్రేమించిన వ్యక్తితో అయినా కలసి నడిచి ఉండాలి …
ఈ పెళ్లి అనే తంతు ఉండడం వల్లే …

తక్కినవన్నీ అక్రమ సంబంధాలుగా చెప్తున్నారు కనుక…

పెళ్లి అనేదాన్ని రద్దు చేయాలనే చైతన్యం ఆ పిల్లకు వచ్చుంటుందా అనేది నా అనుమానం …

విప్లవంతో ఉన్నప్పటికీ ఇన్ని పెళ్లిళ్లలను ఆ తల్లి అంగీకరిస్తుందా అనేది ఇంకో అనుమానం …

అని తేల్చాడు విక్రమార్కుడు …

రాజుకు ఈ విధముగా మౌనభంగం కాగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు …

భరద్వజా రంగవఝల, జర్నలిస్ట్

( ఈ కథ కేవలం కల్పితం … ఇంతలి పాత్రలు ఏ ఒక్కరినీ ఉద్దేశ్శించినవి కాదు )

Leave A Reply

Your email address will not be published.

Breaking