Header Top logo

మానవత్వమా నీవెక్కడా..?

మరణించిన భార్య శవాన్ని భుజంపై వేసుకుని..

మానవత్వమా నీ అడ్రసు ఎక్కడా..?

నిజమే.. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నాయి. ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు.. పేదోడు మాత్రం నిరు పేదగా మారుతున్నాడు. ప్రపంచంలోనే విశాలమైన మన ప్రజాస్వామ్య భారత దేశంలో పేదోడి బతుకు చిత్రం ఈ స్టోరీ.

రాతి గుండెలాంటోళ్ల హృదయాన్ని కదిలించే ఈ కథనం వెంట వెళుతుంటే మన మదిలో ఏవెవో ఆలోచనలు వస్తుంటాయి. భారత దేశంలో దరిద్రులు ఇంకా ఇలా కూడా ఉన్నారనే భావన మనలో కలుగుతుంది. గంజాయి వనంలో తులసి మొక్కలా అక్కడక్కడా ఇంకా మానవత్వం కనిపిస్తోంది.

ఈడే సాములు.. ఆయనది ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామం. పేదరిక కుటుంబంలో పుట్టిన అతనికి ఈడే గురు యువతితో పెళ్లి చేశారు కుటుంబ పెద్దలు.

ప్రేమకు పేదరికం అడ్డురాదని భావించిన ఆ దంపతులు ప్రేమతో కష్టపడి పని చేస్తూ సుఖంగా జీవిస్తున్నారు. ఆ దంపతుల ప్రేమను చూసి ఈర్య్శ పడిందెమో ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈడే గురు (30) ఆనారోగ్యంతో బాధ పడుతుంటే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద గల అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించాడు భర్త ఈడే సాములు.

ఆమెను బతికించడానికి వైద్యులు ప్రయత్నించారు. కానీ.. ఆమె వైద్యంకు స్పందించక పోవడంతో బతుకడం కష్టమని చెప్పిన వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కార్పొరేట్ వైద్యం అందించే స్తోమతా లేని ఈడే సాయిలు భార్య గురు బతుకాదని చెప్పడంతో బాధను గుండెలో దాచుకుని ఆటోలో ప్రయాణం అయ్యాడు.

ఆనారోగ్యంతో ఉన్న భార్య గురు మార్గ మధ్యలో మరణించడంతో ఆటో డ్రైవర్ విజయనగరం జిల్లా చెల్లూర్ రింగ్ రోడ్ వద్ద గురు మృతదేహంను వదిలి తిరిగి వెళ్లి పోయాడు. వేధ మంత్రాల సాక్షిగా కష్ట సుఖాలలోె కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భార్య గురు అర్దాంతరంగా మరణించడంతో రోదిస్తునే ఆ మృతదేహంను ఒడిస్సా తీసుకెళ్లడానికి సహాయం అడిగారు. అతని సహాయంకు ఎవరు స్పందించలేరు.

నేలపై నిర్జీవంగా పడి ఉన్న భార్య గురు మృత దేహంను తన భుజన వేసుకుని కాలి నడుకన నడుస్తున్నాడు భర్త ఈడే సాములు. ఒడిస్సా బాష తప్ప తెలుగు అంతగా తెలియని సాములు బాధను అర్థం చేసుకునే మానవత్వ మూర్తులు కనిపించలేరు.

రహదారిపై నుంచి శవంను భుజన వేసుకుని ఒకరు నడుస్తూ వెళుతున్నారనే సమాచారంతో రూరల్ సిఐ టివి తిరుపతిరావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ పోలీసు బలగాలతో వచ్చారు. భార్య గురు శవంను భుజన వేసుకుని వెళుతున్న సాములును వాకాబు చేసారు పోలీసు అధికారులు. వాస్తవాాలు తెలుసుకున్న అధికారులు సాములు బంధువులతో సెల్ లో మాట్లాడించి ఒడిస్సా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్  ఏర్పాటు చేశారు. భార్య గురు మృత దేహంతో సాములు తన ఇంటికి తీసుకెళ్లారు.

ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నేళ్ల స్వాతంత్య్ర దేశంలో పేదోళ్ల బతుకులు ఇంత దారుణమా..? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. గంజాయి వనంలో తులసి మొక్కలా పోలీసు అధికారుల మానవత్వంకు సెల్యూట్ చెపుతున్నారు సోషల్ మీడియా ప్రేమికులు.

( జర్నలిస్ట్ మితృడు పంపిన వార్తను రీరైటింగ్ చేసి.. )

– వయ్యామ్మెస్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking