Header Top logo

వారాల ఆనంద్ కవిత్వం ‘చిన్నోడి ముక్తకాలు’

వారాల ఆనంద్ – ఒక చిన్న మాట
నా బాల్యపు రోజుల్లో నేనేమో గొంతు పెగలని
గాయంతో మనుషులకు దూరంగా
నివసించడం నేర్చుకున్నాను

రద్దీ రద్దీగా వున్న చౌరస్తాలో
మొలిచిన మొక్కలా
బిక్కు బిక్కు మంటూ
నీడలేని శరీరంతో నిలబడిపోయాను

నావాళ్ళే అందరూ కానీ
అన్ని ముఖాలూ పరాయివే అయ్యాయి

ఆ ఇల్లు
సముద్రమూ ఎడారీ
కలగలిసిన నివాసస్థలిలా వుండేది

నాకేమో
మౌనం ఓ ఆచ్చాదన
మాట అపురూపం

నా బాల్యం అ
మ్మ ఒడికీ
నాన్న నీడకూ
పరిమితం అయింది

కాటగల్సిన పిల్లాడిలా గాలిలో ఆధారంలేని
మాటకీ మౌనానికీ నడుమ
ఊయల ఊగుతూ నా బాల్యం గడిచింది

కోవా పేడాలానో శక్కరి పుట్నాల్లానో
ధ్వనించే ‘కన్నయ్యా’ అన్న
నాన్నమ్మ చల్లని పిలుపు నీడన
కొంత సేదదీరిన…

అట్లా నా బాల్యం గడుస్తూ గడుస్తూ ‘బినాకా గీత మాలా’, ‘పురానీ ఫిల్మోంకా గీత్’ వింటూ వికసించింది.
వయసు పెరుగుతున్నకొద్దీ క్రమంగా అకాడెమిక్ చదువులతో పాటు సాహిత్యం చదువుతూ, మంచి సినిమాలు చూస్తూ వచ్చాను. అట్లా ఎదుగుతూ వచ్చిన క్రమంలో గజల్స్ తో నాకు కొంత అనుబంధం ఏర్పడింది. అప్పుడు ఒకరోజు జగ్జిత్ సింగ్ స్వరంలో విన్న

“ఏ దౌలత్ భి లేలో
ఏ చాహత్ భి లేలో
భలే చీన్ లో
ముజ్సే మేరి జవానీ
మగర్ ముజ్కో లౌటాదో
బచ్పన్ కా సావన్
వో కాగజ్ కే కస్తి
వో బారిష్ కా పానీ..”

అన్నకవి సుదర్శన్ ఫకీర్..గీతం నన్ను చుట్టేసుకుంది.
బాల్యాన్ని తిరిగి ఇమ్మంటూ ఆ కవి పడ్డ వేదన ఊపిరి ఆడనీయలేదు.

ఇంతలోనే మా రేల, వేణుమాధవ్ లు మాకు కానుకగా ‘చిన్నూ’ ని ఇచ్చారు. ప్రద్యుమ్న అని పేరు పెట్టారు.
మనుమడు పుట్టగానే తాత, అమ్మమ్మ, మేన మామ పుట్టారు.
చిన్నూ పుట్టిన తర్వాత మొదటి రెండేళ్ళు మా ఇందిర సంరక్షణ లో, పెంపకంలో వున్నాడు. ఇంకేముంది అప్పుడు నేనూ ఇందిర, అన్వేష్ చిన్నూతో ఆడుతూ పాడుతూ పొందిన ఆనందం ఇంతని చెప్పలేను. ‘మామా ఉప్పా’ అంటూ పైకి ఎగరేయమంటూ మీద పడిపోయే చిన్నూ కదిలకల్ని, అన్ని మూడ్స్ ని తన కెమెరాలో బంధించాడు అన్వేష్.

నాకయితే నేను కోల్పోయిన గొప్ప బాల్యాన్ని చిన్నూ తిరిగి ఇచ్చాడు. చిన్నూ తో ఎగిరాను దుమికాను.. ఈ నాలుగు ముక్తకాలు రాసుకున్నాను.
నిజానికి నేను రాసిన దాని కంటే పొందిందే ఎక్కువ..
నేను పొందిన ఆనందం కంటే చిన్నూఇచ్చిందే ఎక్కువ…

ఈ ముక్తకాలు మా రేల వేణు మాధవ్ లకు చిన్న కానుక.
మా ఇందిరకు ఎంతగా థాంక్స్ చెప్పుకున్నా నాకు నేను చెప్పుకున్నట్టే…

సెలవు


-వారాల ఆనంద్, కవి
4 మార్చ్ 2023

{ వారాల ఆనంద్ కవిత్వం ‘చిన్నోడి ముక్తకాలు ‘ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీఎనివాసాచార్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉస్మానియా విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ విశ్నువందన, రేల,వేణుమాధవ్, ఇందిర, ప్రద్యుమ్న పాల్గొన్నారు]

 

Leave A Reply

Your email address will not be published.

Breaking