Header Top logo

అమిత్ షా ప్రసంగంపై ఎంపీ రంజిత్ రెడ్డి ఆగ్రహం

అమిత్ షా ప్రసంగంపై

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్

హైదరాబాద్,  ఏప్రిల్ 24 : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, అమిత్ షా వచ్చి రాష్ట్రానికి ఏదో చేస్తారనుకుంటే బిజెపి నేతలు రాసిచ్చిన స్ర్కిప్ట్ చదివి వెళ్లారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జి రంజిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బిజెపి ప్రభుత్వం పాలించే 21 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అయిదు శాతం కూడా అమలు చెయ్యడం లేదని విమర్శించారు.

సోమవారం చేవెళ్ల టౌన్ లోని కే జి ఆర్ గార్డెన్స్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి లతో తో కలిసి ఆయన మాట్లాడారు. చేవెళ్ల సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీజాపూర్ హై వే గురించి అయిదు ఏళ్ల నుంచి భూ సేకరణ చెయ్యలేదన్నారనీ, అయితే ఆ పనులను గత ఏడాది సెప్టెంబర్ నుంచి కేవలం ఆరు నెలల్లో భూ సేకరణ 76 శాతం పూర్తి చేశామని తెలిపారు.

పెట్రోల్, డీజిల్ 35 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకుంటుందని, కేవలం హై వేల కోసం 39 వేల కోట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ హయంలో 30 వేల కోట్లు ఇస్తే తాము లక్ష ఇరవై వేల కోట్లకు పెంచినమని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 లో 15 వేల కోట్లు, 2022-23 లో ఇచ్చింది కేవలం 32 వేల కోట్లు అని ఆధారాలతో సహా చూపెట్టారు. రాష్ట్రం నుంచి రూపాయి తీసుకుని అర్ధరూపాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చేవెళ్ల సభ లో అమిత్ షా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాకా రాష్ట్రం నుంచి పన్ను రూపంలో కలెక్ట్ చేసిన రూపాయికి, రూపాయి పావలా ఇస్తానన్నారని, బిజెపి అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఏ మేరకు నిధులు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులలో 50 శాతం దాటలేదని పేర్కొన్నారు.

వైయస్సార్ హయాంలో నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లను ఆరు శాతానికి పెంచుతూ సీఎం కేసిఆర్ అసెంబ్లీ తీర్మానం చేసి, ఆమోదించి,పార్లమెంటుకు పంపిస్తే కనీసం ఆమోదించలేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే, బిజెపి ఆ వర్గాల పట్ల కనీస కనికరం చూప లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీకి మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మరే పనిలేదని విమర్శించారు.

బిజెపి బిజెపి రాష్ట్ర నాయకులు రాసిన స్పీచ్ ను అమిత్ షా చదివారని, ఆయన ప్రసంగంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి కనీస ప్రస్థానం లేకపోవడం శోచనీయమన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అప్పర్ భద్ర శాంక్షన్ చేశారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. అమిత్ షా ప్రసంగం అబద్దాలతో నిండి పోయిందని, ఆయన ప్రసంగాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మరాన్నారు.

బిజెపి నేతలు రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పాలని, విజయ సంకల్ప సభ పేరుతో బిజెపి చేసింది కేవలం సొంత ఆర్భాటం కోసమేనన్నారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ లీకేజీలు బాధాకరమని, అయితే గుజరాత్లో పరీక్ష పేపర్లు లీకైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేశారా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లీకేజీ పై సిట్ ద్వారా విచారణ జరుపుతుందని, అయితే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన పై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ను నమ్మే బిజెపి నేతలు మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ను, పోలీసులను ఎందుకు నమ్మరని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు దేశంలో ఎక్కడ లేని విధంగా 7 లక్షల కెమెరాలు నగరంలో అమర్చి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు తెలియాలంటే అమిత్ షా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించాలన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని, అలాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మిస్తుందని అయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం సొంత కాళ్లపై నిలబడి, వృద్ధి చెందుతుందన్నారు.

3 లక్షల 37 వేలకు రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని గుర్తు చేస్తూ, అది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కడుపుమంటతోనే బిజెపి నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. అమీత్ షా ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, కేంద్రానికి సహకరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నా మనస్సు బీజేపీకి లేదన్నారు. ప్రతి పల్లెలో ఉన్న గల్లీ నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగుపరచుకోవాలో తమ పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking