Header Top logo

పార్టీ ఫిరాయింపుదారులను ఉరి తీసే చట్టాలు రావాలి

పార్టీ ఫిరాయింపుదారులను ఉరి తీసే చట్టాలు రావాలి
• దేశంలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు
• ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర
• పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హత్యలు, ఆత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్నిమేధావులు ఆలోచించాలన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదకరంగా పరిణమించాయి అని మండిపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఫిరాంయిదారులపై వేగంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఉండాలన్నారు. అవసరమైతే పార్టీ ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని డిమాండ్ చేశారు.
దేశం, జాతి గొప్పదనాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒకరిపై ఉంది.1930లో జనవరి 26 న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తిరంగా జెండా ఎగరేసి పూర్ణ స్వరాజ్యం ప్రకటించారు. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం సంపూర్ణ స్వరాజ్య సంబరాలను జరుపుకుంటూ బ్రిటిష్ వాళ్లకు ఒక హెచ్చరిక చేశారు. అంబేద్కర్, నెహ్రూ లాంటి మేధావులు 1950 జనవరి 26 న రాజ్యాంగాన్ని అమలు చేశారు. దళిత గిరిజన రిజర్వేషన్లు, పేదలకు విద్య, గ్రామ పంచాయతీ వ్యవస్ధను రాజ్యాంగం ద్వారా అమలు చేశారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. దేశ ప్రగతికి ఎన్నో ప్రాజెక్టులు, కార్యమాలు కాంగ్రెస్ చేపట్టింది. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని కొంత మంది అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన విద్యా హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. విద్యను దూరం చేసి పెదలను మధ్య యుగం వైపు నెడుతున్నారు.

అబద్ధపు పునాదుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిందని, వాళ్ళ విధానాలు చూస్తుంటే.. రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పబ్లిక్ సెక్టార్ రంగాన్ని పెంచింది. బీజేపీ మాత్రం దాన్ని ప్రయివేట్ పరం చేస్తోందని ఆరోపించారు. లక్షలాది కోట్ల విలువైన ఆస్తులను చిల్లర ధరకు అమ్ముకుంటోంది. పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టిన ఘనుడు మోడీ అన్నారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్ముతుండటంతో దళితులు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. దేశంలో రిజర్వేషన్ స్ఫూర్తి దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.

ఏళ్లు గడుస్తున్నా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతి భవన్, రాజ్ భవన్ కు పరిమితం చేసి.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకర మన్నారు. కేసీఆర్ వ్యవహారశైలిని మార్చుకోవాలి. గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలి కానీ అందుకు గణతంత్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జనవరి 30న రాహుల్ కశ్మీర్ లో జాతీయ జెండా ఆవిష్కరించి దేశ సార్వభౌమత్వాన్ని చాటుతారు. ఆ రోజు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయాలి. ఈ రోజు హాత్ సే హాత్జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించినా.. ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు కొనసాగుతుందన్నారు. రాహుల్ జోడో యాత్ర స్ఫూర్తితో ప్రతీ గడప వెళతామన్నారు. నిరంతరం పాదయాత్రలో పాల్గొంటామన్నారు. పార్టీ ఆదేశించినట్టు పాదయాత్ర కొనసాగుతుందని , తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈటల లక్ష్యం నెరవేరడం లేదు

గణతంత్ర వేడుకల కోసం గాంధీ భవన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం రాజేందర్ బీజేపీ లోకి వెళ్ళాడో .. ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఆయన బీజేపీలో చేరారు. కానీ బీజేపీలోకి వెళ్ళాక రాజేందర్ కు అర్థమైంది .. అక్కడ కూడా కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారని. రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ ఆయన గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు .. ఇప్పుడు ఆ పార్టీ లో సంతృప్తిగా లేరు. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం రాజేందర్ మాట్లల్లో స్పష్టమైంది కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలి. కేసీఆర్ కు అంబేద్కర్ మీద మొదటి నుంచి కక్షే. కేసీఆర్ పుట్టిన రోజు కాదు, అంబేద్కర్ జయంతి రోజు సెక్రటరియేట్ ను ప్రారంబిస్తే గౌరవంగా ఉండేది. రాజేందర్, వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ సిద్దాంతాలను విశ్వసించరు.. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గిరికి సంబంధం లేదు. బీజేపీ లో కూడా కోవర్ట్ లు ఉన్నారని రాజేందర్ అన్నారంటే .. ఏదో అసంతృప్తి ఉన్నట్లే కాదా. ఈ పరిస్థితుల్లో రాజేందర్ ముందుకు రాలేక, వెనక్కి పోలేక అక్కడే మిగిలిపోయారు. కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యం తో బీజేపీ లో చేరినా.. ఆ లక్ష్యం నెరవేరడం లేదనే అసంతృప్తితో ఈటెల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి లు వారి వారు చూసుకునే పరిస్థితి వచ్చింది. హుజురాబాద్ అయినా మునుగోడు అయినా సంధర్బానుసారమే బీజేపీ కి ఓట్లు పడ్డాయి. మిగతా సంధర్భాలలోబీజేపీ కి ఆ ఓట్లు పడవు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. పార్టీ హైకమాండ్ భట్టి కి ఆ భాధ్యతలు ఇచ్చింది. కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తాం. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయుసును 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తాం. కలెక్టర్ గా 21 సంవత్సరాల అధికారి భాధ్యతలు నిర్వహించగా.. 21 సంవత్సరాల వ్యక్తి ఎమ్మెల్యే గా ఎందుకు పోటీ చేయకూడదు. కేసీఆర్ విష ప్రయోగంలో ఈటెల రాజేందర్ కూడా పాత్రధారి అవుతున్నాడు. రాజేందర్ కు ఇష్టం లేని పనులను కేసీఆర్ చేపిస్తున్నారు. ఈటెలలెఫ్టిస్ట్. కానీ రైటిస్ట్ పార్టీ లోకి పోయేలా చేసాడు. ఈటెల రాజేందర్ కు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఇష్టం లేదు. కానీ హుజురాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టించాడు. ఆవిధంగా కేసీఆర్ అనుకున్నదే రాజేందర్ తో చేపిస్తున్నారు.

పద్మ అవార్డు గ్రహీతలకు శుభకాంక్షలు

పద్మ అవార్డుల గ్రహీతలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో వివిధ రంగాలలో విశేష సేవలు చేసిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మ భూషణ్, పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు పొందిన ప్రముఖులకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 106 పద్మ అవార్డులలో తెలుగు వారికి 12 పద్మ అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

బీఆరెస్ వల్ల 50 ఏళ్ల వెనక్కి కొడంగల్

కొడంగల్ లో బీఆరెస్ ను గెలిపిస్తే దత్తత తీసుకుంటా అన్నారు…గెలిపించాక ఇప్పుడు ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారో చూపించండి. పదేళ్లు మేం చేసిన అభివృద్ధిని ఈ అయిదేళ్లలో 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.
ఎనిమిది మండలాలు ఉన్న వనపర్తి జిల్లా అయింది. మరి ఎనిమిది మండలాలు ఉన్న కొడంగల్ రెవెన్యూ డివిజన్ ఎందుకు కాకూడదు?

సీఎం కేసీఆర్ కొడంగల్ పై కక్ష కట్టారు. అందుకే కొడంగల్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి.. మూడు జిల్లాల్లో కలిపారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా డ్రామారావు హామీ ఇచ్చారు. కృష్ణా నది జలాలు తెచ్చి నెత్తిమీద చల్లుకుంటా అన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో కొడంగల్ చేసిందేమీ లేదు. దత్తత తీసుకున్న డ్రామారావుకు సవాల్ విసురుతున్నా. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు నిరూపించినా.. ఆ గ్రామంలో కాంగ్రెస్ ఓటు అడగదు. లేకపోతే తప్పు ఒప్పుకుని కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాయాలి. మేం ప్రతిపాదించిన నారాయణపేట ఎత్తిపోతల కట్టకుండా పక్కనబెట్టారు. ఇక్కడికి రావాల్సిన వికారాబాద్ కృష్ణా రైల్వే లైను రాకుండా చేశారు. దీంతో ఇక్కడ ఏర్పాటు కావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీలు రాక.. యువతకు ఉద్యోగాలు రాకుండా పోయాయి. ఈ నాలుగేళ్లలో ఈ ఎమ్మెల్యే ఏ సమస్యపైనైనా అసెంబ్లీలో మాట్లాడారా? రోజు ఇక్కడ తిరుగుతున్న ఎమ్మెల్యే.. ఇక్కడ వసూల్ చేసుకుంటుండు తప్ప మీకేం ఒరగబెట్టలేదు. మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చూడాలి.

కొడంగల్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. నాయకులంతా కలిసికట్టుగా ఉండి.. లక్ష ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. అంతకుముందు వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం మదనపల్లి, దురాచారాలు మండలం లో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ 3574 కి.మీ 150 రోజులు నడిచారు. మండుటెండల్లో, మంచు కొండల్లో జోడో యాత్రతో మనకు స్ఫూర్తినిచ్చారు. పేదల పక్షాన నిలబడటానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ప్రతీ ఇంటికి ప్రతీ గుండెకు ఆ సందేశాన్ని చేర్చడానికే హాత్ సే హాత్జోడో కార్యక్రమాన్ని చేపట్టాం. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్లు..నేను పీసీసీ అధ్యక్షుడినైనా.. మీ వాడిని. అందుకే రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ఇంటింటా చేర్చేందుకు ఇక్కడి నుంచి మొదలు పెట్టాం. గతంలో మీరు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసాం. 50ఏ ళ్ల వెనుకబాటుతనాన్ని మీ ఆశీర్వాదంతో అభివృద్ధి చేసుకున్నాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పేదవాడికి అన్నిరకాల సహాయం అందించింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా.. రైతు బీమా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. పంట బీమా ఇవ్వకుండా… రైతు చనిపోతే డబ్బులిస్తాడట. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ రావాలంటే, ధరణి దరిద్రం పోవాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందే. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ కేసీఆర్ పోయినా ఆగదు. అంతకు అంతకు కలిపి ఆ కళ్యాణ లక్ష్మీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీలుకుంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా పెన్షన్ ఆగదు. కేసీఆర్ వచ్చినా, ఇంకెవరొచ్చిన మదనపల్లి చెట్టుకు కట్టి నిలదీయండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking