Header Top logo

V6 తో నా అనుబంధం పుష్కర కాలం

V6 తో నా అనుబంధం పుష్కర కాలం

ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో తీపి జ్ఞాపకాలు, లెక్కకు మించిన అనుభవాలు… అంతకన్నా గొప్ప అనుబంధాలు.

మనం చేసే పనులు రెండు రకాలుంటాయి.. ఒకటి సంతృప్తి కోసం చేసే పని, రెండోది డబ్బు కోసం చేసే పని. ఈ రెండింటిలో ఏది మనకు ఆనందాన్ని ఇస్తుందని ఆలోచిస్తే… డబ్బు ముఖ్యమే అయినా, ఆత్మ సంతృప్తి కోసం చేసే పనిలోనే అసలు ఆనందం ఉంటుంది. చదువుకునే రోజుల నుంచి నేనూ అలాంటి ఉద్యోగమే చేయాలి అనుకునే వాడిని. అనుకున్నట్లుగానే జర్నలిజంలోకి అడుగు పెట్టాను.

2007లో ఈటీవీతో మొదలైన ప్రస్తానం.. ఆ తర్వాత వీసిక్స్ లోకి చేరింది. మొత్తానికి 16 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా చాలా సంతోషంగా జర్నీ సాగుతుంది V6 తో నా జర్నీ ఇవాళ్టితో 11 ఏండ్లు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెట్టింది.

స్కూల్ డేస్ నుంచే… అయితే పోలీస్, లేదంటే జర్నలిస్టు కావాలనే కోరిక..

స్కూల్ డేస్ నుంచే నాకు జర్నలిజం పై ఇష్టం. డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాటి నల్లగొండ ఈటీవీ స్టాఫ్ రిపోర్టర్ మల్లిక్ గారితో పరిచయం ఏర్పడింది. ఎలాగైనా ఈటీవీలో చేరాలని సుమారు 6 నెలల పాటు రామగిరిలోని ఈనాడు కార్యాలయానికి ఉదయం, సాయంత్రం వెళ్లేవాడిని.

ఆయన నాలోని ఆసక్తిని గమనించి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ చదవడంతో పాటు అవే నోట్ బుక్ లో రాయాలని చెప్పారు. తను చెప్పినట్లుగానే చేసేవాడిని ఆ తర్వాత నల్లగొండ డివిజన్ స్ట్రింగర్ గా జాయిన్ అయ్యాను.

కొంత కాలం పని చేశాను ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఎన్నో చక్కటి కథనాలను ప్రజలకు అందించే అవకాశం దక్కింది. జర్నలిస్టుగా నేను గర్వించే ఎన్నో కథనాలు రూపొందించాను.

ఎస్సై కోచింగ్ టు V6 రిపోర్ట్

2010 లో ఈటీవీకి గుడ్ బై చెప్పి ఎస్సై కోచింగ్ కోసం హైదరాబాద్ కు వెళ్లాను. అప్పుడే నా కెరీర్ లో కీలక మలుపు. ఆ సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వీసిక్స్ న్యూస్ ఛానెల్ రాబోతుందనే విషయం తెలిసింది.

అప్పుడు టీవీ9 రిపోర్టర్ గా పని చేస్తున్న శేఖర్ రెడ్డి గారి సహకారంతో బేగంపేటలో ఉన్న విశాఖ సంస్థ ఆఫీస్ కు ఇంటర్వ్యూకు వెళ్లాను. నల్లగొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యాను. 01/02/2012 రోజున అధికారికంగా జాయినింగ్ లెటర్ తీసుకున్నాను.

V6 లో చేరడానికి నాటి V6 ఇన్ పుట్ ఎడిటర్ సంగప్ప గారి సహకారం మరువలేనిది. ఆ రోజు నుండి గత 11 సంవత్సరాలుగా వీసిక్స్ తో నా ప్రయాణం కొనసాగింది. ప్రస్తుతం 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను. అప్పటినుండి ఇప్పటి వరకు మా సీఈఓ రవి సర్ నుండి మొదలుపెడితే వెంకట్ సర్, చంద్రమౌళి సర్ & ఆల్ HODs, నాతో పాటు పనిచేసే మిత్రులు ప్రత్యేకంగా నా నల్లగొండ టీమ్ సపోర్ట్ చాలా గొప్పది.

ఈ పుష్కరకాలంలో నేర్చుకున్నది ఏంటంటే?

కష్టపడి చేసే పని కంటే ఇష్టపడి చేసే పనిలో సంతోషం ఉంటుంది. అలాంటి సంతోషం తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన రిపోర్టింగ్ తో ఎంతో లభించింది.

సూర్యాపేట సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్, ఆలేరు వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ లాంటి బ్రేకింగ్ వార్తలను అందించడం, నాగార్జునసాగర్- శ్రీశైలం జలవిహారం, కృష్ణ పుష్కరాలు లాంటి పర్యాటక వార్తలను చేయడం ఇంకా ఎన్నో వార్తలు కెరీర్ లోనే గొప్ప సంఘటనలుగా మిగిలిపోతాయి.

ఒకరు వార్తలు బాగున్నాయ్ అంటారు .. మరొకరు చూస్తా ని సంగతి అంటాడు ఆ మాట వినగానే నాకు నవ్వొస్తుంది. V6 సంస్థలో పని చేయడం అనేది చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది.

వార్తను వార్తలాగే చూడాలనే ఎడిటోరియల్ నిర్ణయం నాకు బాగా నచ్చే విషయాల్లో ఒకటి. ఏ వార్తను ఓన్ చేసుకోకూడదు. మంచిని మంచి, చెడును చెడుగానే చూపించాలి. అధికారులు, రాజకీయ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు వేరే, వృత్తి పరమైన సంబంధాలు వేరే అని గుర్తుంచుకోవాలి.

ఓ పార్టీకి పాజిటివ్ గా, మరోపార్టీకి నెగెటివ్ గా వార్తలు ఇవ్వాలనే సంప్రదాయం వీసిక్స్ లో లేకపోవడం మరో గొప్ప విషయం. అధికార పక్షానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, విపక్ష పార్టీలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది.

ఈ పుష్కర కాలంలో పోలీసు వ్యవస్థతో పాటు ఇతర అధికారులతోనూ మంచి సోర్స్ సంపాదించుకునే అవకాశం దక్కింది. ఏ అధికారికి వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్ గా లేకపోయినా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా, క్షణాల్లో కచ్చితమైన సమాచారాన్ని పొందే స్థితిలో ఉన్నాను. నాకు వ్యక్తిగతంగానూ V6 యాజమాన్యం అండగా నిలిచింది.

మా నాన్నగారు చనిపోయినప్పుడు చానెల్ అధినేత వివేక్ వెంకట స్వామి గారు మా ఇంటికి వచ్చి మరీ పరామర్శించి వెళ్లడం నేనెప్పటికీ మర్చిపోలేను. కరోనా సమయంలో నాకు కరోనా సోకితే సీఈవో అంకం రవి సర్, చీఫ్ కోఆర్డినేటర్ వెంకట్ సర్ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా నా ఆరోగ్యం గురించి ఆరా తీసేవారు.

ఉద్యోగపరంగానే కాకుంగా వ్యక్తిగతంగానూ V6 సంస్థ వెన్నంటి ఉన్నది. ముందు నుంచి నాకు ఉన్న కోరికలను చంపుకొని జీవించడం రాదు. ఎవరేమనుకున్నా నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంటాను. అలాగే ఉండేలా అవకాశం కల్పించిన V6 యాజమాన్యానికి ధన్యవాదాలు. మునుముందు ప్రోత్సాహం ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..         

– శేఖర్ కంభంపాటి

V6 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్,

ఉమ్మడి నల్లగొండ జిల్లా

Leave A Reply

Your email address will not be published.

Breaking