Closing charms-9 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-9
Closing charms-9
పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-9
దసరా నాడే కొట్లాటలు..
తెలంగాణ జిల్లాలలో 1990 దశకం దాకా దసరా పండుగ అనగానే పోలీసులకు సమస్యాత్మక గ్రామాలు గుర్తుకొచ్చేవి. గట్టి బందోబస్తు పెట్టేటోల్లు. అయినా కూడా గొడవలు జరిగేవి. యాడాదంత ఊర్లోనే ఉంటారు. అయినా దసరా నాడే గొడవలు జరిగేవి. కొన్ని గ్రామాల్లో కొట్లాటలో తలలు పలిగెదాక కొట్టుకునెటోల్లు. కొన్ని గ్రామాల్లో చంపుకునేవారు. దీంట్లో ఒక్కరూ కూడా పెద్ద కులపోల్లు సావక పొయ్యేది. కనీసం దెబ్బలు కూడా తగులకపొయ్యేవి. ఏం జరిగిన కింది కులపోలకే జరిగేది. అందులో ఎక్కువగా తెనుగోల్లు, ముత్రాసోల్లుగా పిలిచే ముదిరాజ్ కులస్తులకే జరిగేది. గిట్లెందుకైయేది గిదంతా గారోజే ఎందుకైతదో చాలా కాలం దాక నాకు అర్థం కాలే.
పేరుకే రాజులం.. ముదిరాజులం
పేరుకే మేం రాజులం ముదిరాజులం అంటారు. కానీ వాస్తవానికి కొందరి ప్రయోజనాల కొరకు బంట్లుగా ఉంటూ వస్తున్నాం. భూస్వాముల పోరులో మాల, మాదిగలు పెట్టిన అట్రాసిటీ కేసులలో ఎక్కువగా ముదిరాజుల మీదనే నమోదైన విషయం చాలా అధ్యాయాల్లో తేలిందని సామాజిక శాస్త్రాల ఆచార్యుడు, మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి కలిసి నప్పుడల్లా సెప్పెటోడు. ‘నువ్వేమన్న ప్రజల కోసం పనిచెయ్యాలనుకుంటే ముందు ముదిరాజులలో సాంస్కృతిక, విద్యా పరంగా చైతన్యం తీసుకరా’ అనెటోడు. 1996 నుంచి తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలలో ఏడ కల్సినా ముందు ‘ముదిరాజుల కోసం పని చెయ్యి. మిగతోల్ల కోసం మేం పనిచేసుకుంటం’ అనే వారు. గంటా చక్రపాణి సర్ గిట్లేందు కనుకుంటుండో రెండేండ్ల కింద మా ఊర్ల దసరా పండుగ నాడు జరిగిన ఘటన సూస్తే గాని నాకర్ధం కాలేదు.
ఇద్దరూ దొరల పెత్తనం పంచాయితీ
ఆరోజు ఏం జరిగిందో చెప్త మరి..దసరా పండుగ జెండా పంచాయతీ. ఇద్దరు దొరల పెత్తనం కోసం ముదిరాజుల పూనకం. దసరా పండుగని మా ఊరైన ఘట్ కేసర్ మండలం అంకుషాపూర్ కు పోయిన. మా ఇంటి దగ్గరనే కచ్చీర్ ఉంది. ఆడ తరతరాలుగా కొమ్మిడి నారాయణరెడ్డి, అటు తర్వాత ఆయన చిన్న కొడుకు మాలి పటేల్ కొమ్మిడి సుదర్శన్ రెడ్డి మూడు రంగుల జెండా ఎగురేసేటోడు. సుదర్శన్ రెడ్డి కూడా చనిపోయాక ఆయన చిన్న కొడుకు కొమ్మిడి దామోదర్ రెడ్డి జెండా ఎగురవేస్తున్నాడు.
జెండా కోసం దొరల ఆధిపత్యం పోరు
ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడ్డది. దామోదర్ రెడ్డి పెద్దనాయన కొమ్మిడి హరిమోహన్ రెడ్డి కోడలు, కొమ్మిడి జలజ గ్రామ సర్పంచి అయ్యింది. ఆ సర్పంచి భర్త కొమ్మిడి సత్యనారాయణరెడ్డి జెండా సామాన్లు తెచ్చి ‘సర్పంచి ఎగురవేస్తది. సర్పంచిని ఎగురేయ నియకుంటే పని పాటలోలైన డప్పుకొట్టె మాదిగోల్లు లేదా కావలి తనం చేసే ముదిరాజులు జెండా కడ్తరు. కాదూ కూడదని ఎవరన్న తోకాడిస్తే ఏమైతదో తెల్సు గదా?’ అని పోయి కచ్చీర్ కాడ కూసుండు. కొడుకు రాంమెాహన్ రెడ్డి, అల్లుడు రవిచందన్ రెడ్డి కూడా డిఎస్పీ స్థాయి పోలీసు అధికారులు. పోలీస్ బిర్రుతో అరాంగా కూర్చుండు. అప్పుడే దామోదర్ రెడ్డి వచ్చి నేనే ఎగురేస్త తర తరాల సంప్రదాయం కాదనడానికి సర్పంచి భర్త ఏవరని అంటుండగానే తెచ్చిన సామానులను పంచాయతీ ఆఫీసుకి పంపించిండు కొమ్మిడి సత్యనారాయణరెడ్డి.
దొరతనం పోయి నలుపై ఏండ్లైంది
ఇంకెక్కడి పటేలు గిరి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. తెలంగాణ కూడా వచ్చింది. ఇక దొరతనం. పటేల్ గిరికి కాలం చెల్లింది. ఇంకెక్కడిది ఫ్యూడల్ కల్చర్. అన్ని ఊర్లల్లో సర్పంచి ఎవ్వరుంటే ఆలే జెండెక్కిస్తుండ్రు. ఏది ఏమైనా సరే సర్పంచే ఎగురేయాలి. ఆయన దగ్గర కు పోయినోల్లతో అంటూ నిమ్మలంగా కచ్చీర్ మీదనే కూర్చుండు సత్యనారాయణరెడ్డి.
గొడవలో ముందుండేది ముదరాజ్ యువకులే
ఆ తర్వాత దామోదర్ రెడ్డి కొబ్బరి కాయ కొట్టి జెండా ఎగురేసిండు. ఇక కచ్చీర్ కాడ కొట్లాట జరుగుతుందని తెల్సుకొని వచ్చిన సత్యనారాయణరెడ్డి అనుచరులైన ముదిరాజ్ యువకులు దామోదర్ రెడ్డి వర్గంలో ఉన్న ముదిరాజ్ యువకులతో గొడవ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట అయ్యింది. కావలికార్లకు డప్పులోల్లకు కష్టమెుచ్చింది. కరువ మంటె కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం. అన్నట్లుగా దొరోల పెత్తనం కోసం పని పాటలోల్లు నలిగిపోయ్యారు. డప్పులు కొట్టొద్దని ఓ దశలో డప్పులోల్ల మీదికొచ్చిండ్రు సత్యనారాయణరెడ్డి వర్గీయులు. కాని కచ్చీర్ మీద కుసున్న సత్యనారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి లు కానీ కొట్టుకోలే. తిట్టుకోలే. దామోదర్ రెడ్డి మాత్రం గాలిలో తిట్లని అందుకున్నడు.
ఎవ్వరూ చెప్పిన వినిపించుకోరు
జెండా ఎగరేయడం కోసం ఇద్దరు దొరలు పంతం పడుతుంటే మనమెందుకు కొట్టుకోవాలే. తన్నుకోవాలే. వారెమో మనల్ని తోసి నిమ్మలంగా కూసుండ్రు అని నేను ఎంత మెుత్తుకున్న ఒక్కరు కూడా వింటలేరు. పైపెచ్చు ‘నీకు ఊరి రాజకీయం తెల్వది’ అని నన్నే అంటుండ్రు. పండుగ గదా బిర్రుగున్నరని సప్పుడు జెయ్యకుండా ఉండిపోయిన. ముదిరాజ్ యువకుల అమ్మ అయ్యలొచ్చి ‘మనకెందుకు బిడ్డా?’ అని అడ్డుపడ్డా కూడా ఇంకా మత్తుదిగలే. ‘దొరోల్లు ఎప్పటికైనా ఒక్కటే మనమే తేఢరా వద్దు బిడ్డా!’ అన్న. మనోల్లు తగ్గుతలేరు. దొర టానిక్ మహిమ మరి.
దొరలు నిమ్మలంగా..
‘సూడుండ్రా… అగో సూడుంర్రి దోరోలు నిమ్మలంగ కూసున్నురు. మా పిల్లల్ని తాపించి ఇట్ల తయారు జేసిండ్రు’ అని కొంత మంది ముదిరాజ్ యువకుల అమ్మలు సాపించి దుమ్ము పోసి ఊరుకున్నరు. ఈ తతంగానంతా దామోదర్ రెడ్డి భార్య ప్రస్తుత ఎంపిటిసి సభ్యురాలు కొమ్మిడి శోభారాణి వీడియో తియ్యడంలో నిమగ్నమైంది. సర్పంచి మాత్రం దరిదాపులో కనిపించలేదు. ఆ తర్వాత సర్పంచి వర్గీయులు ఫాల్స్ ఫిస్టేజీ కోసం కచ్చీర్ కాడ కాకుండా గ్రామ పంచాయతీ ప్రహరీ గోడకు తెచ్చిన జెండా కట్టి త్రుప్తి పడ్డరు.
దొరల కోసం ముదిరాజ్ లు చీలేవాళ్లే
ఇట్ల ఊర్లో దసరా రోజు దొరోల పెత్తనం కోసం ఒకే పండుగా అంటే ఒకే ఇంటి పేరున్న ముదిరాజ్ కులస్తులు నిట్టనిలువున రెండుగ చీలిపొయ్యారు. కచ్చీర్ కాడ దొర తనం జెండా గ్రామ పంచాయతీ కాడ దొరతనాన్ని వ్యతిరేకిస్తున్న మరో దొర ఇంకో జెండా ఎగురేసుకుండ్రు. ఇట్ల మా ఊర్లో రెండు జెండాలు ఎగిరినవి. గతంలో మూడు రంగుల జెండాను దర్జి మేర ఈరమ్మ కుట్టెది. ఆమె చనిపోయిన తర్వాత తిరందాసు ఆంజనేయులు జెండా కుట్టి తెచ్చేటోల్లు. అవుసుల బ్రహ్మయ్య వారి కొడుకులు వేప చెట్టుకు జెండా కర్రకు సున్నం జాజు పూసేటోడు. తలారి నర్సవ్వ జెండా కట్టి గేటు కాడ జెమ్మి చెట్టు నాటేది. సర్పంచి ఎవరుంటే వారే పూలు కొబ్బరి కాయలు ఇస్తే కావలి కార్లు తెచ్చి కచ్చీర్ కాడ పెట్టెటోల్లు. జెండా తంతు అయ్యిన తర్వాత మాదిగోల్లు డప్పులు కొట్టుకుంట గేటు గడ్డకు పెట్టే జెమ్మి చెట్టు కాడికి జమ్మికి పొయ్యెటోల్లు.
దొర బోర్ తుపాకితో పేల్చి..
అప్పట్లో సుదర్శన్ రెడ్డి తన బోర్ గన్ తుపాకితో మూడు సార్లు పేల్చేటోడు. ఆ తర్వాత దొర పక్కకు జరుగేదే ఆలస్యం. సుదగోని అంజయ్యగౌడ్, కావలి గండయ్య ముదిరాజ్, చాకలి పోచయ్యలు కూడా వీల్ల దగ్గర ఉన్న షికారి గన్నులతో పేల్చెటోల్లు. ఆ తర్వాత అట్లనే ఊరేగింపుగా హనుమాండ్ల గుడికాడికి పోయి ఆడ కూడా అప్పట్లో మూడు రంగుల జెండా ఎగురేసేటోల్లు. ఇరవై ఏండ్ల సంది కాషాయ జెండా ఎగురవేస్తుండ్రు. అక్కడే ఒక్కరి కొక్కరు అలాయి బలాయి తీసుకుంటరు.
ఎస్సై జోక్యంతో కాషాయం జెండా
ఇరవై ఏండ్ల కింద బిజేపి బలపర్చిన వ్యక్తి సర్పంచిగా ఎన్నికైంది. అప్పుడు మూడు రంగుల జెండా పంచాయతీ తెరపైకి వచ్చింది. కాషాయ జెండా కావాలని బిజెపి వాల్లు గొడవ పడ్డారు. ఆ యాడాది రెండు చోట్ల జెండాలు ఎగురేసుకొని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. అప్పుడు కూడా ఆ కొట్లాటలో ముదిరాజ్ లే ముందున్నరు. అప్పటి ఎస్సై శివరాత్రి దామోదర్ ఇరు వర్గాలని కూర్చోబెట్టి కాషాయ జెండాని ఖాయం చేసిండు. అప్పడు ఇదే దామోదర్ రెడ్డి మూడు రంగుల జెండా కట్టాలని మంకు పట్టు పట్టిండు. ఇప్పుడు వంటికి కాషాయ రంగు ఏసుకొని కాషాయ జెండాని ఎగురవేయడం కొసమెరుపు.
కరోనా లాక్ డౌన్ తో దొరలు జెండాకు దూరం
కరోనా చేత పొయినేడు లాక్ డౌన్ ఉండే. ఇక మొన్న మాత్రం సర్పంచి కాని పెద్ద దొర కొమ్మిడి సత్యనారాయణ రెడ్డి, కచ్చీర్ దరిదాపులకు కూడా రాలేదు. కాని పువ్వులు కొబ్బరి కాయలు కాషాయం జెండాలను పంపిండు. దామెాదర్ రెడ్డి ఎప్పటి లాగనే జెండా ఎగురేసి పెత్తనం నిలబెట్టుకున్ననని సంబరపడి ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టుకుండు.
ఇక్కడ మల్ల ట్విస్ట్ ఏందంటే..
పొయిన సారి గొడవ పడ్డ ముదిరాజ్ యువకులు సత్యనారాయణ రెడ్డితో ప్లాట్ల బ్యారంలో తేడాలొచ్చి దామోదర్ రెడ్డి దిక్కు వచ్చిండ్రు. అప్పటి దాక దామోదర్ రెడ్డి దిక్కు ఉన్నోల్లు కొంత మంది సత్యనారాయణ రెడ్డి దిక్కు పొయ్యిండ్రు. అటోల్లు ఇటు ఇటోలు అటు పోవుడేంది అంటే..? నువ్వనుకున్నట్లు పండుగలో సాయన్న వారసులైన ముదిరాజ్ యువత మత్తు బానిసలుగా ఇంకెంత కాలం ఉంటారో మరి..?
పిట్టల శ్రీశైలం
మూసి టివి, మూసి ఫైబర్ టబ్స్
995 999 6597