Header Top logo

నీ ఆలోచన మారితే నీ ప్రపంచం మారుతుంది

ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో ? అతడికి ముందున్న ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది. మంచిని చూసే వాడికి మంచిగానే కనిపిస్తుంది. చెడు దృష్టితో చూసే వాడికి చెడే కనిపిస్తుంది. తాను ఎదిగే సమయంలో కష్టపడి వృద్ధిలోకి వస్తున్నాను అనుకునే వ్యక్తి, అదే ఎదుటి వారు డెవలప్ అయితే, ఈర్షతో కుళ్లుకునే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పక్కవాడు బాగుపడుతుంటే అభినందించాల్సింది పోయి, తూలనాడే ట్రెండ్ ఒకటి మొదలయ్యింది. పక్కవాడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. మనం మాత్రం లగ్జరీ లైఫ్ కొనసాగించాలనే ఆలోచన నిజానికి చాలా బాధాకరం.

ఒక వ్యక్తి ఓ ఇల్లు కట్టుకున్నా, ఓ కారు కొనుక్కున్నా సహించలేని స్థితిలో పక్కవారు ఉండటం చూస్తుంటే, ఓవైపు ఆవేదన, మరోవైపు బాధ కలుగుతుంది. కనిపించే ఇల్లు, కారు వెనుక దాన్ని పొదేందుకు పడిన కష్టాన్ని ఎందుకు చూడరు? ఓ వ్యక్తి పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాడంటే, దాని కోసం అతడు పడే శ్రమ ఎంతో ఉంటుంది. ఎంతో మానసిక, శారీరక ఇబ్బందులూ ఉంటాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగితేనే వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికీ డబ్బులు ఊరికే రావు.

మనుషుల నైజం ఎలా ఉంటుందంటే?

సాధారణంగా జనాల నైజం ఎలా తయారైందంటే.. ఎదుటి వాడు బాగుపడ్డా ఓర్వలేరు. నాశనం అయినా రాళ్లేయడం మానుకోరు. అందుకే, లోకులు అనే కాకుల గురించి పట్టించుకోకపోవడమే మంచిది. మన జీవితాన్ని మన కోసమే బతుకుదాం. ఎదుటివారు ఎమనుకుంటారో అనే ఆలోచన వద్దే వద్దు. ఆదిశగా ఆలోచిస్తే, ఇక మనకోసం బతకడం అనేది మర్చిపోవాల్సి ఉంటుంది. మన జీవితంలో కూడా ఎదుటివారిలా జీవించడం మొదలవుతుంది.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది

ఎప్పుడైనా మాట్లాడిన ప్రతి మాటను జాగ్రత్తగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అనే విషయం చక్కగా తెలుసుకొని మాట్లాడితే అంతా మంచే జరుగుతుంది. మన దగ్గర పక్కవాడి గురించి చెడుగా చెప్పేవాడు .. ఎదుటి వాడి దగ్గర మన గురించి కూడా తప్పుగానే మాట్లాడుతాడని గుర్తుంచుకోవాలి.

ముక్కుసూటిగా మాట్లాడటం చెడ్డ లక్షణం కాదుగానీ, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారితో పాటు కూడా ఉన్నవారికీ ఇబ్బందే. అందుకే ’నొప్పింపక తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! అంటాడు. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే? ముక్కు సూటిగా ఉండటమంటే కరుకుగా, కఠినంగా మాట్లాడటమా? కానే కాదు. ముక్కు సూటిగా అంటే, మనసులో అనుకున్న విషయాన్ని, వక్రీకరించేకుండా క్లారిటీ గా చెప్పటం. ఇతరుల పట్ల కపటం లేకుండా ఉండటం. ఇలా ఉంటూ మృదువుగా మాట్లాడచ్చు. అప్పుడు మీరు అందరికీ నచ్చుతారు.

పక్కనే ఉంటూ గోతులు తీసేవారితో జాగ్రత్త

మనసులో కల్మషం పెట్టుకొని, మన ఎదుట తీయగా మాట్లాడి, పరోక్షంలో చెడ్డగా మాట్లాడే వంచకులతోనే జాగ్రత్తగా ఉండాలి. మనతో ఉంటూ, మన వెనుకే గొతులు తీసేవారితో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వీలుంటే అలాంటి వారిని దూరం పెట్టమే మంచిది. మనం ఎదిగితే ఓర్వలేని వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఎదుటి వారి గురించి పక్కవారితో మాట్లాడ్డం మానేయాలి. ఎదటి వారి గురించి మాట్లాడ్డం మానేసి, ఎదురెదురుగా మాట్లాడుకోవడం మంచింది.

ఇకనైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి

ముఖ్యంగా వాడు ఎలా ఎదిగాడు ? వీడు ఎలా ఎదిగాడు? అనే పనికి రాని ముచ్చట్లు ఎంత వీలైతే అంత త్వరగా బంద్ చేయండి. మీరు ఎలా ఎదగాలో ఆలోచించండి. ఎదుటి వారి గురించి ఆలోచించే సమయంలో కొంత మీ గురించి కేటాయించినా అద్భుతాలు సాధిస్తారు. ఇకనైనా ఆదిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ..

శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్,

సోషల్ మీడియా పోస్ట్ నుంచి

Leave A Reply

Your email address will not be published.

Breaking