Snail Prevention Awareness Day 22న నత్తి నివారణ అవగాహనా
Snail Prevention Awareness Day
నత్తి జబ్బు కాదు… ఇబ్బంది మాత్రమే
చికిత్స కాదు. స్పీచ్ థెరపీతో నత్తిని నయం చేయొచ్చు
అక్టోబర్ 22న నత్తి నివారణ అవగాహనా దినోత్సవం
నత్తి అనగా అసంకల్పిత పునరుక్తుల ద్వారా ప్రసంగ ప్రవాహమునకు విఘాతం కలిగించే ప్రసంగ లోపం. దీనిలో శబ్దాలు, పదాంశాలు, పదాలు లేదా పదబంధాల యొక్క పొడిగింపు అలాగే అసంకల్పిత నిశ్శబ్ద అంతరాయాలు లేదా నిరోధాలు ఉంటాయి. అందువలన నత్తి ఉన్న వ్యక్తి ధ్వనులను స్పష్టంగా పలకడం సాధ్యం కాదు. ఎవరైనా మాట్లాడే టప్పుడు మాటలు తడబడటం లేదా ముద్ద ముద్దగా మాట్లాడటం, కొన్ని అక్షరాలు సరిగా పలక లేకపోవడం జరుగు తుంటుంది.
ఈ విధంగా తరచుగా జరుగు తున్నట్లయితే వారికి నత్తి ఉందని అర్థం. ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవమును ప్రతి సంవత్సరం అక్టోబరు 22న జరుపు కుంటారు. 1998, అక్టోబరు 22న ‘ఇంటర్నేషనల్ ఫ్లూయెన్సీ అసోసియేషన్’, ‘ఇంటర్నేషనల్ స్టట్టెరింగ్ అసోసియేషన్’, యూరోపియన్ లీగ్ ఆఫ్ స్టట్టెరింగ్ అసోసియేషన్’ సంస్థలు సమావేశమై నత్తిపై ప్రజలకు అవగాహన కలిగించటం ద్వారా దానిని నివారించవచ్చని ఒక నిర్ధరణకు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి సంవత్సరం అక్టోబరు 22న అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం నిర్వహించాలని పిలుపు నిచ్చాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పలు దేశాలు, సంస్థలు “నత్తి” నివారణ పట్ల అవగాహనా కార్య క్రమాలు నిర్వహిస్తున్నాయి.
మనం మాట్లాడేటప్పుడు అక్షరాలు ఒక దాని తరువాత మరోటి నిర్దిష్ట సమయంలో ఉచ్చరించడం వలన ఇతరులకు ఆ ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చేగాలి, స్వరపేటిక లోని స్వరతంత్రుల ప్రకంపనలతో స్వరంగా మారి బయటకు వచ్చే టప్పుడు నాలుక పలు విధాలుగా కదిలించడం వలన అనేక శబ్దాలు ఉచ్చరించ గలుగుతాము. ఈ ప్రక్రియ మొత్తం మెదడు పర్య వేక్షణలో అతివేగంగా జరుగుతూ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పూర్తవు తుంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఒక్కోసారి కొన్ని అసమానతలు తలెత్తి స్వరతంత్రులు సరైన సమయానికి తెరచుకోక పోవడం, నాలుక నిర్దిష్ట సమయంలో కదలక పోవడం లేదా నాలుక ఒకే చోట ఎక్కువ సేపు ఉండిపోవడం వలన శబ్దాలు, పదాలు, వాక్యాలు ఆగి ఆగి రావడం లేదా అవే ధ్వనులు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది.
పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న వారికి మాటలు నత్తిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత మందిలో భయం, టెన్షన్, ఇతరులను అనుకరించడం వల్ల, వంశపారంపర్యంగా నత్తి వస్తుంది. కొందరిలో ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం పలుకు తుంటుంది. వీటిని స్పీచ్ థెరపీతో నయం చేయవచ్చు. నేటి రోజుల్లో చిన్న పిల్లలు నత్తినత్తిగా మాట్లాడటం ఒక సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సమస్య 2సంవ త్సరాల నుండి 5ఏళ్ళ మధ్య ఉంటుంది. చిన్న పిల్లలు నత్తి నత్తిగా మాట్లాడటాన్ని ఇంగ్లిష్‌లో స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఒక పదాన్ని ఉచ్చరించే సమయంలో తొలి అక్షరాన్ని పదే పదే పలుకుతూ ఉండటం, లేదా ఆ పదాన్ని గబుక్కున ఉచ్చరించలేక అదే మాటను మళ్లీ మళ్లీ అంటుం డటం, ఒక్కోసారి మాట ఆగిపోయి ఒక పట్టాన గొంతు పెగిలి బయటకు రాకుండా ఉండటం… ఇవన్నీ స్టామరింగ్ లేదా స్టట్టరింగ్‌లో భాగమే. స్టామరింగ్ అన్నది చాలా సాధారణ సమస్య. నత్తికి చాలా కారణాలు ఉన్నాయి. జన్యుపర మైన, న్యూరో ఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి నత్తి రావచ్చు. నత్తి ఉన్న పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు.
కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, వాళ్లపై ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే… ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందుగా 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. నత్తి బాలికలంటే బాలురలో నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. 15 మిలియన్ల మందికి నత్తి ఉంటే అందులో అధికంగా పిల్లలే ఉన్నారని అంచనా. రెండు నుంచి ఏడు సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో అకస్మికంగా నత్తి మాటలు వస్తాయి. కొంతకాలం కొనసాగుతాయి. నత్తిగా మాట్లాడే వారిని ఎగతాళి చేయకూడదు. ఇతరులు ఎగతాళి చేసిన కొద్దీ వారి సమస్య మరింత పెరగగలదు. నత్తి అనేది రోగం కాదు, వీరిలో శారీరకంగా ఎటువంటి సమస్యలూ ఉండవు.
అందువలన మందులు శస్త్ర చికిత్సల వలన ఇది నయం కాదు, కాని వారిలో మానసిక ఒత్తిడిని, భయాన్ని తగ్గించే ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా నత్తిని నయం చేయవచ్చు. ఈ ప్రత్యేక చికిత్సా విధానంలో మాట్లాడే క్రమంలో స్వరతంత్రులు, నాలుక, పెదవుల కదలికలు, గాలి సరఫరా లోని అసమానతలు సరిచేయడం, వాటిని సమన్వయంతో పని చేయించ గలడం జరుగుతుంది, తద్వారా నత్తి ఉన్నవారు మామూలుగా మాట్లాడ గలుగుతారు. వాస్తవంగా జబ్బు కాదు. ఇబ్బంది మాత్రమే. మాటలు తడబడుతున్నా, ఆగుతూ, సాగుతూ ముక్కలు ముక్కలుగా వస్తున్నా నిపుణులను సంప్ర దించాలి. స్పీచ్ థెరపీ చేస్తే నత్తి నూరు శాతం తగ్గుతుంది. వయస్సును బట్టి థెరపీ ఉంటుంది. స్పీచ్ ట్రైనింగ్ ద్వారా సాధారణం గానే మాట్లాడేలా చేయవచ్చు. నత్తి ఉన్న పిల్లలు మాట్లాడు తున్నప్పుడు వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి.
వాళ్లను తొందర పెట్ట కూడదు. వాళ్లకు మాట మాట్లాడు తున్నప్పుడు నత్తి వస్తుంటే వాళ్ల తరఫున మనమే మాట్లాడ కూడదు. వాళ్లు మాట్లాడు తుండగా మధ్యలోనే అందుకుని మాట్లాడ కూడదు. వాళ్లు చెప్పదలచు కున్నది పూర్తిగా చెప్పే వరకూ ఆగి వినాలి. వాళ్లను పూర్తిగా మాట్లాడ నిచ్చేలా ప్రోత్సహించాలి. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. చాలా మంది భాషావేత్తలు, వక్తలు ప్రాక్టీస్ ద్వారా నత్తిని జయించిన వారు ఉన్నారు. నత్తిని అధిగమించాలి అనుకున్నవారు ఈఎన్‌టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించాలి. అదే సమయంలో ఈ సమస్యకు ఇంట్లో కూడా కొన్ని సాధారణ విధానాలు మరియు పద్దతులను ఉపయోగించి సమస్యను అధిగమించవచ్చు.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494