Wife model for husband dolls భర్త బొమ్మలకు భార్యే మోడల్.!!
చిత్రకళ
Wife model for husband dolls
భర్త బొమ్మలకు భార్యే మోడల్.!!
భర్త అడుగు జాడల్లో నడిచిన తొలితరం చిత్రకారిణి శ్రీమతి దామెర్ల సత్యవాణి..!!
పరిచయం అక్కర్లేని తొలితరం చిత్రకారుడు “దామెర్ల రామారావు” గారు. ఆయన సతీమణి దామెర్ల సత్యవాణి గారు ( 1907..1992 ) తొలితరం మహిళా చిత్రకారిణి కావడం విశేషం. సత్యవాణి చిత్రలేఖనం నేపథ్యంగా గల కుటుంబంనుంచి వచ్చారు. సత్యవాణికి చిత్రలేఖనం పట్ల గల అభిరుచిని గమనించిన భర్త దామెర్ల రామారావు గారు ఆమెకు చిత్రకళను నేర్పారు. సత్యవాణి గారు తన భర్త వద్ద శ్రద్ధగా చిత్రలేఖనంలో మెళకువలు నేర్చుకుంది. ఆరకంగా సత్యవాణి గారికి చిత్రలేఖనంలో గురువు భర్త రామారావుగారే కావడం విశేషం. అలాగే చిత్రకారులకి మోడల్ లభించడం ఎంతో కష్టమైన ఆరోజుల్లో తనభార్య ‘సత్యవేణినే ‘ మోడల్ గా నిలిపి అనేక కళాఖండాలను చిత్రించారు.
భర్త రామారావు గారి ప్రోత్సాహం
లలితకళలంటే ‘ విలాస ‘ మని, పిల్లలు బొమ్మల జోలికి పోకూడదనే ఆంక్షలున్న ఆ రోజుల్లో కుంచెపట్టి బొమ్మలు వేశారు సత్యవాణి. భర్త రామారావు గారి ప్రోత్సాహం కూడా తోడు కావడంతో చిత్రకారిణిగా ఆమె నిలదొక్కు కొని లోకానికి తన చిత్రకళా ప్రతిభను చాటి చెప్పారు. సామాజిక అణచివేతను ఎదుర్కొని సృజనాత్మకతతో దీటైన సమాధానం చెప్పి, విమర్శకుల నోళ్ళు మూయించారు. అనతి కాలంలోనే ఆమె ప్రసిద్ధ చిత్రకారిణిగా గుర్తింపబడి అనేక బహుమతులు పొందారు.పిన్న వయసులోనే భర్తను, పురిటి కందు బిడ్డను కోల్పోయినా గుండెనిబ్బరంతో, ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని తన జీవితాన్ని చిత్రకళకు అంకితం చేశారు.
డ్రాయింగ్ ఉపాధ్యాయినిగా..
జాతీయ చిత్ర ప్రదర్శనలలో అనేక చిత్రాలను ప్రదర్శించారు. ఆమె గుర్తింపు పొందిన చిత్రకారిణిగా సేవలందిస్తూనే, స్థానిక ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ‘ డ్రాయింగ్ ఉపాధ్యాయినిగా పనిచేశారు. రాజమండ్రి వీరి స్వస్థలం. దామెర్ల రామారావు బ్రతికింది కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఆప్పటికి సత్యవాణి గారి వయస్సు 17 సంవత్సరాలు. Wife model for husband dolls
‘ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ‘ ని స్థాపించారు దామెర్ల రామారావు గారు రాజమండ్రి లో ‘ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ‘ ని స్థాపించారు. తన ధర్మపత్నితో పాటు సోదరి యైన “దిగుమర్తి బుచ్చికృష్ణమ్మ”కు కూడా బొమ్మలు వేయడంలో తర్ఫీదు ఇచ్చారు. ఆ తర్వాత సత్యవాణి లలితకళల జాతీయస్థాయి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. భర్త స్వర్గస్థుడైన విషాదం నుంచి తేరుకోక ముందే.. ఏకైక కుమారుడు కూడా మూడో ఏటే మరణించాడు. తర్వాత సత్యవాణి రాజమహేంద్రవరం ప్రభుత్వ పాఠశాలలో చిత్రకళను బోధించారు. ఆసక్తి కలిగిన పెద్దలు, పిల్లలకు తన ఇంటివద్దే బొమ్మలు గీయడం నేర్పేవారు.
లభ్యమవుతున్న సత్యవాణి గారి చిత్రాలు….!!
సత్యవాణి గారి చిత్రాల్లో చాలా వరకు దొరకడంలేదు. దొరికిన చిత్రాలు వివరాలు ఇలా వున్నాయి…!! ప్రేమగా తన దగ్గరకు చేరిన పిల్లలకు చదువు చెప్పే చిత్రం. ఈ చిత్రాన్ని సత్యవాణి ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన తీరు మెచ్చదగింది. తల్పంపై కూర్చున్న ‘ తరుణి’ చిత్రం తప్పక చూడదగినవి. ఓ స్త్రీ నిరీక్షణ’ చిత్రం తన ప్రియుడికోసం ఎదురుచూపులకు అద్దం పడుతోంది. సత్యవాణి చిత్రాలు ఎక్కువగా తెలుగింటి ఇల్లాళ్ల రోజువారీ పనులు, వాస్తవిక జీవిత దృశ్యాల నేపథ్యంగా ఉంటాయి.
దామెర్ల ఆర్ట్ గ్యాలరీ..!!
రాజమండ్రి లో దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి సంరక్షురాలుగా సత్రవాణి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. భర్త ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్‌లో సభ్యులైన కళాకారుల చిత్రాలను కూడా ‘దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ’లో ఉంచి సంరక్షించారు సత్యవాణి.
బుచ్చికృష్ణమ్మ కూడా..!!
రామారావు గారి సోదరి బుచ్చికృష్ణమ్మ గారు కూడా గొప్ప చిత్రకారిణి. నీటిరంగులతో చిత్రాలుగీయడంలో ప్రావీణ్యం సంపాదించారు. పౌరాణిక, చారిత్రక, ఐతిహాసిక, స్వీయాత్మక చిత్రాలు గీయటంలో ఆమె నిష్ణాతురాలు. నాటి ఆంధ్రప్రాంతంలో జాతీయోద్యమం వెల్లువెత్తిన సందర్భంలో భర్త దిగుమర్తి వెంకట రమణారావుతో కలిసి చురుగ్గా పనిచేశారు. మద్రాసులో దంపతులిద్దరూ కలిసి నెలకొల్పిన.” దళితపాఠశాలను మహాత్మాగాంధీ సందర్శించారు. బాపూజీ కోరిక మేరకు బుచ్చికృష్ణమ్మ రాజమహేంద్రవరంలోని కస్తూర్బా ఆశ్రమంలో ఉపాధ్యాయినిగా చేరారు. తనతుది శ్వాస వరకు దానికే అంకితమయ్యారు. సమకాలీన సమాజంలో గృహిణుల స్థితిగతులు, జాతీయోద్యమ దృశ్యాలు ఆమె కుంచె నుంచి భావాత్మకంగాజాలువారాయి.చరఖా ఉద్యమాన్ని‘నూలుతీయుట’ లాంటి చిత్రాల ద్వారా వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. Wife model for husband dolls
స్త్రీలపైనే దృష్టి..!!
బుచ్చికృష్ణమ్మ, సత్యవాణి ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి చిత్రాలు గీసేవారు. వారి వర్ణచిత్రాలను ‘గృహలక్ష్మి’ లాంటి పత్రికలు ముఖచిత్రాలుగా ప్రచురించేవి. వీరిద్దరి సృజనకు ప్రతీకలైన ‘ఆంధ్రా ఆడపడుచు,రాధ,భిక్ష,, గొల్లపిల్ల, పూజ’ లాంటి చిత్రాలు ప్రాచుర్యం పొందాయి.
*తొలితరం మహిళా చిత్రకారిణులు దామెర్ల సత్యవాణి, బుచ్చికృష్ణమ్మలకు జేజేలు!!
ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్