Header Top logo

నేర నియంత్రణలో పోలీసులు పని తీరు అద్భుతం..కానీ

  • వంద లీటర్ల పాలలో ఒక్క విషపు చుక్క పడినా, మొత్తం వృథా కావాల్సిందే!
  • కొంత మంది పోలీసులు చేసే దుర్మార్గపు పనుల మూలంగా మొత్తం వ్యవస్థనే తప్పుబట్టే పరిస్థితి
  • నేర నియంత్రణలో పోలీసులు పని తీరు అద్భుతం. కానీ, ప్రజల్లో పోలీసుల పట్ల ఇప్పటికీ ఒక సదభిప్రాయం కలగగడం లేదు.
  • ఇప్పటికీ ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి
  • విధి నిర్వహణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులెందరో!
  • క్రిమినల్స్ ను పట్టుకోవాల్సిన వారే క్రిమినల్స్ గా మారితే?
  • నయీం డైరీని చూస్తే సరిపోదా ?
  • తీవ్రతను బట్టి తక్షణ చర్యలుండాలి

వంద లీటర్ల పాలలో ఒక్క విషపు చుక్క పడినా, మొత్తం వృథా కావాల్సిందే! అలాగే, కొంత మంది పోలీసులు చేసే దుర్మార్గపు పనుల మూలంగా మొత్తం వ్యవస్థనే తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతోంది. పోలీసులు లేకపోతే సమాజంలో శాంతిభద్రతలు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నేర నియంత్రణలో పోలీసులు పని తీరు అద్భుతం. కానీ, ప్రజల్లో పోలీసుల పట్ల ఇప్పటికీ ఒక సదభిప్రాయం కలగగడం లేదు. దానికి కారణం, పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు వారికి ఎదురయ్యే పరిస్థితులే. ఇంకా చెప్పాలంటే, ఇప్పటికీ కొంత మంది ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందనేది కాదనలేని వాస్తవం. ప్రజల్లో పోలీసుల మీద ఎలాంటి అభిప్రాయం ఉందనేది కాసేపు పక్కన పెడితే .. పోలీసుల వ్యవస్థలోని కొంత మంది క్రిమినల్ మెంటాలిటీ కలిగిన అధికారులు గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన పరిస్థితి నెలకొంది.

క్రిమినల్స్ ను పట్టుకోవాల్సిన వారే క్రిమినల్స్ గా మారితే?

పోలీసులు అంటేనే నేరాలను అదుపు చేయాలి. క్రిమినల్స్ కు దారిలోకి తీసుకురావాలి. నేరస్తుల నుంచి సమాజాన్ని కాపాడుతూ శాంతిభద్రతలను కాపాడాలి. కానీ, విచిత్రం ఏంటంటే? నేర నియంత్రణకు పాల్పడాల్సి పోలీసులే క్రిమినల్స్ గా మారిపోతున్నారు. తాజాగా ములుగు ఎస్సై క్రిమినల్ ఆలోచన బయటకు వచ్చాక, పోలీసులు అధికారుల ముసుగులో కొంత మంది ఎంతటి దారుణ ఘటనలకు ఒడిగడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తోటి పోలీసులనే చంపాలి అనుకునేంత స్థాయికి చేరారంటే వారి క్రూరత్వం గురించి ఏం చెప్పుకోగలం? హెడ్ కానిస్టేబుల్ ను నకిలీ నక్సల్స్ తో చంపించడంతో పాటు సదరు నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేయాలనే ఆలోచన వచ్చిందంటే? సదరు ఎస్సై ఆలోచన ఎంత దిగజారుడు తనాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు వ్యవస్థలో గంజాయి మొక్కలెన్నో!

ఇక లైంగిక వేధింపులు, వివాహేతర సంబంధాలు, భూకబ్జాలకు పాల్పడటమే కాకుండా, ఏకంగా తోటి పోలీసులను చంపేందుకు కుట్రలు చేసే పరిస్థితికి దిగజారుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. కొంత మంది పోలీసులు చేసే అకృత్యాలు ఏకంగా డిపార్ట్‌మెంట్‌కే అపకీర్తి తెస్తున్నాయి. వివాహితలు, యువతులను తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనుభవించడమే కాకుండా .. బ్లాక్‌మెయిల్ చేస్తూ కామాంధులుగా మారిపోతున్న సందర్భాలున్నాయి. మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాస్, మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐ ధరావత్‌ విజయ్‌కుమార్‌ కొమురం భీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఎస్సై సహా పలువురు లైంగిక వేధింపులకు పాల్పడి పతాకశీర్షికల్లోకి ఎక్కారు.

నయీం డైరీని చూస్తే సరిపోదా ?

భూకబ్జాలకు పాల్పడ్డంలోనూ పోలీసుల ఎలా ఆరితేరారో తెలియాలంటే నయీం ఘటనను పరిశీలిస్తే సరిపోతుంది. ఎంతో మంది ఐపీఎస్ అధికారులు సైతం ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది. అంతేకాదు, కానిస్టేబుల్ స్థాయి నుంచి మొదలు పెడితే ఐపీఎస్ స్థాయి వరకు భూముల వ్యవహారంలో అయిన ఘటనలున్నాయి. తమ మాట వినని వారిని కేసుల పేరుతో వేధిస్తున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సై పలు కేసుల విషయంలో బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి, అక్రమార్కులతో చేతులు కలిపి పలుమార్పు మెమొలు అందుకున్నాడు. ఇదే విషయం గురించి తనకు సన్నిహిత సీఐ ప్రస్తావించారు. కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అయితే, ఏముంది సర్.. రూ. 50 వేలు ఇస్తే మెమోలు వాటంతట అవే మారిపోతాయ్ అని సమాధానం చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పోలీసులు ఏ స్థాయిలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ, వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. డబ్బులు వెదజల్లితే తమ మీదకు ఏ కేసు రాకుండా చూసుకోవచ్చనే ఆలోచనలో మునిగిపోయారు. పోలీసు వ్యవస్థ కొంత మంది అధికారులు దుశ్చర్య కారణంగా మొత్తం వ్యవస్థనే నిందించే పరిస్థితి తలెత్తుతోంది.

విధి నిర్వహణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులెందరో!

కానీ, పోలీసుల్లో నూటికి 90 శాతం మంది హానెస్ట్ గానే ఉన్నారు. వారి మూలంగానే సమాజం శాంతి భద్రతలో ముందుకుసాగుతోంది. విధి నిర్వహణ కోసం ప్రాణాలు కోల్పోతున్న పోలీసులు ఎంతో మంది ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిమీ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో ప్రాణత్యాగం చేసిన ఎస్సై సిద్ధయ్యను అందుకు ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. వికారుద్దీన్ లాంటి ఉగ్ర ముఠాను ప్రాణాలకు తెగించి ఎన్ కౌంటర్ చేసిన టీమ్ మెచ్చుకోకుండా ఉండలేం. అదే సమయంలో తాజా ములుగు ఘటనను బయటకు తెచ్చిన ఇంటెలీజెన్స్ వ్యవస్థ పనితీరును ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. రాష్ట్రంలో ఇంటెలీజెన్స్ వ్యవస్థ పనితీరు అద్భుతం. ఉగ్ర కదలికను మొదలుకొని, నేరస్తులపై నిఘా ఉంచడం వరకు చాలా చక్కగా పని చేస్తున్నారు.

ఏ రాజకీయ నాయకుడు మీకు అండగా ఉండడు

కొందరు పోలీసుల తీరు సాన్యులను హడలెత్తించేలా ఉంటుంది. తాజాగా హనుమకొండ జిల్లా గీసుకొండ సీఐ వెంకటేశ్వర్లను సీపీ రంగనాథ్ సస్పెండ్ చేయడంతో అక్కడి ప్రజలు పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారంటే ఆయన తీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, ఏ కేసు అయినా, ఇరు వర్గాల వారు చెప్పే విషయాన్ని వినాలి. చివరకు ఏది న్యాయమో ఆలోచించాలి. నాకు తెలిసినంత వరకు నల్లగొండ జిల్లాకు ఎస్పీలుగా పని చేసి వెళ్లిన రంగనాథ్ IPS , ప్రకాష్ రెడ్డి IPS కేసుకు సంబంధించి ఇద్దరు చెప్పే మాటలను పూర్తిగా వినేవారు. ఆ తర్వాత ఎవరి వైపు న్యాయం ఉందో ఆలోచించే వారు. ( ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను దగ్గరినుండి చూసాను ) అందరూ ఇలాంటి తీరును కనబర్చితే కేసుల్లో బాధతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్పారని, లంచం ఆశ చూపారని బాధితులను నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చాలాసార్లు కొనసాగుతున్నాయి. పోలీసులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. రాజకీయనాయకులు మిమ్మల్ని అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు. మీ గొంత మీదికి కత్తి వచ్చిన సందర్భంలో ఏ నాయకుడు మీకు అండగా నిలబడడు. ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది.

తీవ్రతను బట్టి తక్షణ చర్యలుండాలి

మొత్తంగా కొందరు దారితప్పిన పోలీసుల మూలంగా అందరినీ అనుమానించే పరిస్థితి తలెత్తుతోంది. తప్పు చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ క్రిమినల్ పోలీసులలో మార్పు రాదు. తప్పు చేస్తే కొద్ది రోజులు విధుల నుంచి తప్పించి, మళ్లీ తీసుకోవడం వల్ల మళ్లీ అదే దారిలో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అందుకే, నేర తీవ్రతను బట్టి శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్త భయంతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది.

శేఖర్ కంభంపాటి,

జర్నలిస్ట్, నల్గొండ

(నోట్ : మనని కరిచిన విష సర్పాన్ని వెంటపడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే విషం ఒళ్లంతా పాకుతుంది … విషానికి విరుగుడు తీసుకోవడం ముందు చేయాల్సిన పని..)

 

Leave A Reply

Your email address will not be published.

Breaking