Header Top logo

ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఏమి జరుగుతుంది..?

బిఆర్ఎస్ నుంచి పొంగులేటి నిష్క్రమణ.. !!

రాజకీయ భవిష్యత్తుకు తాళాలు .    .!!

పునాదులు లేని చోట నిర్మాణానికి పూనుకోవడం అంటే అది అజ్ఞానమే ..?

డబ్బు , హోదా , పెత్తనం కోసమే రాజకీయం తగదని పలువురి హితవు..!!

చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.  ఖమ్మం అంటేనే కమ్యూనిష్టుల కంచుకోటగా పేరుంది. కమ్యూనిష్టులు పాలించిన గడ్డను కాంగ్రెస్ , టిడిపి లు పాలించాయి. ఖమ్మం జిల్లాలో గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో కమ్యూనిష్టులున్నారు. జిల్లాలోని పది నియోజక వర్గాల్లో వారికి గౌరవప్రదమైన ఓటు బ్యాంకు ఉంది.

ఖమ్మం నగర కార్పోరేషన్ తో పాటు ప్రతి మునిసిపాలిటీలో కౌన్సిలర్లు , వార్డు మెంబర్లు , కార్పోరేటర్లను కమ్యూనిష్టు పార్టీలు కలిగి ఉన్నాయి. ఇలాంటి జిల్లాలో మతోన్మాద పార్టీగా పేరున్న బిజేపికి కనీసం బూత్ స్థాయిలో నియమించుకునేందుకు నాయకులు , కార్యకర్తలు లేరు. ఖమ్మం కార్పోరేషన్ లో అర్బన్ ప్రజలున్నప్పటికి అక్కడ క్రిస్టియన్లు , మైనారిటీలు , కమ్యూనిష్టులు బలంగా ఉన్నారు.

చర్చి కాంపౌండ్ లో క్రైస్తవుల క్రాస్ గుర్తును ఆ ప్రాంతానికి సింబాలిక్ గా ఏర్పాటు చేయాలని భావిస్తే ఆ సిలువ గుర్తు ను విరిచి రాష్ట్ర , దేశ స్థాయిలో వివాదానికి తెరలేపడంతో ఖమ్మంలో అన్ని వర్గాలు బిజేపి పై గుర్రుగా ఉన్నాయి. నాటి ఆందోళనల వల్ల అనేక వర్గాలు భయం భయంగా బ్రతికాయి ఎక్కడ శాంతి విఘాతం కలుగుతుందో అని భయపడ్డారు. అనేక రోజులు వ్యాపారాలు స్థంభించాయి.

దాంతో ఇలాంటి మతోన్మాదుల మూక దాడి వల్ల బ్రతుకులు భారమయ్యే అవకాశం ఉందని ప్రజలు బిజేపి ని సామాజిక వినాశనంగా అభివర్ణించడం మొదలు పెట్టారు. ఎంత కాళ్లు , చేతులు ఊపిన కాని అక్కడ బిజేపి వైపు తొంగి చూసేవారు కూడా లేరు. దాంతో బిజేపి కూడా ఖమ్మం జిల్లాలో తమ పప్పులు ఉడకవనే స్థితికి చేరుకుంది. కేంద్రంలో అధికారం ఉన్నా కాని కనీసం ప్రత్యేకించి ఖమ్మం లో బిజేపి పేరు తెలియని వాళ్లు కూడా అనేకం ఉన్నారు. ఇప్పుడు ఈ చర్చంతా కూడా ఖమ్మం నుంచి మాజీ యంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులు బిజేపి వైపు పడతాయన్న నేపథ్యంలో చర్చకు వచ్చిన విషయాలు .. ఇక ప్రజాబలం ఉందని భావించే శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ గా మారారు.

పార్టీ నిర్ణయాలకు కాకుండా తన ఇష్ట , అయిష్టతలను మాత్రమే నాయకుల పై రుద్దడం మొదలు పెట్టారు. తనకు నచ్చిందే రంభ అన్న చందాన తనకు , తన తమ్ముడికి , పిఎ రూపంలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి బాబయ్ మనవడి తో కూడా సఖ్యతతో మెలిగితే తప్పా శ్రీనివాస్ రెడ్డి శిబిరంలో ఇమిడే పరిస్థితి ఉండదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో హుంతగా , గౌరవంగా , ప్రతిష్ఠతో రాజకీయాలు చేసే వారు శ్రీనివాస్ రెడ్డి శిబిరంలో ఇమడలేకపోతున్నారనే విమర్శ ఉంది.

ఎప్పుడు చూసిన శ్రీనివాస్ రెడ్డి జిల్లా పై పెత్తనం కోరుకోవడం తప్పా అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు , పథకాల గురించి పెద్దగా అవగాహన కూడా లేనట్లు ఆయన ప్రసంగాలు వింటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం డబ్బు, కాంట్రాక్టులే ప్రామాణికంగా ఆయన రాజకీయ పునాదులు ఏర్పాడ్డాయి. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదు , జిల్లాలో ఏ సరిహద్దులో ఏముందో తెలియని స్థితి ఆయనదనేది బహిరంగ అంశం.

తెలంగాణ లో ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఏమి లేని బిజేపికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహ గొప్పోడి లాగా కనబడటం పెద్ద అతిశయోక్తి కాదు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసిపి తో రాజకీయ ఆరంగ్రేటం చేసారు. వైఎస్సార్ , జగన్ అభిమానంతో ఖమ్మం జిల్లాలో పినపాక (పాయం) , వైరా(మదన్ లాల్ ), అశ్వారావు పేట (తాటి ) ఖమ్మం యంపి గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు.

తర్వాతి కాలంలో వీళ్లంత కలిసి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచిన నేపథ్యం గురించి మాట్లాడితే 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి ఎస్ బి . బేగ్ , టిడిపి నుంచి సిట్టింగ్ యంపి నామా నాగేశ్వరరావు , కాంగ్రెస్ & సిపిఐ పొత్తులో నారాయణ , వైసిపి నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటి చేసారు.

నామినేషన్ వేసిన నాటి నుంచే లక్ష , రెండు లక్షల మెజారిటీ వస్తుందని భావించి కోట్లు గుమ్మరించిన కాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వచ్చిన మెజారిటీ కేవలం 11 వేలు మాత్రమే..
నాడు అశ్వారావు పేట , వైరా , పినపాక MLA లు కూడా కొద్ది పాటి మెజారిటీతోనే గెలిచారు.

తర్వాతి కాలంలో 2018 లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు మళ్లీ బరిలో దిగారు . సత్తుపల్లి నుంచి మట్టా దయానంద్ , పినపాక నుంచి , పాయం వెంకటేశ్వర్లు , అశ్వారావు పేట నుంచి తాటి వెంకటేశ్వర్లు , భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు , వైరా నుంచి మదన్ లాల్, మధిర నుంచి లింగాల కమల్ రాజ్ . ఇక ఈ ఎన్నికల్లో కమల్ రాజ్ భట్టీ పై ఓడిపోయారు. పాయం వెంకటేశ్వర్లు రేగా కాంతారావు పై ఓడిపోయారు.

మదన్ లాల్ రాములు నాయక్ ( స్వతంత్ర అభ్యర్ధి) పై ఓడి పోయారు. తెల్లం వెంకట్రావు పొందెం. వీరయ్య పై ఓడిపోయారు. మట్టా దయానంద్ . సండ్రా వెంకట వీరయ్య పై ఓడిపోయారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా పేరున్న ప్రతి ఒక్కరు ఓటమి పాలైయ్యారు. మరి శ్రీనివాస్ రెడ్డి చరిష్మా ఎక్కడ కూడా పని చేయలేదనే విషయం సుస్పష్టం . తన వర్గం ఓడిపోవడమే కాకుండా టిఆర్ఎస్ పార్టీకి శ్రీనివాస్ రెడ్డి వల్ల ఒరిగిందేమి లేదు .

పైగా శ్రీనివాస్ రెడ్డి గ్రూపులు సృష్టించడం వల్ల ఆయన్ని నమ్ముకున్న వాళ్లు కూడా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా తన ఫాలోవర్స్ ని రంగంలోకి దించి చతికిల పడ్డా సంగతి అందరికి తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి గెలిచిన సమయంలో హస్తం గుర్తు లేకపోవడం వల్ల గెలుపొందారు. తర్వాతి కాలంలో శ్రీనివాస్ రెడ్డి కాని అతని అనుచరులు కాని గెలుపొందిన దాఖలాలు లేవనేది స్పష్టంగా కని, వినిస్తున్న మాట.

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking