Header Top logo

పటాన్ చెరువులో ఐజెయు మహాసభలు

 ఐజెయు జాతీయ జర్నలిస్టుల మహాసభలు జయప్రదం చేయాలి
– ఐజేయు ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ పిలుపు

జాతీయ స్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈనెల 8, 9,10 తేదీలలో పటాన్ చెరువులోని జిఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) అధ్యక్షులు వినోద్ కోహ్లీ జర్నలిస్టులను కోరారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్లతో కలిసి ఆయన మాట్లాడారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల కనీస వేతనాల కోసం గలమెత్తింది తామేనని కోహ్లీ అన్నారు.

దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై స్పందించి పోరాడింది తమ సంఘమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఐజేయు సభలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మూడు రోజులపాటు జరిగే పదవ ప్లీనరీ సమావేశంలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు.

జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణానికే ఐజెయు
విద్వేష రాజకీయాల పై జర్నలిస్టులుగా పోరాడుతాం
జర్నలిస్టులకు సమగ్ర చట్టం కోసం కేంద్రాన్ని నిలదీస్తాం
– మీడియా అకాడమీ చైర్మన్, టియుడబ్లుజె అధ్యక్షుడు… అల్లం నారాయణ

భారతదేశంలో ఒక సంకుచిత వాతావరణం, ఒక ఉద్విగ్న వాతావరణం, ఒక విద్వేషపూరిత వాతావరణం, ఒక విభజన వాతావరణం వున్న తరుణంలో.. తెలంగాణ అస్థిత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎట్లా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి మేం ఐజేయూతో కలుస్తున్నాం…అని అల్లం నారాయణ అన్నారు. దాదాపుగా 17 రాష్ట్రాల్లో ప్రతినిధులను కలిగి ఉన్న ఒక పెద్ద సంస్థతో కలిసి పనిచేయడానికి టీయూడబ్ల్యూజే నిర్ణయం తీసుకున్నదన్నారు.
కేంద్రం జర్నలిస్టులకు ఉన్న చట్టాన్ని రద్దు చేసింది గానీ మరో చట్టాన్ని తీసుకు రాలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ….‘‘ దేశంలో మీడియా విస్తృతి పెరిగింది. సాంప్రదాయ మీడియా అయిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు మరియు డిజిటల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో ఒక సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఏర్పడినందున కేంద్రం దగ్గర కొట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐజేయూతో మేం కలిసి పనిచేయాలనుకున్నం. జాతీయ స్థాయిలో ఇంతకుముందున్న ఐజేయూ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దాని గురించి ఎక్కువ మాట్లాడం లేం. సీఎం కేసీఆర్ వచ్చాక అద్భుతంగా తీర్చిదిద్దిన మన వజ్రాల నగరం, మన హైటెక్ నగరం ఐజేయూ 10వ ప్లీనరీకి సగర్వంగా ఆతిథ్యం ఇస్తున్నది. దాదాపు 20 వేల మందికి అక్రిడియేషన్లు, దానిలో 33% మహిళా రిజర్వేషన్లు, హెల్త్ కార్డు, 19 వేల మందికి ఇన్సూరెన్స్, డెస్క్ జర్నలిస్టులకు ప్రధానంగా టీయూడబ్ల్యూజే చొరవ ఫలితమే. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజే. రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ ఫండ్ సాధించడంలో గానీ, మీడియా అకాడమీ ఏర్పాటు, దాని తర్వాత కరోనా బారిన పడ్డవారి కోసం దాదాపు రూ.7 కోట్లను ఖర్చు చేయడం వెనుక టీయూడబ్ల్యూజే కృషి ఉన్నది..’’ అని అన్నారు.

తప్పుడు ఆరోపణలు సరికాదు
పీఠాధిపతుల పీఠాలు కదులుతుంటే వోర్వలేకపోతున్నరు

టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్

ఐజెయు ప్లీనరీ సమావేశాలపై కొందరు పాత్రికేయులు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. రాష్ట్రంలో తమ టియుడబ్లుజె సంఘం ఆవిర్భవించిన నాటినుంచి తెలంగాణ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పైనే పూర్తిస్థాయి దృష్టి సారించామని చెప్పారు.

కరోనా వంటి కష్టకాలంలో కూడా పాత్రికేయ కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేశామని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమాన్ని పట్టించుకోని, ఆ తరువాత పాత్రికేయుల సంక్షేమం పట్టని కొందరు సీనియర్ జర్నలిస్టుల ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మారుతి సాగర్ దుయ్యబట్టారు.వారికి జర్నలిస్టు సంఘాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం మాత్రమే తెలుసునని ఘాటుగా విమర్శించారు.

గడిచిన 40 ఏళ్లుగా జర్నలిస్ట్ లకు యూనియన్ అంటే ఏంటో తెలియకుండా,యూనియన్ సభ్యత్వ రుసుము రసీదు ఇవ్వడానికి కూడా తిప్పుతూ,లోపల లోపల యూనియన్ పేరు చెప్పుకొని కోట్లు కొల్లగొట్టిన వారికి ఇలాంటి నీతులు చెప్పే అర్హత లేదని మారుతీ సాగర్ స్పష్టం చేశారు.

కనీసం జర్నలిస్ట్ ని కలవడానికి కి అవకాశం ఇవ్వకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చేసిన పెత్తనం తెలంగాణ జర్నలిస్టులు ఎన్నటికీ మర్చిపోరని దుయ్యబట్టారు. పీఠాధిపతుల పీఠాలు కదులుతున్న వేళ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. నిఖార్సుగా తెలంగాణ కోసం తెగించి కొట్లాడి 14 ఏళ్ళు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అన్న నినాదంతో ఏ స్వార్థ ప్రయోజనాలు లేకుండా స్వరాష్ట్రం కోసం పోరాడిన చరిత్ర తమ యూనియన్ ది అన్నారు.

తెలంగాణ చైతన్యంతో ఆవిర్భవించిన టియుడబ్ల్యుజె పై ఈరోజు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విషం విషం కక్కిన వారు పేరుకు జర్నలిస్ట్ నాయకులుగా చలామణి అవుతున్నవారేనని ఎద్దేవా చేశారు. ఇటు జర్నలిస్టులను అటు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు ఘటించిన ఈ నేతలు నీతలు చెప్పడం దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉందని మారుతి సాగర్ స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ పేరిట ప్రభుత్వం స్థలాల్లో బిల్డింగులు కట్టించుకొని కనీసం జర్నలిస్టులను కూడా అడుగుపెట్టనీయకుండా ప్రెస్క్లబ్లను కబంధహస్తాల్లో పెట్టుకొని లక్షల రూపాయలు నెలకు తమ ఎకౌంట్లో వేసుకుంటూ ఇవాళ మీరు నీతులు చెబుతున్నారా..? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరంలో ప్రెస్ క్లబ్ పేరు మీద స్థలాన్ని కొట్టేసిన ఈ మహనీయులు ఇక హైదరాబాద్ బషీర్బాగ్ లో యూనియన్ కార్యాలయాన్ని పెట్టుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నారని తెలిపారు. ప్రెస్ క్లబ్ పేరుతో దాని రిపేర్ల పేరిట ప్రభుత్వం దగ్గర ఇప్పటికే రెండున్నర కోట్లు అప్పనంగా కొట్టేసిన ఈ గజదొంగలు మరో 50 లక్షలకు టెండర్ వేశారని, తినేది మన సొమ్ము పాడేది మంది పాట’ అనే చందంగా మాట్లాడుతున్న వీరి తీరు చూస్తుంటే గురువింద నీతి గుర్తుకొస్తుందని మారుతి సాగర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టియుడబ్లుజె నేతలు, రాజమౌలిచారి, అవ్వారి భాస్కర్, యోగానందం, యార నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తే
మీ పునాదులు కదులుతుంటే …..

టీయూడబ్ల్యూజే జాతీయ వ్యవహారాల ప్రతినిధి

ట్రేడ్ యూనియన్ భావజాలం నచ్చదు. వృత్తిపరమైన జర్నలిస్టుల పక్షాన పోరాటం చేయాల్సిన సందర్భాల్లో కలం కార్మికుల కష్టాలు పట్టవు. సంక్షేమం ఊసులు నచ్చవు. ఎదుటివాళ్ల పై బురుద జల్లి తమనైజాన్ని చాటుకోవడం ఆ నాయకుల శైలి.

ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఇవాళ్టి స్థితికి కారకులే “దొంగే దొంగ దొంగ” అన్న చందాన ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ లను వేలెత్తి చూపుతున్నారు.
జర్నలిస్టు ఉద్యమ సీనియర్లలోఒకరిగా ఉన్న సురేశ్ అఖౌరీ లాంటి నాయకుల ముక్కుసూటి మనస్తత్వాన్ని సహించని ముఠా ఇప్పుడు భారత జర్నలిస్టు ట్రేడ్ యూనియన్ పునరుజ్జీవాన్ని సహించక నెత్తి నోరు మొత్తుకుంటున్నది.

సాధారణ సభ్యులకు సైతం స్పష్టం గా అర్థమవుతున్న ఈ నిజాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని ఆ నాయకుల ముఠా ఇప్పుడు తెలంగాణా లో జర్నలిస్టుల యూనియన్ల సమారోహాన్ని చూసి జడుసుకొని అవాకులూ చవాకులూ పేలుతున్నది. వాళ్ల కిక కాలం చెల్లింది.

ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఇప్పుడు ప్రొఫెషనల్ ల చేతిలో అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తున్నది. దిగజారుడు వైఖరి మనల్ని మనం దిగజార్చుకోవడం అవుతుంది. నిజాలు నిలకడగా తెలుస్తాయి. సమావేశాల్లో జరిగే చర్చలు నిర్మాణాత్మకంగా ఉండాలనుకునే ప్రజాస్వామిక దృక్కోణాన్ని సమర్థిద్దాం.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking