Bathing event (poetry) స్నాన ఘట్టం (కవిత్వం)
Bathing event (poetry)
స్నాన ఘట్టం (కవిత్వం)
స్నానం చేస్తుంటాను
ప్రతి సారీ తనుస్ఫూర్తిగా!
రోజంతా నాకిష్టమైన సన్మార్గాల్లోనో
ఇష్టం లేకున్నా బతుకులో
అనివార్యమైన చెడు దారుల్లోనో
నడయాడుతూ నన్ను భరిస్తున్న నా కాళ్ళ మీద
ముందుగా ఓ చెంబెడు నీళ్ళు గుమ్మరిస్తాను
అది…
నేను నిత్యం నా రెండు కాళ్ళకు
నీళ్ళతో చెల్లిస్తున్న కృతజ్ఞతా వందనం
తరువాత..
చెంబు పైకీ కిందకీ కదలుతూ
మెడల కింది భాగంలో
పగుళ్ళు వారిన నా ఒంటి పొలానికి
జలాలనందిస్తుంది చాలా దయగా
చెంబు లోని నీళ్ళ పిల్లలది
నా వీపు జారుడు బండ మీద అల్లరే అల్లరి
పెదవులు తడి పదవులందుకునేలా
కళ్ళు తేమ లోగిళ్ళయ్యేలా
మొత్తం నా ముఖమంతా
చెంబు సూర్యుని కిరణాలతో
అమాంతం ఆర్ద్ర పద్మంలా విప్పారేలా
చెంబు మేఘం మాటిమాటికీ
బకెట్టు ఆకాశంలోకి వెళ్ళి
నన్ను స్నానం శిరసావహించేలా చేస్తూ
తల మీద ‘చెంబువృష్టి’ని కురిపిస్తుంది
అబ్బా..పచ్చి వెన్న ముద్దలు నెత్తికి రుద్దుతున్నట్లు
ఆహా…అపుడే తీసిన గందం తలకు అద్దుతున్నట్లు
ఓహ్..స్నాన క్షుద్బాధతో శుష్కించిన
నా సమస్త దేహ శిశువుకు అమ్మ స్తన్యం అందినట్లు
ఎంత హాయి!ఎంత ఆహ్లాదం!!ఎంత చల్లదనం!!!
ఆమస్తక పాదం
ఒక అరుదైన శీతల పరవశం జార్చుకుంటూ
శిఖనఖ పర్యంతం
ఓ అపురూప మృదుజల పరిమళం కార్చుకుంటూ
నేను స్నానం చేయగానే
వెయ్యి ఏనుగుల బలం నా ఒంట్లో చేరినట్లు
ఉన్న పళంగా నాకు ప్రాణం లేచి వస్తుంది
పనిలో పనిగా
ఏదో ఒక పురా మహాకావ్య లహరి లోంచి ఓ నాలుగు మహత్వ పటుత్వ పద్య పాదాలు
తలమీద చల్లుకుని కళ్ళకు అద్దుకుని
నిరంతర తపనతో
నిత్యం సాహిత్య స్నానం కావిస్తూనే వుంటాను
తనుస్ఫూర్తిగానే కాక
మనస్పూర్తి గానూ
అణువణుస్ఫూర్తిగానూ!