Header Top logo

Is Vedic Dharma used? వైదిక ధర్మం వాడుకోబడుతుందా?

Is Vedic Dharma used?
Will be followed?

వైదిక ధర్మం వాడుకోబడుతుందా?
అనుసరించబడుతుందా?

కాషాయం ముసుగులో మత విధ్వేషాలను రెచ్చగొడుతూ కుల-మతాల ఆధారంగా ప్రజల మధ్య చీలికలు తీసుకోస్తూ నేడు కొందరు ఫాసిస్టు నాయకులచే నడుపుతున్న వేర్పాటువాద రాజకీయాలను చూసి బహుశా ఇదే నిజమైన హిందూత్వం, బహుశా హిందుత్వాన్ని ఇలాగే రక్షించాలేమోనని అపార్థానికి గురయ్యే సామాన్య హైందవ సోదరులందరూ ఈ వ్యాసం పూర్తిగా చదవాలి.

హిందూ ధర్మం’ వాస్తవానికి…

“సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి” అన్న నినాదాలు చాలా సార్లు వినపడేవే. ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్, వీ.హెచ్.పీ, భజరంగ్ దళ్, బీజేపీ వగైరా హిందుత్వవాద రాజకీయ సంస్థల కార్యకర్తలైతే ఈ నినాదాన్ని అనేక సందర్భాల్లో విరివిగా వాడుతూ ఉంటారు. మంచిదే. కానీ, ఏ సనాతన హిందూ ధర్మం రక్షించబడాలనైతే నేడు కొందరి ద్వారా ఈ నినాదాలు చెయ్యబడుతున్నాయో ఆ ‘సనాతన వైదిక/హిందూ ధర్మం’ వాస్తవానికి…

1). ప్రజల పట్ల “సమదృష్టి” కలిగి ఉండాలని ఆదేశిస్తుంది. ఉచ్చనీచ భావాలు ప్రదర్శించకూడదని చెబుతుంది.

2). జన్మతః మానవులందరూ సమానమని చెబుతుంది. ఒకరు తక్కువా ఒకరు ఎక్కువా కాదని చెబుతుంది.

3). ఏ ఒక్కరిపట్లా ధ్వేషం కలిగి ఉండకూడదని అందరినీ సమానంగా గౌరవించాలని కూడా చెబుతుంది.

సనాతన వైదిక ధర్మం ఇస్తున్న ఈ గొప్ప దృక్పథాలు నేడు మత విధ్వేష రాజకీయాలు నడుపుతున్న కొందరు వేర్పాటువాదుల దృక్పథానికి అనుకూలమా? వ్యతిరేకమా? అన్నదే నేడు సామాన్య హైందవ సోదరులు అతి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం.

Is Vedic Dharma used? వైదిక ధర్మం వాడుకోబడుతుందా?

హిందూ, ముస్లిములు సోదరుల్లా..

ఈ సందర్భంలో కాస్త గత చరిత్రలోకి వెళితే.. హిందూ, ముస్లిములు సోదరుల్లా ఐక్యంగా కలిసి ఉన్నంత వరకు, వారు కలిసి తమపై పోరాడుతున్నంత వరకు భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోలేమన్న విషయాన్ని 1857 లోనే కనిపెట్టిన బ్రిటిషర్లు ఐక్యంగా ఉన్న ఈ రెండు వర్గాల మధ్య చీలికలు తేవటానికి “విభజించి-పాలించటం” అన్న కుట్రపూరిత వ్యూహాన్ని పన్నటం మొదలెట్టారు.

హిందూ-ముస్లిముల ఐక్యతను

వారి వేర్పాటువాద వ్యూహానికి కొనసాగింపుగా హిందూ-ముస్లిముల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ పరమత ధ్వేషమే ఆధారం చేసుకుని ముస్లిములను, ఇతర మైనారిటీలను అణగద్రొక్కాలన్న లక్ష్యంగా ఏర్పడిందే అభినవ “హిందుత్వ”వాదం. నేడు ఫాసిస్టు రాజకీయాలు నడిపే నాయకులకు ఇదే ముడిసరుకుగా మారిపోయింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

ఇంకాస్త వివరాల్లోకి వెళితే దేశంలో అన్ని మతవర్గాల ప్రజల ఐక్యత పిలుపునిస్తూ ఒకప్రక్క మహాత్మాగాంధీ స్వతంత్ర ఉధ్యమం చేస్తున్న నేపథ్యంలోనే మరోప్రక్క ఆ పిలుపును తిరస్కరిస్తూ సావర్కర్ హిందుత్వ ఐడియాలజీ ద్వారా కే.బీ.హెగ్డేవర్ స్థాపించిందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్). 1915 లో మోహన్ మాలవియా, సావర్కర్ ల ద్వారా హిందూ మహాసభ స్థాపించబడి “హిందుత్వ వాదం” వెలుగులోకి తేబడింది.

“అహింసా పరమో ధర్మః”

అప్పటి నుండి “అహింసా పరమో ధర్మః” అన్న గొప్ప హైందవ దృక్పథానికీ.. “సర్వేజనాసుఖినోభవంతు” అన్న హైందవ శాస్త్రాల అభిలాషకూ.. ప్రజలంతా వసుదైక కుటుంబంలా ఐక్యతతో అలరారాలన్న వేదవాంగ్మేయానికి సంబంధం లేకుండా కేవలం ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్ట్ వర్గాల పట్ల ధ్వేషాన్ని రగిలించటమే పునాదిగా అప్పటివరకూ లేని ఓ క్రొత్త “హిందుత్వవాద” భావజాలానికి సావర్కర్, హెగ్డేవర్లు రూపకల్పన చెయ్యటం జరిగింది.

ఇస్లామిక్ కంట్రీగా

ఈ హిందుత్వవాద భావజాలాన్ని అనుసరించేవారికి మధ్యయుగాల్లో ముస్లిం పాలకులు దౌర్జన్యం చేసి దేవాలయాలు పడగొట్టేశారని, వారంతా నాలుగేసి పెళ్లిళ్లు చేసేసుకుని తమ వర్గాన్ని పెంచుకుని ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేయ్యటానికి కుట్రలు పన్నుతుంటారని, వారంతా ఉగ్రవాద భావజాలం కలిగి ఉన్న హిందుత్వ వ్యతిరేకులని వారి మెదళ్లను ట్యూన్ చేస్తూ ముస్లిం సమాజాన్ని ఓ కల్పిత శత్రువుగా మార్చేసారు.

‘హిందుత్వవాద’ నినాదం

ముస్లిముల నుండి “హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ వారి పట్ల అనవసర భయాల్ని సృష్టిస్తూ “హిందువులు సురక్షితంగా ఉండాలంటే ఇతర మతాల నుండి దేశాన్ని విముక్తి కలిగించి హిందుస్తాన్ లో ఉంటే ఒక్క హిందువులే ఉండాలి” అన్న గమ్మత్తైన దృక్పథంతో వెలుగులోకి తేబడిన ఈ ‘హిందుత్వవాద’ నినాదం దేశంలో ఉన్న మైనారిటీల పట్ల ధ్వేషాన్ని రగిలించటం, అణగద్రొక్కటమే పరమావధిగా రూపుదిద్దబడింది. అదే ఆనాటి నుండి ఈనాటి వరకూ “దేశభక్తి” అన్న షుగర్ కోటింగ్ తో చలామణీలో ఉంది.

అణగద్రొక్కే చట్టాలు చెయ్యటం

ఈ చిత్రమైన “దేశభక్తి” కలిగి ఉండేవారికి ముస్లిములపై దౌర్జన్యం చెయ్యటంలో, వారిని హింసించటంలో తప్పే లేదని అది కూడా దేశభక్తిలో భాగమేనని బ్రెయిన్ వాష్ చెయ్యబడుతూ ఉంటుంది. ముస్లిములను, ఇతర మైనారిటీలను హింసించటం, వారిని అణగద్రొక్కే చట్టాలు చెయ్యటం ద్వారానే హిందుత్వం రక్షించబడుతుందన్న విషపూరిత భావజాలం ఎక్కించబడుతూ ఉంటుంది.

కర్నాటకలో హిజాబ్

ఈ దేశభక్తి హరిద్వార్ ధర్మసంసద్ లాంటి వేదికలపై ముస్లిములపై జెనోసైడ్లు చెయ్యాలని పిలుపునివ్వటం నుండి ట్రిపుల్ తలాక్, లవ్ జిహాద్ చట్టాలు, బుల్లిబాయ్ సుల్లిడీల్స్ లాంటి జుగుప్సాకరమైన యాప్పులు, కర్నాటకలో హిజాబ్ బహిష్కరించాలని నిరసనలు, అల్లర్లు చెయ్యటం వరకూ దేశం మొత్తం నేడు ప్రదర్శించబడుతూనే ఉంది.

వైదిక ధర్మం వాడుకోబడుతుందా?

ఆ వైదిక ధర్మం అనుసరించబడటమే

అయితే ప్రస్తుతం మత ఉన్మాదం కాషాయ రంగు పూసుకుని ఉరకలు వేస్తున్న ఈ నేపథ్యంలో వైదిక ధర్మం రక్షించబడాలని కేవలం నినాదాలు చెయ్యటం కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వైదిక ధర్మం అనుసరించబడటమే అత్యంత ఆవశ్యకం అని చెప్పటంలో సందేహం లేదు.

వైదిక ధర్మం అనుసరించబడాల్సిన అవసరం ఏమిటి?

తమ స్వధర్మాన్ని ప్రేమించే వారు తమ స్వంత ధార్మిక గ్రంథ ఆదేశాలను గౌరవించాలి, ఆచరించగలగాలి. లేదంటే మేము మా ధర్మాన్ని ప్రేమిస్తున్నాము, రక్షిస్తున్నాము అని పైకి ఎంత కాషాయ దుస్తుల్లో ఉంటూ నినాదాలు చేస్తున్నప్పటికీ వారు నామ మాత్ర హిందు ధర్మ పరిరక్షకులుగానే పరిగణించబడతారు.

ఆ సనాతన వైదిక ధర్మం

కాబట్టి మేము సనాతన హైందవ ధర్మ రక్షకులను చెప్పుకునేవారు ముందుగా ఆ సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే- ఆ సనాతన వైదిక ధర్మం – హిందువులైనా, ముస్లిములైనా, క్రైస్తవులైనా ఏ మతస్తులైనా “మనుషులందరూ మను (ఆది మానవుని) సంతానం” – ఋగ్వేదం 1:45:1 అని చెబుతూ తోటి మనుషుల పట్ల ధ్వేషాన్ని కలిగి ఉండటం అనాగరికం అని చెబుతుంది.

“కొందరు పెద్దలు లేరు, కొందరు చిన్నలు లేరు. వీరందరూ పరస్పరం సోదరులే” – ఋగ్వేదం 5:60:5 అంటూ వ్యక్తుల్లో ఉచ్చనీచ భావాలను తొలగించివేస్తుంది.

మీ మధ్య ధ్వేషం ఉండకూడదు

“సహోదరులైన మీ మధ్య ధ్వేషం ఉండకూడదు. మీ మధ్య చర్చలు నిర్మాణాత్మకంగా మీ ఆలోచనలు సామరస్యపూర్వకంగా ఉండాలి” (అథర్వణవేదం 3:30:3) “మానవులరా సామరస్యపూర్వక భావాలు కలిగి ఉండండి, సహనాన్ని, ధ్వేషరహిత భావాలు కలిగి ఉండండి. ఒకరిపట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండండి” – 3:30:1 అంటూ వ్యక్తుల పట్ల ధ్వేషాన్ని కలిగి ఉండవద్దని హెచ్చరిస్తుంది.

మానవాళి ఐక్యతను అభిలషిస్తుంది.

“మన అందరి ఆశలు ఒక్కటిగా ఉండాలి, మన అందరి హృదయాలు ఒక్కటిగా ఉండాలి, మన అందరి ఆలోచనలు ఒక్క త్రాటిపై నడవాలి. మనమందరం ఒక్కటి అయి మంచి స్నేహితులం కావాలి” – ఋగ్వేదం 10:191:4 అంటూ మానవాళి ఐక్యతను అభిలషిస్తుంది.

ఏ ఒక్కరినీ చిన్న చూపు

“విద్య, వినయము గలిగియున్న బ్రాహ్మణుని యందు, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసం తినే చెండాలుని యందును సమదృష్టి గలవారే జ్ఞానులు” – గీతా 5:18 అంటూ ఏ ఒక్కరినీ చిన్న చూపు చూడకూడదని అందర్నీ తోటి మనుషులను మనుషులుగా గౌరవించాలన్న విషయాన్ని నేర్పుతుంది.

నిజానికి ఈ బోధలన్నిటినీ గమనిస్తే ఆనాటి నుండి నేటి వరకు మత విధ్వేష రాజకీలు నడుపుతున్న వేర్పాటువాద రాజకీయ నాయకుల, వారి అనుచర సంఘాల వ్యక్తుల ప్రవర్తనను, పనులను పూర్తిగా ఖండిస్తున్నాయన్న విషయాన్నిఎవరైనా ఇట్టే గమనించవచ్చు.

ఇక హిందూ శాస్త్రాల్లో కనపడే చాతుర్వర్ణ విభజన సైతం వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా చేసిందే తప్ప పుట్టుకను బట్టి చేసింది కాదన్నది పరిశీలనగా చదివితే అర్థం అవుతుంది.

మత ఉన్మాదంతో చీలికలను

ఇక ప్రజల భావోద్రేకాల్ని రెచ్చగొడుటూ మతాన్ని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ఐక్యంగా ఉంచాల్సిన ప్రజల మధ్య తమ మత ఉన్మాదంతో వారి మధ్య చీలికలను తెచ్చే వారు హిందూ వర్గానికి చెందిన వారైనా, క్రైస్తవ, ఇస్లాం వర్గాలకు చెందిన వారైనా రాక్షసులు గానే పరిగణించబడతారు.

 మతోన్మాద రాజకీయాలు నడుపుతూ

అలాంటి వ్యక్తులు ఓ ప్రక్క “మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి, వైదిక ధర్మం రక్షించబడాలి” అని పైకి చెబుతూనే మరోప్రక్క పరమత ధ్వేషాన్ని రగిలిస్తూ, మతోన్మాద రాజకీయాలు నడుపుతూ ఉంటే వారి ద్వారా వైదిక ధర్మం వాడుకోబడుతుందని అనుకోవాలా? అనుసరించబడుతుందని అనుకోవాలా?
అన్నది హిందూ సమాజంలో ఉత్తములు, విజ్ఞులే ఆలోచించాలి.

– కోటేశ్వరరావు
(సామాజిక వేత్త)

Leave A Reply

Your email address will not be published.

Breaking