తెలంగాణ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలు తప్ప రాష్ట్ర సమస్యలు ఏ మాత్రం పట్టడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే మరణిస్తున్నా సిగ్గులేని కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా రైతు మామిడి బీరయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 9 రోజులుగా పడిగాపులు గాసి.. చివరకు ఆలస్యాన్ని తట్టుకోలేక.. ధాన్యం కుప్పలపైనే మరణించడం అత్యంత బాధాకరం,దురద్రుష్టకరమన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను అత్యంత హీనద్రుష్టితో చూస్తోందని విమర్శించారు.పంటలకు పట్టే గులాబీ చీడలా అన్నదాతల శ్రమని, రక్తాన్ని పీల్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగొలు విషయంలో నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ దిక్కుమాలిన కేసీఆర్ వచ్చాక అమ్మకాల టోకెన్ల కోసం కోసం కూడా రైతులు తోపులాటలు..తన్నుకునే పరిస్థితిని తీసుకువచ్చాడని దుయ్యబట్టారు. సన్నరకం బియ్యం మార్కెట్లో 25 కిలోలు రూ.1000 వరకూ ఉంటే.. మద్దతు ధరకు మంగళం పాడి ఇక్కడ క్వింటాలుకు రూ. 1650కే మిల్లర్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.
రైతులను నిట్టనిలువునా ముంచేస్తూ దగా ప్రభుత్వం దగా చేస్తోందని, రైతులకు మద్దతు ధర ప్రకటించకుండా..మిల్లర్లతో కుమ్మక్కై వారి దోపిడీకి సహకారం అందిస్తోందని ఆరోపించారు. వరి ధాన్యం రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కమిటీ దీనిపై ఉవ్వెత్తున రాష్ట్రంమంతా ఉద్యమిస్తుందని మధుయాష్కీ గౌడ్ హెచ్చరించారు.