Header Top logo

జర్నలిస్ట్ ప్రభాకర్ స్వీయ అనుభవం

ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా  పని చేయాలంటే ఉరుకుల పరుగుల జీవితమే. ప్రతి క్షణం అలార్ట్ గా ఉంటూ తోటి రిపోర్టర్ ల కంటే ముందుగా స్కోరింగ్ వార్త కథనాలు ఇవ్వాలి. ముఖ్యమైన సంఘటనలు జరిగితే స్పాట్ కు వెళ్లి లైవ్  ఇవ్వాల్సి ఉంటుంది. కామారెడ్డి జిల్లా   రామారెడ్డి మండలం సింగారాయప‌ల్లిలో అడవి జంతువుల వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన రాజు నరక యాతనపై స్పాట్ కు వెళ్లి జర్నలిస్ట్ లు పడిన కష్టం అక్షరాలలో రాయలేం. ఆ వార్త కథనాలను లైవ్ లో ఇచ్చిన నిజామాబాద్ జిల్లా టీవీ-9 స్టాప్ రిపోర్టర్ ఎం.ప్రభాకర్ స్వీయ అనుభవం.

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

TV9-అందరికీ ఓ న్యూస్ ఛానల్ మాత్రమే కావచ్చు! నాకు మాత్రం ఓ సంకల్పం!!

ఛానల్స్ ఎన్నున్నా.. ఎన్నో లోగోలు కనబడుతున్నా..

Tv9 నాకెప్పటికీ ఓ ఏమోష‌నల్ బాండ్!

మా పాత పెంకుటింట్లో టంట‌టాం అంటూ మోగిన Tv9 బ్యాంగ్,

ఒక్క బులెటిన్ వ‌ద‌ల‌కుండా అదే ఛానల్ చూస్తూ పెరిగిన రోజులవి….

మా వేముల‌వాడ‌కు టీవీ9 ఓబీ వెహికిల్ కవ‌రేజ్ కు వ‌స్తే.. దాన్ని చూసి అదిగో టీవీ9 అంటూ సంబుర‌ప‌డిన క్ష‌ణాలు…
అక్క‌డున్న రిపోర్ట‌రన్నను అడిగి మరీ ఆప్యాయంగా లోగోను చేసిన టచ్ చేసిన అనుభూతి..

హైదరాబాద్ వచ్చిన కొత్తలో TV9 ఆఫీస్ ను చూస్తూ.. ఏ రోజైనా ఇక్క‌డ ప‌ని చేయాల‌నే బ‌ల‌మైన కాంక్ష‌…
ఇవన్నీ మాటల్లో వ్యక్తిక‌రించలేని ఎమోషన్స్.. మర్చిపోలేని స్వీట్ మెమొరీస్.

అంతగా ఆరాధించిన ఛాన‌ల్లో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్ట‌మైతే..
దానికి అభినంద‌న కూడా తోడైతే… అది అత్యున్న‌త‌మైన‌దై ఉంటే.. ? అంత‌కంటే ఏముంటుంది…??!

అది డిసెంబ‌ర్ 14 వ తేది సాయంత్రం…. రేపు షెడ్యూల్ ఏమి పెట్టాలని ఆలోచిస్తూ రోడ్డుపైకి వ‌చ్చిన నాకు మా ఆఫీసు గ్రూప్ లో ఓ మెసేజ్ వ‌చ్చింది. అది చూశాక రెండు నిమిషాలు అలానే ఉండిపోయా. ఇది నిజ‌మేనా…? అలా జ‌రిగే అవ‌కాశం కూడా ఉంటుందా…? ఇలా పలురకాల ఆలోచ‌న‌లు మెద‌డును మెలిపెడుతున్నాయి. అస‌లు ఆ పాజిబులిటి ఉందా…? ఇది బ్రేక్ చేస్తే ఏమ‌వుతుందనే ఆలోచ‌న‌లతోనే మా కామారెడ్డి రిపోర్ట‌ర్ భాస్క‌ర్ కు కాల్ చేశా. ఏంటిది నిజామా అని..? అటువైపు నుంచి ఔననే సమాధానం! అప్పుడు బ్రేక్ చేశా!!

ఆ బ్రేకింగ్…

కామారెడ్డి జిల్లా:

రామారెడ్డి మండలం సింగారాయప‌ల్లిలో అడవి జంతువుల వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన ఓ వ్య‌క్తి.. త‌ల, న‌డుము భాగం లోప‌ల ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోతున్న వేటగాడు…
మానవమాత్ర చర్యలకు బయటకు తీసుకురావడం సాధ్యపడటం లేదు…
పోలీసులకు సమాచారమందించిన స్థానికులు…

ఇదీ స్థూలంగా ఆ వార్తా విశేషం!

ఇక ఇంకేముందీ మీడియాకూ అది పెద్ద వార్తే!!

వెంట‌నే విజువ‌ల్స్ కూడా వ‌చ్చేశాయి..
చూస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి..
చిక్కుకున్న వ్య‌క్తి రాజు అని.. అత‌డిది రెడ్డిపేట అని నిర్దార‌ణ అయింది…

వెంట‌నే మా అసోసియేట్ ఎడిట‌ర్ ఆశోక్ వేములప‌ల్లి గారికి కాల్ చేసి చెప్పాను. అన్న మార్నింగ్ 5 గంట‌ల‌కే వెళ్లిపోతానని! స‌రే వెంట‌నే వెళ్లిపో అన్నారు. అప్ప‌టికే కామారెడ్డి రిపోర్ట‌ర్ భాస్క‌ర్ ను అల‌ర్ట్ చేసి వెంట‌నే స్పాట్ కు రీచ్ అవ‌్వమ‌ని చెప్పా. భాస్క‌ర్ కూడా రాత్రికే బ‌య‌లుదేరి పోయాడు. అవ‌స‌ర‌మైతే అక్క‌డే ఉండాల్సి ఉంటుంది.. ప్రిపేరై వెళ్లమని చెప్పాను. అలాగే,అత‌ను వెళ్లిపోయాడు.

భాస్కర్ వెళ్లేసరికే రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌ల‌ైంది..

నేను వెంట‌నే మా కెమ‌రామ్యాన్ అర్వింద్ కు కాల్ చేశాను. రేపు 5 గంట‌ల‌కే స్టార్టవుతున్నాం రెడీగా ఉండమని! ఇంటికొచ్చి ప‌డుకున్నానే కానీ ఎప్ప‌డు తెల్లారుతుందా అనే ఆలోచ‌న‌లోనే ఉదయం 5 ఐపోయింది..

వెంట‌నే స్టార్టయ్యాం….
ఆ స్పాట్.. 130 కిలోమీట్ల‌రు. 2 గంట‌ల సమయం పట్టింది….తీరా అక్క‌డికి వెళ్లాక అక్క‌డి నుండి సుమారు 4 కిలోమీటర్లు మళ్లీ అడవిలోకి న‌డ‌వాలి.
అప్ప‌టికే చ‌లి వ‌ణికిస్తోంది. అత‌ను ఇరుక్కుపోయిన గుహ ద‌గ్గ‌రికి రోడ్డు కూడా సరిగ్గా లేదు.. ద‌ట్ట‌మైన అట‌వీప్రాంతం….నేను 4జీ కిట్ మోస్తుంటే.. అర్వింద్ కెమెరా యూనిట్ మోసుకుంటూ వెళ్లిపోయాం.

సరిగ్గా ఉదయం 7 గంటల 45 నిమిషాలకు స్పాట్ కు చేరుకున్నాం.….చేరుకోగానే ఆఫీసుకు సమాచారమిచ్చాను…అప్ప‌టికే లోక‌ల్ రిపోర్ట‌ర్స్ త‌ప్ప.. స్టాఫర్స్ ఏవ‌రూ లేరు.

కేవ‌లం కామారెడ్డి ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమ‌నాథం, సీఐలు, ఎస్సైలు, కొద్ది మంది స్థానికులు మాత్ర‌మే స్పాట్ లో ఉన్నారు…అయితే అప్పటికే అందరిలో ఒకింత ఉత్కంఠ వాతావరణం మాత్రం కనిపిస్తోంది.
ఎందుకంటే… కంప్రెష‌ర్స్ తో ఓవైపు బ్లాస్టింగ్ చేస్తూ… మరోవైపు జేసీబీలతో రాళ్ల‌ు తొల‌గిస్తున్నారు.

ఆఫీస్ నుంచి కాల్ రాగానే లైవ్ కి రెడీ అయిపోయాను. 8 గంట‌ల బులెటిన్ లో లైవ్ ఇచ్చేశాను. జ‌రిగింది చెప్పాను.
ఏం జ‌రుగుతుందో రిపోర్ట్ చేశాను.

అది అయిపోగానే మ‌ళ్లీ అశోక్ అన్న నుండి ఫోన్!

ఏంటీ… ఎలా ఉంది సిట్యువేష‌న్ అని!!

నేను పిన్ టూ పిన్ ఎక్స్ ప్లైన్ చేశాను.

ఇలా కాదు.. మ‌నం దీన్నే ప‌ట్టుకుందాం.. అస‌లు లోపల అత‌ను ఏంత న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నాడో ఎస్టాబ్లిష్ చేద్దాం.. అస‌లు అత‌ను ఎక్కుడున్నాడు.. లోప‌ల ప‌రిస్థితేంటో విజువలైజ్ గా చూపిద్దామని గైడ్ చేశారు.

అప్పుడు స్టార్ట్ అయింది 9 గంటల బులెటిన్!
ఇక నాన్ స్టాప్ గా లైవ్!!

రాజు ఎక్క‌డ ఉన్నాడో ఆ గుహ‌లోకి వెళ్లి మాట్ల‌ాడే ప్ర‌య‌త్నం చేశాను.. రాజు రెస్పాండ్ అవుతున్నాడు.. మాట్లాడుతున్నాడు.. అత‌నికి ధైర్యాన్నిచ్చాను. ఓవైపు లైవ్ న‌డుస్తుండ‌గానే.. రెస్యూ ఆప‌రేష‌న్ ను కళ్లకు కడుతున్నాం.

మరోవైపు పోలీసులు నిరాంత‌రాయంగా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. ప‌గిలిన బండ రాళ్ల‌ను అక్క‌డున్న ఎస్సైలు తీసేస్తున్నారు.
రాజుకు కావ‌ల్సిన నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌నందిస్తున్నారు.
అప్ప‌టికే గంట నుండి నాన్ స్టాప్ గా లైవ్ న‌డుస్తూనే ఉంది.

మ‌ళ్లీ ఆశోక్ అన్న కాల్!

రాజు బ్ర‌త‌కాలి… ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావాలి.. దీన్ని ఎన్నో లక్షల మంది చూస్తున్నారు అన్నారు!!

మ‌ళ్లీ లైవ్ కంటిన్యూ చేశాం. అక్క‌డి నుండి రాజు చిక్కుకున్న గుహ‌పైకి ఎక్కాను. అప్ప‌టికే కెమ‌రామెన్ అర్వింద్ ఓసారి కింద పడ్డాడు. కానీ.. అక్క‌డ ఆగిపోయే ప‌రిస్థితి లేదు. గుహలో నుండి రాజును పిలిచాను. టీవీ9 నుండి మాట్ల‌ాడుతున్నానని చెప్ప‌గానే.. నా పిల్ల‌ల‌కు నేను బ్ర‌తుకుతానని చెప్పండి సార్ అన‌గానే నా క‌ళ్ల‌ల్లో కూడా నీళ్లు తిర‌గాయి.

నిరుపేద కుటుంబం.. రెక్కాడితేనేగానీ డొక్క‌ాడ‌ని బతుకుచిత్రం. షికారుకెళ్లి వాటితో వ‌చ్చే డ‌బ్బుల‌తో పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు కొనిద్దామనుకున్న వ్య‌క్తి.. మృత్యు కుహ‌రంలోకి వెళ్లిపోయాడు. చావు బ్ర‌తుకుల మ‌ధ్య త‌ల్ల‌ఢిల్లుతున్నాడు. వాట‌న్నింటినీ వివ‌రిస్తూ.. రాజు భార్య, పిల్ల‌ల ద‌గ్గ‌రికి చేరుకున్నాను. వారికి ధైర్యం చేప్పే ప్ర‌య‌త్నం చేశాను.

ఈ లోపు బ్లాస్టింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఐదు బ్లాస్టింగ్స్ త‌ర్వాత రాజు కాళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. మేము అప్ప‌టికే మూడు గంట‌లుగా నీళ్లు కూడా తాగ‌లేదు.. ఓవైపు గొంతు ఎండిపోతుంది.. త‌ల తిరుగుతుంది.. అది గ‌మ‌నించిన అక్క‌డే ఉన్న ఓ ఎస్సై రాజుకు పంపిచాల్సి ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను మాకు అందించాడు. అప్పుడు కొంచెం ఎన‌ర్జీ వ‌చ్చింది. మ‌ళ్లీ లైవ్ స్టార్ట్!
స్టూడియో నుండి ఆశోక్ అన్న… ఫీల్డ్ నుండి నేను.. నాన్ స్టాప్ గా ఇస్తూనే ఉన్నాం.

నేను వెళ్లిన‌ప్పుడు 10 మంది కూడా లేని జ‌నం తర్వాత్తర్వాత వంద‌ల సంఖ్యలో వ‌చ్చేశారు. అంద‌రి నుండి ఒకే మాట.. టీవీ9 చూసి వ‌చ్చామని!

అది మ‌రింత బూస్టింగ్ ఇచ్చింది. కాళ్లు క‌న‌ప‌డ‌గానే అంతా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడనుకున్నారు!
కానీ.. అస‌లు ట్విస్ట్ అక్క‌డే మొదలైంది!!

లోప‌ల త‌ల ఇరుక్కుపోయింది. ఇంకా చాలా చేయాల్సి ఉందనిపించింది.

సరిగ్గా అప్పటికే మ‌ధ్యాహ్నం 2 గంట‌లు సమయమవుతోంది.

అయినా ఇంకా క్లారిటీ రావ‌డం లేదు.

ఈలోపే ఆశోక్ అన్న నా బ్యాట‌రీలు అయిపోతున్న సంగతి గ‌మ‌నించి.. బ్యాకప్ గా కరీంనగ‌ర్, ఆదిలాబాద్ టీంల‌ను పంపిచారు.
అది ఏంత అడ్వంటేజైంద‌టే.. మా 4జీ కిట్ ఆగిపోయిన నిమిషంలోపే క‌రీంన‌గ‌ర్ 4జీ ఆన్ అయింది.

న‌రేష్,క‌రీంన‌గ‌ర్ సంప‌త్ రావ‌డంతో.. ఎక్క‌డా టీవీ9 క‌వ‌రేజ్ ఆగ‌లేదు.

అప్ప‌టికి ఆరు బ్లాస్టింగ్స్ అయ్యాయి. అయినా రాజు భ‌య‌ప‌డ‌టం లేదు. ఏడ‌వ బ్లాస్టింగ్ మాత్రం అత్యంత ప్ర‌మాద‌మైన‌ది. ప్రాణాలు కూడా పోవ‌చ్చు! రాజు కాళ్ల ప‌క్క రెండు రంధ్రాలు చేశారు. వాటిలో బ్లాస్టింగ్ మెటిరియ‌ల్ నింపారు. ఇప్పుడు అంద‌రిలోను ఒకే ఉత్కంఠ!!

మాప‌క్క‌నే కామారెడ్డి ఎస్పీ అప్ప‌టికే అంటున్నారు… ఒక రోజు లేటైనా ప‌ర్లేదు.. ఈ రిస్క్ అవ‌స‌ర‌మా అని.. ?

కానీ బ్లాస్టింగ్స్ చేస్తున్న పెంట‌య్య ఎస్పీకి ధైర్యమిచ్చారు. ఏంకాదు సార్ అని!

అంతే నిమిషంలో 7వ‌సారి బ్లాస్ట్ అయింది. అంతే ఒక్క‌సారిగా అక్క‌డున్న పోలీస్ అధికారుల నుండి క‌ర‌తాళ ధ్వనుల మధ్య ఓ హైడ్రామా ఎపిసోడ్ అనంతరం రాజు బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

చిన్న చిన్న గాయాల‌తో 108లో అస్ప‌త్రికి త‌ర‌లించారు రాజుని!

మృత్యంజ‌యుడుగా మూడు రోజులు న‌ర‌కాన్ని అనుభ‌వించి తిరిగివ‌చ్చాడు.

అంద‌రి ముఖాల్లోనూ ఆనందం…

అప్పుడే ఆపీసు నుండి ఆశోక్ అన్న మళ్లీ కాల్!

అద్బుతం గురూ… భ‌లే చేశారు… చాలా మంచి క‌వ‌రేజ్ అని చెప్పి.. మా మేనేజింగ్ ఎడిట‌ర్ ర‌జ‌నీ సార్ మాట్ల‌ాడుతారని ఫోన్ ఇచ్చారు. ఫోన్ తీసుకోగానే విశ్వ‌రూపం చూపించావ్ ప్ర‌భాక‌ర్!అస‌లు ఏవ‌రూ మ‌న దారిదాపుల్లో కూడా లేరు ఈ క‌వ‌రేజ్ లో అని సార్ అన్న మాటతో ఉద‌యం నుండి ఉన్న అల‌స‌ట ఒక్క‌సారిగా మాయమైపోయింది…ప‌డిన శ్ర‌మ‌కు గుర్తింపు! అంత‌కు మించిన ఆనందమేముంటుంది…? ఇది చాలనుకునే లోపు.. నిన్న ఆఫీస్ నుంచి ఓ మెయిల్! ఔట్ స్టాండింగ్ పెర్ ఫార్మ‌ెన్స్ అంటూ!!

అంద‌రి హెడ్స్ నుంచీ కాల్స్.. మెస్సేజెస్ వ‌స్తూనే ఉన్నాయి.

ఆ వెంట‌నే స్వ‌యంగా టివి9 గ్రూప్ సీఈవో బ‌రుణ్ దాస్ గారి కాల్! ఆయన అభినంద‌న‌లు ఒకింత గర్వాన్నీ… అంతకుమించిన నా ఎఫెర్ట్ కు దక్కిన ఐడెంటిటీని అందించి నా కెరీర్ ను మరింత ప్రోత్సహించాయి. ఇంత‌కు మించి.. ఇంకేం కావాలి ఒక జ‌ర్న‌లిస్టుగా…?!!

ఒక‌ప్పుడు ఆ ఛానల్ ఉద్యోగం వ‌స్తే చాలనుకున్న నాకు.. ఈ రోజు ఔట్ స్టాండింగ్ పెర్ ఫార్మెన్స్ అవార్డు రావడంతో నేనో మెట్టు మాత్రం ఎక్కగల్గాలను… నేననుకున్నది సాధించగల్గడమే కాకుండా… బెస్ట్ గా ప్రూవ్ చేసుకునే స్థాయిలో వర్కౌట్ చేస్తున్నాననే తృప్తే ఇప్పుడు నాకు ఓ గొప్ప అనుభూతి!

TV9-అందరికీ ఓ న్యూస్ ఛానల్ మాత్రమే కావచ్చు! నాకు మాత్రం ఓ సంకల్పం!!

ఛానల్స్ ఎన్నున్నా.. ఎన్నో లోగోలు కనబడుతున్నా.. Tv9 నాకెప్పటికీ ఓ ఏమోష‌నల్ బాండ్!

#TV9 Telugu
#TV9 Breaking News

– ఎం.ప్రభాకర్, టీవీ-9, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking