Beyond that (poetry) అంతకు మించి….
*అంతకు మించి….!!
*మనిషంటే…
కళ్ళకు కనిపించే
భౌతిక స్వరూపమేనా?
అలాంటప్పుడు
మనిషికీ..
వస్తువుకూ
తేడా ఏముంది?
వస్తువు
నశిస్తుంది
మనిషీ నశిస్తాడా?
వామన పాదం కింద
కూరుకు పోతాడా?
సృష్టిలో
మనిషి జన్మకు
అర్థమే లేదా?
అలా అయితే..
అనంతమైన
ఆత్మకు ఉనికేది?
ఆత్మ సత్యం
ఆత్మ నిత్యమన్న
గీత కారుడు
అబద్ధాలకోరేనా?
ఎవ్వనిచే జనించు?
ఎవ్వని యందు డిందు
ఏమిటీ జరామరణాలు?
ఏమిటీ పతనాలు..?
మనిషి…
ఊర్ధ్వ అథోలోకాల్ని
పట్టుకు వేలాడే
త్రిశంకువా?
లేక…
రెప్పపాటుకే
చితికిపోయే
గాలి బుడగా?
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
మనిషి ఉనికిని
శాసిస్తాయా?
శ్వాసిస్తాయా?
అయితే..?
మనిషి జన్మకు
కొలమానం ఏమిటి
మనిషి బతుక్కి
పరమార్థమేంటి?
బాల్యం నుంచి
వృద్ధాప్యం వరకు
తీరికలేని
ప్రయాణంలో
మిగుల్చుకున్నదేమిటి?
కోరికల వెంట
పరుగులో
జీవిత కాలం
చాలటం లేదే?
తనకోసం
ఆలోచించే
తీరికా ఓపికా
ఇంకెక్కడా,?
అలిసి సొలసి
ముడతలు పడ్డ
దేహంతో
కీళ్ళు సడలి
కాళ్ళు సహకరించక
కుక్కిమంచంలో
ముడుచుకొని
దేవుణ్ణి తలుచుకుంటూ
నిర్వికార లోకం కోసం
వికారమైన శోకంతో
క్షోభ,దుగ్ధ…
ఏ జన్మ పాపమో?
ఎప్పటి కర్మో?
వేదాంతం
పీటముడితో
చావు బతుకుల
మధ్య లోలకంలా..
అటో…ఇటో..
ఎటో …తెలీని
గమ్యానికి
ఎందుకీ..
పరుగులు..!!
ఎందుకీ..
వెరుపులు..?
ఎప్పుడైనా..
నిలబడి
నిన్ను నీవు
తెలుసుకున్నావా?
నీలోపలి నిన్ను
తట్టి లేపావా?
లేకుంటే
ఇప్పటికైనా….
మించిపోయిందేం లేదు
నిన్ను నువ్వు తెలుసుకో!
నిన్ను నువ్వు కలుసుకో..!!
ఒక్కమాట…!
మనిషంటే…
రక్త మాంసాలు
రిక్త హస్తాలు కాదు
అంతకు మించి “….!!
ఎ.రజాహుస్సేన్, రచయిత
Hyderabad