Header Top logo

జర్నలిస్ట్ అల్లే రమేష్ కలం నుంచి కథ -01

ఊరు కులుతున్న దృశ్యం

రచయిత, అల్లే రమేష్

హైదరాబాద్ మహానగరం ఎప్పుడు నిద్ర పోతుందో తెలియదు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల మీద వాలిన పక్షులై నిత్యం మనుగడ కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు. అ పరుగు పందెంలో నేను ఒకడిని అయిపోయాను. ఇటుపక్క ఎవరున్నారో అటుపక్క ఎవరున్నారో తెలుసుకోలేనంత దూరాన్ని మోస్తూ అపార్ట్మెంట్ కల్చర్ కు అలవాటు పడిపోయాము.

తయారవ్వండి ప్లీజ్.టీవీ చూసుకుంటా ఎంతసేపు ఉంటారు తొందరగా తయారైతే బయల్దేరుదాము. డ్యూటీ ఉన్నంత సేపు టీవీ చుసుడెనాయే. సరిపొదన్నట్టు మిరింక్కా టీవీ పట్టుకొని ఏడిస్తేఎట్లా. బంటి గాడు కూడా తయారైండు అంటూ మా ఆవిడ పద్మ పిలిచుడుతోనే టీవీ కట్టేసినా. ఎంతైనా మన డ్యూటీ అదేనాయే. స్క్రోలింగ్ ఎడిటింగ్ సెక్షన్లల్లో ఓ పేరున్న టీవీ ఛానల్ లో పనిచేస్తున్న.

అట్లా ఈ వార్తల డ్యూటీ లోనే కాదు జీవితంలో కూడా భాగమైపోయినై. నా డ్యూటీ గురించి మా ఆవిడ జోకులు కూడా వేస్తుంటది.ఇగ స్నాననికి పోయేందుకు లేసినా.

గబగబా స్నానం చేసి పది నిమిషాల్లో తయారైన. ఇంతట్లనే అపార్ట్మెంట్ కింది నుంచి సురేష్ ఫోన్ చేసిండు. వస్తున్న అని చెప్పి పద్మ సురేష్ వచ్చిండు తొందరగా తయారైతే వెళ్దామని చెప్పుతోటి అప్పటికే అన్ని సర్దిపెట్టిన పద్మ రెండు నిమిషాల్లో రెడీ అయింది. లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చినాము.

మసక మసక వెలుతురులో కారు జెబిఎస్ వైపు పరుగులు పెడుతుంది. బస్టాండ్ దగ్గర దించిన సురేష్ తో మాట ముచ్చట అయినంక బస్టాండ్ లోకి నడుస్తుంటే వేములవాడ డిపో బస్సు తయారుగా ఉంది. గబ గబ బస్సు ఎక్కినం.బస్సు బయలుదేరింది. పద్మ, ఒడిలో బంటి ప్రశాంతంగా నిద్రపోతున్నారు.

పద్మకు అమ్మ ఫోన్ చేసినట్టుంది అత్తమ్మ ఇప్పుడే బస్సు ఎక్కిన మని చెప్తుంది. బస్సు పరిగెడుతున్నట్లే నా ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. నాగరాజు ఇంకా నా కళ్ళ ముందు ఉన్నట్టే అనిపిస్తుంది.

నాగరాజు మా పెద్దమ్మ కొడుకు నెల రోజుల క్రింద అనారోగ్యంతో చనిపోయిండు. పెద్దమ్మ కుటుంబాన్ని నిద్రకు తీసుకొద్దామని బాపు వారం రోజుల ముందే చెప్పిండు. ఇప్పుడు దానికోసమే ఊరికి బయలుదేరినము. నాగరాజు నాకంటే రెండేళ్లు చిన్నోడే. చదువు డిగ్రీ వరకు చదువుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివ్గా పనిచేస్తుండే.

పెద్దబాపుకు వ్యవసాయంలో సహాయంగా ఉండేటోడు ఇట్లా చూసి చూస్తుండగానే కాలం గడిచిపోయింది. వానికి పెళ్ళై ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆఖరికి రెండు ఏళ్ల నుంచి ఇసుక ట్రాక్టర్ మీద డ్రైవర్ గా పనిచేస్తుండు.

నేను హైదరాబాద్ పోవుడు తోటి క్రమంగా మా మధ్య కొంచెం దూరం పెరిగింది. ఎప్పుడు చుట్టాలిండ్లాల్ల ఫంక్షన్లలో కలిసిన కడుపునిండా మాట్లాడేటోడు. పెద్దమ్మకు వాడొక్కడే. ఇద్దరు బిడ్డలు ఉంటే లగ్గాలైనై.

పెద్ద బాపూ వాని మీద ఏం భారం పడకుండా చూసిండు. నిజంగా ఆ కుటుంబానికి వచ్చిన కష్టం చూస్తే మనుసుల ఎంతో బాధ అయితది.  ఈ ఆలోచనలతోనే మెల్లగా నిద్రలోకి జారుకున్న.

సిద్దిపేట్ రాంగనే బస్సు ఆగింది. దిగి చాయ్ తీసుకొని పద్మకిచ్చి మరో కప్పు నేను తాగిన. బంటి గాడు నిద్రలనే ఉన్నాడు. బస్సు సిరిసిల్ల దిక్కు పోతుంది. బస్సు కిటికీలోంచి బయటకు చూస్తుంటే గతం తాలూకు ఎన్నో జ్ఞాపకాలు యాదికి కొస్తున్నయ్. సరిగ్గా ఉదయం 10 దాటుతుండగా అంబేద్కర్ చౌరస్తా వద్ద బస్సు ఆగింది.

బస్సు దిగి వెంకటాపూర్ ఆటో స్టాండ్ దగ్గరికి పోయేసరికి మా ఊరు వెంకటేష్ గుర్తుపట్టి పలకరించిండు. శీనన్న ఇప్పుడే వస్తున్నార..వదిన పిల్లలు బాగున్నారా అని నన్ను పద్మ ను పలకరించండు. బదులు చెప్పి ఆటాలో కూసున్నము. అప్పటికే ఒకరిద్దరు ఆటో ఎక్కడంతో ఆటో వెంకటాపూర్ వైపు పరుగులు పెడుతుంది.

నాలుగు గంటల ప్రయాణంలో లేని తొందర ఎందుకో పది నిమిషాల తోవ్వ ఎంతో దూరమనిపిస్తుంది. కాలం మెల్లగా గడుస్తున్నట్లు అనిపించింది. వెంకటాపూర్ చేరుతూనే శీనన్న వీళ్లను బస్టాండ్లో దించి మిమ్మల్ని ఇంటిదగ్గర దించుతానని చెప్పిండు. మిగిలిన వాళ్లను బస్టాండ్లో దించి అంబేద్కర్ విగ్రహం నుంచి తేనుగొల్ల వాడకట్టు దిక్కు ఆటో సాగిపోతుంది. వాటర్ ట్యాంక్ దగ్గర్లోనే మా ఇల్లు. ఇంటి ముందు ఆటో ఆగుడు తోటి చుట్టుపక్కల ఉన్నోల్లు పేరు పెట్టి పలకరిస్తుండ్రు.

అమ్మ ఆటో చూసుడు తోని ఎదురుంగోచ్చి పద్మను అలుముకున్నది. అందరం వాకిట్లో కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేందుకు సిద్ధమైనము. బంటిని ఎత్తుకొని ఎట్లున్నవో పిలగా అని ముచ్చట్లు పెడుతూ ఇంట్లోకి తీసుకువెళ్లింది.. బాపు ముందుగాల ఎట్లున్నావ్ బిడ్డ అని పద్మ ను పలకరించిండు బంటీని దగ్గరకు తీసుకుని అంత మంచిదేనా వొయ్ తాత అంటూ మురిసిపోతుండు.

నన్ను చూపులతోనే పలకరించుడు. నాన్న ప్రేమ మాటల్లో కంటే మనసుకి ఎక్కువగా తెలుస్తుంది. పద్మ అమ్మ వంటింట్లోకి పోయిండ్రు మనుమన్ని అల్లుకుపోయిన బాపు నేను ముచ్చట్లు పడ్డాము.ఎందుకో హైదరాబాద్లో అయితే పొద్దు పోవుడు కష్టం. ఊరికి వస్తే మాత్రం గంటలు నిముషాల్ల గడిచిపోతున్నట్లు అనిపిస్తది.పద్మ బాపుకు నాకు చాయ్ ఇచ్చింది.

అదేంది బిడ్డ మన్మనికి ఈయకపోతివి అన్నాడు బాపు. వెంటనే మనుమడు చాయ్ తాగాడు కదా పాలు బిస్కెట్లు తీసుకురా బిడ్డ అన్నాడు. బంటికి తాత తనకే సొంతమైనట్టు గర్వంగా ఫీల్ అయినట్టున్నాడు గట్టిగా తాతను పట్టుకున్నాడు..

చుట్టుపక్కలోల్లు వచ్చి వరుసలు పెట్టి మాట్లాడి పోతున్నారు. పట్టణపు ప్లాస్టిక్ చిరునవ్వుల కనిపించని మనిషి జాడలను ఊరి స్వచ్ఛమైన పలకరింపులు మనిషితనాన్ని మంచితనాన్ని ఆత్మీయతను పంచుతున్నట్లు అనిపించింది..

ఇంతట్లోనే ఇంటి ముందు ఆటో ఆగిన సప్పుడైంది. పెద్దమ్మ వాళ్లు వచ్చిండ్రని అందరం బయటకు వచ్చినాము. అమ్మ పద్మ ఎదురెళ్లి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చారు. పెద్దమ్మ అమ్మ మీద పడి బోరున విలపిస్తుంది.

నేనేమ్ పాపం చేస్తిని చెల్లే. నా రాత ఇట్లైపోయింది చెల్లె.అసిరే పొలగంళ్లను పట్టుకుని చంటిది ఎట్లా బతకాలే చెల్లె మేమెందు పోవాలే చెల్లె అంటూ దుఃఖంతో యతాలను కలబోసుకుంటుంది పెద్దమ్మ. ఇద్దరు అక్కలు నా మీద పడి దుఖిస్తుంటే వారిని ఆపేందుకు ఓదార్పు మాటలు లేకుంటా ఐనై. నా కడుపులో నుంచి దుఖం తన్నుకొస్తుంది.

అక్క ఉకోండ్రిbఅని చెబుతున్న ఓదార్చుడు నాతోనీ అయితలేదు. నాగానీ భార్య వరలక్ష్మినీ పద్మ దగ్గరికి తీసుకుని ఓదార్చుతుంది. జీవితం నిండా పరచుకున్న దుఖ తీరాలని కాలమే దాటించాలే.

అందరి మనసుల్లో సుడులు తిరుగుతున్న దుఃఖం తర్వాత పది నిమిషాలు పరుచుకున్న నిశ్శబ్దం ఎందుకో మనసుకు ఇంకా కష్టం అనిపించింది.

ఇంటి ముందు విజయబాబు బండి హరాన్ కొడుతుండు. విజయ్ బాబు ది ఎల్లారెడ్డిపేట. నా క్లాస్మేట్ మా కుటుంబాలకు పొత్తుల సుట్టం.

వస్తున్నా అన్నట్టు చెయ్యి ఉపి డ్రెస్ మార్చుకుని ఇంట్లోంచి బయటకు వస్తుంటే జర తొందరగా రా బిడ్డ అని బాపు చెప్తుంటే సరే సరే బాపు అనుకుంటా బయటకు వచ్చినా. విజయ్ బాబు స్కూటీ ఎక్కినా వెంకటాపూర్ అంబేద్కర్ విగ్రహం దాటి సిరిసిల్ల వైపు కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు మీద బండి పక్కకు అపి ఫోన్ తీసి అరే సత్తి ఏడున్నావ్ రా. మన శీనుగాడు వచ్చిండు కల్లుకొస్తున్నమని చెప్పుతోటే. నేను పనిమీద సిరిసిల్లకు వచ్చిన. మండవ కాడికి పొండ్రి. అక్కడ మోత్కుల నడిపి బాలన్న ఉంటాడు.

బండ మీది తాడు విడిచి పోస్తాడు నేను చెపుతా మీరు పోండ్రి అనీ చెప్పిండు. విజయ్ బాబు స్కూటీ వెంకటాపూర్ ఎల్లమ్మ గుడి దిక్కు పోనిచ్చిండు. మండవ కాడ మా కోసం చూస్తున్న బాలగౌడ్ విజయ్ బాబు ను చూసి విలేకరు సారు ముఖమే బంగారమైంది అని పలకరించండు.

నన్ను కూడా ఏట్లున్నారు బిడ్డ అందరూ మంచిగున్నారా అని పలకరించిండు.గిట్ల ఎవరన్నా సోపతోల్లు వస్తనే కల్లు యాదికొస్తది అని చెప్పిండు. బాలగౌడ్ మోకు సదురుకొని ముందుకు నడుస్తున్నాడు. వెనుక విజయబాబు నేను నడుస్తున్నము. రాతిగుండ్ల మధ్య ఆకాశం తాకుతున్నట్లు తాడు దగ్గర ఆగి తాడెక్కి బాలా గౌడ్ కల్లు ఇడుసుకొచ్చిండు.

రెండు ర్యాకలు తయారుచేసి విజయ్ బాబుకు నాకు చెరొకటి ఇచ్చిండు. ఒక దమ్ము కల్లుబట్టినము. మామ మేము మెల్లగా తాగొస్తం. ఎంతియ్యలే అంటూ విజయ్ బాబు జేబుల చెయ్యి పెట్టుడుతోటే విలేఖరి సబ్ మీ దగ్గర పైసలు తీసుకుంటే మా సత్తడు ఊకుంటాడా అని అనుకుంటా నవ్వుతూ వెళ్ళిపోయాడు. మెల్లగా విజయ్ బాబు నేను ముచ్చట్లల్ల పడ్డము.

విజయ్ బాబు మొదలుపెట్టిండు. వారి మన నాగని చావుకు మన బాధ్యత లేదా అన్నాడు. అర్థం కానట్టు చూసిన. ఇప్పుడు మన ఊరోల్లైనా నాగాని ఊరోల్లైయినా ఏమంటారు వాడు తాగి తాగి సచ్చిండనే అంటారు.

వట్టిగా భార్య పిల్లలకు అన్యాయం చేసిండని తిడతారు అని నాదిక్కు చూసిండు. వీనీ మాట తరువాయెందో అర్థం కాక అయోమయంలో పడ్డ. విజయ్ బాబు లేసి కల్లు వంచిండు.దమ్ముపట్టినంక వానికి నేను వంచినా. తిరిగి ముచ్చట్లు మొదలైనయ్.

ఒక్క మన ఊర్లనే కాదు ఇంచుమించు అన్ని ఊర్ల ఇప్పుడు 40 ఏళ్లకే నూరేళ్లు నిండే నాగనీ అసొంటోల్లు మస్తు మందే ఉన్నారు. ఇంకా తయారైతునే ఉన్నారు. ఇప్పుడు వాళ్ల చావులన్నీ ఎవాళ ఖాతాల వేస్తాం అని అడిగిండు. అయోమయంగా చూసిన. మనం చిన్నగా ఉన్నప్పుడు ఊర్లల్లా యువజన సంఘాలు ఉంటుండే.

సామాజిక సమస్యల మీద చర్చలు చేసేటోల్లు. అక్రమంగా సారామ్మితే దండుగ తీసి తప్పు చేయకుండా చూసేటోళ్లు. ఇప్పుడు నాయకుల అభిమాన సంఘలు, గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతోటి మొత్తం ఉల్టా జరుగుతుంది. ముందుగాల నువ్వి ముచ్చట ఇనలే కాలేశ్వరం నీళ్లొచ్చే.. ఇంచు జాగా ఖాళీ లేకుండా మొత్తం పచ్చ పడ్డది.

మిషన్ భగీరథ తోటి ఇంటింటికి నిల్లోచ్చినై. అన్న స్క్రోలింగ్ లతోపాటు.. అప్పుడప్పుడు తాగుబోతులే సర్కార్ నడుపుతుండ్రనే స్క్రోలింగ్ లు పెడుతునే ఉంటారు కదా. అండ్ల వచ్చింది ఏందో పోయిందేందో తెలివది గానీ. మందు బాబులను తయారు చేస్తున్న కర్మాగారాలుగా ఊర్లు మారుతున్న పరిస్థితులు ఎవ్వనికి పట్టై. పోయినసారి మద్యం అమ్మకాల వల్ల సర్కారుకు వచ్చిన ఆదాయం 12 వేల కోట్లు.

ఈసారి జర గట్టిగానే అనుకున్నట్టు ఉంది సర్కార్. 60 వేల కోట్ల అమ్మకాలను టార్గెట్ పెట్టుకోంది. అధికారిక లెక్కలు చెబుతున్న ప్రకారం ఏప్రిల్ 2022 నాటికి జరిగిన అమ్మకాలు రాష్ట్రంలోని మందుతోని కాసుల వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా తర్వాత మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో ఉన్నది. 14 వందల 69 కోట్ల 93 లక్షల ఆదాయం ఖజానాకు వచ్చినట్లు అధికారికంగానే లెక్కలు చెప్పవట్టే. మన జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలను కలుపుకుంటే మొత్తం రెండు వందల యాబై ఐదు గ్రామాలు ఉంటే ఎనిమిది వందల పైగా బెల్ట్ షాపులు ఊర్లను కబలిస్తున్నై.

ఎండాకాలంలో నర్మల డ్యాం అలుగుదుంకి పారుతుందని చెప్పుకొస్తున్నం కానీ అన్ని కాలలాల్ల మద్యం ఊర్లను ముంచి పోతున్న విషయాన్ని గమనిస్తాలేము. పరిస్థితి ఎక్కడిదాకా పోయిందంటే గంభీరావుపేట మండలంలో ఓ ఊర్లో బెల్ట్ షాపుకు 12 లక్షలు పలికిందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఆలోచించు.

ఇంకో విచిత్రం తెలుసా. మీ ఊర్ల్లో రెండు బెల్ట్ షాపులే ఉన్నట్టు కనపడతాది. అటు నాలుగు అడుగులు ఎస్తే పెద్దూరు పక్క పొంటి ఎన్ని అడుగులు వేస్తే అన్ని బెల్ట్ షాపులు అందుబాటులోనే ఉండే.

ఎవరు పట్టించుకుంటలేరు గాని ఊర్లల్లో ఇప్పుడు మద్యం చేస్తున్న మానవ విధ్వంసం ఎంతోమందిని బలి తీసుకుంటుంది. మొన్న మీ పక్కూర్లో జరిగింది. మైనార్టీ తీరని పోరాడు గంజాయి కేసుల దొరికిండు. వాళ్ల నాయన వాడ్ని ఇడిపించుకొచ్చిన తర్వాత మూడు నెలల్లోనే బెల్ట్ షాపుల దొంగతనానికి ప్రయత్నించి దొరికిండు.

అవమానం భరించలేక వాళ్ళ నాయన ప్రాణం తీసుకున్నాడు. పోరడు పెద్దగైనంక వానీ భవిష్యత్తు ఎటు పోతుందో తెలువది. సర్కార్ను నడిపేందుకు తాగి తాగి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ కంటే వాళ్ళ మూలంగా చిన్న బిన్నవుతున్న కుటుంబాలు, మనుషుల జీవితాల్లో పరుచుకున్న దుఃఖాన్ని ఏ అభివృద్ధి కోలమానంతో సుడాలే.

ఇట్లా అనేక విషయాలు విజయ్ బాబు చెప్పుకొచ్చిండు. ఆఖరి దమ్ము పట్టినమ్. విజయ్ బాబు స్కూటీ తీసిండు. స్కూటీ ముందుకు సాగుతుంటే ఎందుకో నాకు చుట్టంతా ఊరు కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నై. మా పెద్దమ్మ కుటుంబం లాగే ఎన్నో కుటుంబాల దుఖం అభివృద్ధి పథకాల ప్రచారాల వెనుక కమ్ముకొస్తు వెక్కివెక్కి ఎదుస్తున్నట్లే అనిపిస్తుంటే…..

(పేర్లు కల్పితం.. పరిస్థితులు యదార్థం.)

అల్లే రమేష్, జర్నలిస్ట్

సెల్.9030391963

Leave A Reply

Your email address will not be published.

Breaking