AP 39TV 19ఏప్రిల్ 2021:
దిల్లీ: యూపీలోని వారణాసిలో కరోనా వైరస్ ముప్పు నుంచి ప్రజల్ని రక్షించేందుకు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. వారణాసిలో ప్రస్తుత పరిస్థితులపై ఆదివారం అక్కడి అధికారులతో మోదీ సమీక్షించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.‘తొలి దశలో మాదిరిగానే వైరస్‌కు చెక్ పెట్టేందుకు టెస్ట్, ట్రేస్, ట్రాక్ విధానాన్ని అనుసరించాలి. కరోనా ముప్పును నివారించడానికి ప్రజలు, ప్రభుత్వం మధ్య సహకారం అవసరం. కాబట్టి అలా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రజలకు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడంపై అధికారులు అవగాహన కల్పించాలి. అదేవిధంగా 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అవగాహన కల్పించాలి. కరోనా చికిత్స విషయంలో ప్రజలకు అన్ని రకాలుగా సహాయం అందించాలి’ అని మోదీ అధికారులకు సూచించినట్లు పీఎంవో వెల్లడించింది. సంక్షోభ సమయంలోనూ వైద్యులు ఎంతో నిబద్దతతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని మోదీ అభినందించినట్లు పీఎంవో ప్రకటనలో తెలిపింది.