Header Top logo

ఎ.రజాహుస్సేన్ కలం నుంచి భైరి ఇందిర ప్రస్థానం

కాఫీ విత్… భైరి ఇందిర

ఓ అక్షర విపంచి తన మరణం గురించి
ముందస్తుగా రాసుకున్న కవిత ఇది.!!.

దండలు గిండలు వెయ్యకండి ప్లీజ్..
నాకు ఎలర్జీ..!!

పసుపు గట్రా పూసి..నన్ను భయంకరంగా
మార్చకండి.. పిల్లలు ఝడుసుకుంటారు.!!

పనిలో పని కాష్టం దగ్గర ‘కవిసమ్మేళనం’
పెట్టండి ..నేనూ విన్నట్టుంటుంది….!!

మరణమెప్పుడూ చివరి చరణం కాదు…
మౌనం చితాభస్మం కానే కాదు..మరణం
అంటే మనం భయపడతాం కానీ,నిజానికి
మరణం చాలా గొప్పది..ఎంత గొప్పదంటే
పుట్టుక కంటే గొప్పది..అది భస్మ సింహాస
నం కావచ్చుగానీ,ఎప్పటికైనా మానవపథి
కులు చేరాల్సిన గమ్యస్థానం అదే..తెలుసు
కోవడం జ్ఞానం.తెలుసుకోకపోవడం అజ్ఞానం.
మరణాన్ని ముందే తెలుసుకొని తన చివరి ప్రయాణానికి సన్నాహాలు చేసుకోవడం …
ఆమె దూరదృష్టి..

అవును… ఆమె ‘విజ్ఞురాలు’..!!

నేనోదో తాత్వికంగానో, కాల్పనికంగానో..
ఈ మాటలు చెప్పడం లేదు సుమా!!

మరణం వచ్చి తలుపు తడుతుందని ఖచ్చి
తంగా తెలిశాక కూడా, ఎంతమంది ధైర్యంగా
వుంటారు? ఎప్పటికైనా మరణం తథ్యం..
అయితే అదెప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు.

కానీ ..

ఆమెకు మాత్రం తెలుసు..

మృత్యుదేవత వచ్చి తలుపులు బాదీబాదీ అలిసిపోకుండా వుండేందుకు.. ముందుగానే తలుపులు బార్లా తెరిచి,స్వాగతం పలికింది.
రేపుంటామో లేదో తెలీదు కాబట్టి,పనిలోపని
గా తన మరణానికి సంబంధించి ఓ కవితను
కూడా రాసుకుంది..తను పోయాక ఏం చేయా
లో? ఏమేం చేయకూడదో అందులో చాలా స్పష్టంగా రాసింది..ఓ రకంగా ఇది ఆమె… ‘మరణవాంజ్మూలం’ అనుకోవచ్చు..లేకుంటే
తన మరణానంతరపు ‘ వీలునామా’ గా భావించ వచ్చు..!

నేను చెప్పబోతున్న అక్షర విపంచి పేరు…

‘భైరి ఇందిర. ఇప్పుడామెలేదు. తుర్రుమని
గాల్లో ఎగిరి పోయింది. ఎక్కడికి వెళ్ళిందో
తెలీదు కానీ.. మొత్తానికి వెళ్ళిపోయింది..
ఆమె ఇప్పుడు లేదు. ఆమె జ్ఞాపకాలు
మాత్రం ఆకుపచ్చగా అక్షరాల్లో నిక్షిప్తమై..
వున్నాయి..!!

ఈరోజు కాఫీ సమయమిలా బరువుగా, బాధ
గా గడుస్తున్నందుకు నన్ను క్షమించండి..!!

మరణానికి ముందుగానే “భైరి ఇందిర”గారు
రాసుకున్న ఈ చివరి కవిత చదవండి..!!

“నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది

మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్?

పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను.!

దండలు గిండలు వెయ్యకండి
నాకు ఎలర్జీ..!

పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా!

పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది.

నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి

మంగళవారమైనాసరే,
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి

డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి

కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో

బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు

దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది

పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి

పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది

*నేను పోయినప్పుడు.
✍🏼Indira Bhyri.

ఏదో ఒక రోజు అందరం పోయేవాళ్ళమే…
కాకుంటే ఒకరు ముందు..ఇంకొకరు వెనుక.
భైరి ఇందిరగారు మనల్ని విడిచి కాస్తంత
ముందుగా వెళ్ళిపోయారు.అంతే.‌!

ఆమె ఎక్కడికి వెళ్ళారు…?

అందరూ వెళ్ళే చోటికే….!

అది నరకమా? స్వర్గమా? లేక ఇంకేదైనానా?
తెలీదు. అసలు ఇవన్నీ వున్నవో లేవో ఎవరు
చూశారు. పుట్టుట గిట్టుట కొరకే. అయితే…
అందరూ పుడతారు..అందరు గిడతారు..
అందులో పెద్ద విశేషం ఏమీ లేదు.కానీ, కొంద
రి పుట్టుక ఓ లక్ష్యంతో ముడిపడి వుంటుంది.
ఆ లక్ష్యం నెరవేరగానే వారు వెళ్ళిపోతారు.

భైరి ఇందిర గారూ అంతే..

ఆమె కవయిత్రి..

అంతకు మించి ఓ మంచిఉపాధ్యాయురాలు.

సహృదయత,స్నేహం..ఆమె సుగుణాలు.

తన వంతుగా అన్నిటినీ అందరికీ పంచేసి.

ఆమె వెళ్ళిపోయింది..

పోతూ..పోతూ..ఇదిగో.అయినవాళ్ళకోసం
తన వంతుగా ఈ చివరి కవితను విడిచి వెళ్ళింది..!

మరణం తన చివరిచరణం కాదన్నాడు
అలిశెట్టి..

భైరి ఇందిరగారూ అంతే..

మరణం కేవలం భౌతికమైంది.

ఇప్పుడామె మనతో లేకపోవచ్చుగానీ,
ఆమె తాలూకు జ్ఞాపకాలు సాహిత్య రూపంలో ఎప్పుడూ మనతోనే వుంటాయి.‌!

ఆమె సంస్కారం..

ఆమె వినయం..

ఆమె సౌశీల్యత..

ఆమె కవిత్వం…

ఇంకా..ఇంకా …ఆమె గుర్తులు

ఎప్పుడూ పచ్చిగానే వుంటాయి..

ముఖ్యంగా, మరీ ముఖ్యంగా.. ఇదిగో
ఈ చివరి కవిత.

మొక్కకు జాగ్రత్తగా అంటుకట్టినట్టు.
ఎంత చక్కగా రాశారు..

‘పోయినోళ్ళందరూ మంచోళ్ళు’ అని ఆత్రేయ
గారన్నారు కానీ.. నిజానికి ఇందులో అబద్ధపు పాలే ఎక్కువ. భైరి ఇందిర మాత్రం అలాకాదు. నిజంగానే.. నిఖార్సుగానే మంచివారు.

లేకుంటే….

ఇలా ఇంత సింపుల్ గా ముందుగానే తన
మరణానికి రంగం సిద్ధం చేసుకుంటారా!

ఈ చివరి కవిత చదివాక ఇందిరగారు
ఎక్కడికీ పోలేదు.

ఆమె మనతోనే వున్నారు.

అక్షరంతో మమేకమై వున్నారనిపిస్తుంది.

*చివరి కవితా లేఖ..!

‘తాను పోయినప్పుడు మీద ఏదిపడితే అది
కప్పొద్దు.. ఓ కాగితాన్ని మాత్రం కప్పండి.
అదైతే రాసుకోడానికి పనికొస్తుంది.అంటారు
భైరి ఇందిర..తానున్నా,లేకున్నా అక్షరం తన
తోడుండాలంటే…రాసుకోడానికి కాగితం
వుండాలన్నది ఆమె కోరిక..

సరే పోయాక.. అంతిమ సంస్కారాలు మామూలే..‌ అయితే వాటికీకొన్ని కండీ
షన్లు పెట్టారు ఇందిర…

*అంతిమ సంస్కారానికి ముందు..అందరి
కీమల్లే..పసుపు గట్రా పూసి భయంకరంగా..
మార్చకండి.చిన్నపిల్లలు ఝడుసుకుంటారు
పైగా తనను గుర్తుపట్టాలి కదా!అందుకే….
తనను తన్నుగానే తీసుకెళ్ళమని,ఇందిరగానే గుర్తుపట్టేలా వుంచమని,.హంగామా ఏదీ
చెయ్యొద్దని.అని సుతి మెత్తగా తాకీదిచ్చారు.

అంతేనా?

సాంప్రదాయం అంటూ… తనను మట్టిలో
కప్పెట్టడమో? లేక కాల్చడమో చేస్తారేమో?

ప్లీజ్…!

మట్టిలో కప్పెట్టొద్దు… గాలాడక ఇబ్బంది
పడతాను.అంతేకాదు..ఏవైనా పురుగూ
పుట్రా వుండొచ్చు..చికాకు పరుస్తాయి..

పోనీ..‌

చితిలో తగలబెడతారేమో?

కాస్త చూసి తగలబెట్టండి…

పక్కన మొక్కలుంటాయి..

నా మూలంగా మంటల్లో కాలిపోతాయి..
జరభద్రం.‌వెనుకా ముందూ చూడండి…
జర శోచాయించండి అంటూ.. జాగ్రత్తలు చెబుతారు..తన కోసంమొక్కలకు ఇబ్బంది కలగరాదన్నది ఆమెఉద్దేశం..ఎంతైనా ఆమె పరోపకారి,పర్యావరణ ప్రేమికురాలు కదా!

తనతో పాటు..‌పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడమన్నది ఆమె అభ్యర్ధన..ముఖ్యంగా సెల్ మర్చి పొయ్యేరు.‌
బోర్ కొట్టి చస్తాను’అంటూ దుఃఖంలో కూడా హ్యూమర్ ను ..జొప్పించి,అందర్నీ నవ్విస్తా
రు..అలాగే..దండలు గిండలు వెయ్యకండి నాకు ఎలర్జీ..!’అంటూ ముందు జాగ్రత్తలూ చెబుతారు..!!

ఇక మనిషి ఉన్నప్పుడొక మాట.. లేనప్పు డొకమాట..ఇది లోకంతీరు..అందుకే ఇందిర గారంటారు…”దయచేసి నాకు‌ పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని పేర్లు పెట్టకండి..కొత్త టైటిల్స్
ఏమీ ఇవ్వకండి. నాకు చిర్రెత్తుకొస్తుంది’ అంటారు..

అది సరేగానీ..తాను పోయాక ..తనతో పాటు తన సామాన్లన్నీ వేస్ట్ గా పడేస్తారే
మో?అలాచేయకండేం..‌అవసరమున్న వాళ్ళుచాలామంది వుంటారు..అడిగిన
వాళ్లకు ఇచ్చేయండి’..అంటూ ఆర్డర్ వేశారు.!

అలాగే..చావుక్కూడా శకునం, మంచి రోజు గట్రా.. చూడకండి..వాటిల్లో నాకు నమ్మకం  లేదు..అది మంగళవారమైనాసరే,పాడెకు నల్ల కోడిపిల్లను కట్టి..పాపం దాన్ని హింసించకండి..అది నన్ను తిట్టుకుంటుంది. బతికున్నప్పుడేమైనా.. ఈ కడసారైనా తన మాట ను నెగ్గనియ్యండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు ఇందిర.‌

ఇక చావుకూడా పెళ్ళి లాంటిదే…అన్నట్టు..
అంతిమయాత్రలో డ్యాన్సులు గట్రా ఆడి
లేట్ చెయ్యకండి..‌..ఏదైనా టైం ప్రకారం జరగితేనే బాగుంటుంది…అంటారు.

ఎంతైనా టీచర్ కదా.! బడివేళల్లానే…
అన్నిటా ‘సమయపాలన’ అవసరమన్నది ఆమె మాట…!

ఇక తన మరణ వార్తను బడికి ఇన్ఫామ్ చెయ్యటం మరవొద్దంటున్నారు. ఎందు
కంటే.. తన మరణానికి సంతాపంగా వాళ్లు సెలవిచ్చుకుంటారు..‌

తాను లేనని దేనికీ ఇబ్బంది పడొద్దు.
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది. మీకేం కావాలో తెచ్చుకోండి…

సరే అంతిమ సంస్కారం తర్వాత.. ఓ పనైపోయిందన్నట్టు చుట్టపక్కాలు..
అయినోళ్ళందరూ ఎవరి దారిన వారు
వెళ్ళకండి.‌పిండప్రదానాలు..పెట్టినా పెట్ట
కున్నా‌.అంతిమసంస్కారానంతర కార్యక్ర
మాలకు అన్ని రోజులూ అందరూ ఇక్కడే ఉండండి…మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి.?
చావు ఒక్కసారే కదా వచ్చేది’ అంటూ ..
చమత్కారించారు ఇందిర.‌

చివరగా..సంతాపాలు..సభలు.గట్రా సంగతి
ఏమైనా…పనిలో పనిగా కాష్టం దగ్గరే ఓ
కవిసమ్మేళనం పెట్టండి నేనూ ఉ(వి)న్న
ట్టుంటుందంటూ..లాస్ట్ పంచ్ పేల్చారు..
భైరి ఇందిర..

మరణాన్ని ఇంత ఆనందంగా స్వీకరించడం
ఇందిరగారికే చెల్లింది..ఎదుట మృత్యువొచ్చి
నిలిస్తే..ఓ హగ్ ఇచ్చి,కరచాలనం చేసిన..
సాహసి ఆమె…

ఇందిర గారి సాహిత్యాన్ని చూస్తే..ఆమె ఏమి
టో? ఆమె వ్యక్తిత్వమేంటో ఇట్టే అర్ధమవు
తుంది.తాను పోతున్నా..తనవల్ల ఎవరూ
ఇబ్బంది పడకూడదన్న ఆమె తపనకు.. జోహార్లు..సమాజం పట్ల,ముఖ్యంగా మను
షులపట్ల నిబద్ధత..అంకిత భావానికి ….
హాట్సాఫ్..

ఇందిరగారూ.. మీరు లేరని ఎవరన్నారు…
మీరు విడిచివెళ్ళిన అక్షరాల తోడుగా..
మీరు మాతోనే వున్నారు.‌పిల్లలకు పాఠాలు
చెప్పి,పిల్లలతో జీవితాన్ని గడిపి మీరూ…
పిల్లకాయ అయిపోయారు ..లేకుంటే..
ఇంత సున్నితమైన మనసు ఎక్కడుంటుంది?

అన్నట్టు..మీ చివరి కవితను చదివితే..
పాపం..మృత్యుదేవత కూడా కంటతడి
పెట్టుకుంటుంది..లోలోపలే నవ్వుకుంటుంది.
మృత్యువు కంట తడి,పెదాలపై నవ్వుల్ని పూయించడం మీకే చెల్లింది…

ఈ కవిత చదివిన ప్రముఖ కవి సాంధ్రశ్రీ గారు
నాకు ఫోన్ చేసి..కన్నీటి చెమ్మతో ఓ మాటన్నారు.‌

“ఆమెకు నా నమస్కారం.ఆమె సంస్కారానికి
మరో నమస్కారం.. ఎంత సింపుల్ గా, హృదయానికి హత్తుకున్నట్టు రాసిందామె..నిజంగా గ్రేట్ “ అన్నారు.‌

నిజమే కదా!

అక్షరం ఎప్పుడూ గ్రేటే…

గుండె తడి అద్దిన ఇలాంటి
అక్షరాలైతే మరీ గ్రేట్…..?!

భైరి ఇందిరమ్మా…!

మీకు జోహార్లు‌.

కన్నీటి నివాళులు.!!

ఎ.రజాహుస్సేన్…!!

ప్రముఖ రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking