Header Top logo

45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు: కేంద్ర స‌ర్కారుపై మండిప‌డ్డ‌ కేటీఆర్

  • 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం అంటూ కేటీఆర్ విమ‌ర్శ‌
  • దేశంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయ‌ని ట్వీట్
  • ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ ధరలు ఉన్నాయ‌ని వ్యాఖ్య‌
దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ఆర్థిక, సామాజిక ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. దేశంలో 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు చేరుకుందని, అలాగే, 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం పెరిగిందని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆయ‌న అన్నారు. 
ప్ర‌స్తుతం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ ధరలు ఉన్నాయని ఆయ‌న అన్నారు. అంతేగాక‌, వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు చెబుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల‌కు కార‌ణ‌మైన కేంద్ర‌ ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని ఆయ‌న నిల‌దీశారు.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎన్డీఏ స‌ర్కారు అని పిల‌వాలా? లేక‌ ఎన్‌పీఏ (నిరర్థ‌క సంప‌ద‌) ప్రభుత్వం అని పిల‌వాలా? అని కేటీఆర్ నిల‌దీశారు. ఎన్‌పీఏ అంటే (నాన్ ప‌ర్ఫార్మింగ్ అసెట్‌-నిర‌ర్థ‌క ఆస్తి) అని భ‌క్తుల‌కు (బీజేపీ అభిమానుల‌కు) వివ‌రించి చెబుతున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఓ ఇంగ్లిష్ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ పోస్ట్ చేశారు.

దేశంలో నెల‌కొన్న నిరుద్యోగ ప‌రిస్థితులు, పెరిగిపోతోన్న నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం, త‌గ్గుతోన్న ఆదాయం, కొనుగోలు శ‌క్తి వంటి అంశాల‌ను అందులో పేర్కొన్నారు. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు చేప‌ట్టిన ఓ స‌ర్వేలో ఆయా విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని ఆ క‌థ‌నంలో చెప్పారు. ఆయా అంశాల‌నే మంత్రి కేటీఆర్ ప్ర‌స్తావించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking