Header Top logo

జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం

జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం
– మంత్రి కేటీఆర్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, కొందరికే ఇచ్చి వివాదాలు కొనితెచ్చుకోవడం తమకు ఇష్టం లేదని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు మేరకు తమ సొసైటీ సభ్యులకు ఇంటి స్థలాలు కేటాయించాలని జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ కో-ఆపరిటీవ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ వంశీ నేతృత్వంలో జర్నలిస్ట్స్ ప్రతినిధి బృందం ఇటీవల అసెంబ్లీ లాబీలో మంత్రి కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన పై విధంగా స్పందించారు.

తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పలువురు జర్నలిస్టులు నేటికి సొంత ఇండ్లు లేకుండా ఉన్నారని, వారికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. కొందరికే ఇంటి స్థలాలు అందించి మిగితావారందరినీ నిరాశపర్చడం సరైంది కాదన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇలాంటి తలనొప్పులు వద్దని ఆయన సూచించారు.

ఇందుకుగాను ఎలాంటి వివాదాలకు తావు కల్పించకుండా, అందరి సమన్వయంతో, అర్హులైన జర్నలిస్టులందరీ జాబితాను రూపొందించుకొని తన వద్దకు వస్తే, సీఎం కేసీఆర్ ను కలిసి ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇదిలావుండగా వినతి పత్రం అందించి, ఫోటో తీసుకునేందుకు సొసైటీ ప్రతినిధి బృందం ప్రయత్నించగా అందుకు కేటీఆర్ తిరస్కరించారు.

ఇంతకు ఇళ్ళ స్థలాలు ఎవరికి ఇస్తారు..???

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను  ప్రభుత్వం మంజూరు చేసే విషయంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జారీ చేసిన పత్రికా ప్రకటన జర్నలిస్ట్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జర్నలిస్ట్ హౌజింగ్ సోసైటీలకు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ కూడా కెటాయించారు. ఈ ఇళ్ల స్థలాల ఆంశంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జర్నలిస్ట్ లకు అనుకూలంగా ఉంది.

సుప్రీం కోొర్టు తీర్పుకు అనుకూలంగా..

గతంలో జర్నలిస్ట్  హైజింగ్ సోసైటీ ద్వారా ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయల చెల్లించిన జర్నలిస్ట్ లకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తారా..? లేక ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ప్రతి జర్నలిస్ట్ కు ఇళ్ల స్థలం ఇస్తారనే ఆంశం తెరపైకి వచ్చింది.

కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారా..???

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో జర్నలిస్ట్ లు కీలక పాత్ర పోషించారనేది నిజం.  మీడియా రంగం ఆంధ్ర యజమాన్యం చేతిలో ఉన్నప్పటికీ అందులో పని చేసే తెలంగాణ జర్నలిస్ట్ లు  మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని కేసీఆర్ తో ఉద్యమంలో పని చేశారు.

ఆంధ్ర యజమాన్యం వేధించినా..

ఆంధ్ర యజమాన్యం వేధించినా తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడుతాయనే  భావనతో జర్నలిస్ట్ లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా ఉద్యమించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జర్నలిస్ట్ లకు ట్రిపుల్ బెడ్ రూమ్ కట్టి గిఫ్ట్ గా ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఏళ్లు గడుసున్నా కేసీఆర్ మాట ఆచరణలో అమలు కావడం లేదు.

ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం..

అలా ప్రకటించి ఏళ్లు గడుస్తున్న ఆచరణలో జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల ఫైల్ ముందుకు కదలడం లేదు. ఇటీవల జర్నలిస్ట్ లు కూడా తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమెటం ఇచ్చారు. జర్నలిస్ట్ యూనియన్ లు కూడా రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి సిద్దమైతున్నారు. ఇప్పటికైనా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఆశిద్దాం..

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వానికి తలనొప్పే..

సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో స్పష్టత లేదు. ఒక్కో పేపరు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆబద్దాలను వార్త కథనాలుగా ఇస్తున్న నేటి కాలంలోె నిఖార్సయిన జర్నలిస్ట్ ల కోసం టార్చ్ లైట్ తో వెతుకాల్సిందే.  మంత్రి కేటీఆర్ ను జర్నలిస్ట్ లు కలిసిన సందర్భంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల ఆంశంలో ఏకాభిప్రాయం సాధ్యమా..??

ఇళ్ల స్థలాల ఆంశం వివాదం కాకుండా ఏకాభిప్రాయంతో లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు బాధ్యత అప్పగించారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగానే అల్లం నారాయణ జర్నలిస్ట్ సీనియర్ లతో చర్చలు మొదలు పెడుతున్నారు.

జర్నలిస్ట్ యూనియన్ ల మధ్య..

అయితే.. అల్లం నారాయణ – దేవులపల్లి అమర్ జర్నలిస్ట్ యూనియన్ ల మధ్యన నువ్వా -నేనా అనే రీతిలో ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం జరుగుతుంది. కొందరు జర్నలిస్ట్ లైతే వ్యక్తిగత దూషణలకు కూడా వెళ్లారు. ఇలాంటి సమయంలో జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందా..? ఇదే ఆంశంను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇంత కాలం కాలయాపన చేస్తు వచ్చింది కూడా..

జర్నలిస్ట్ ల అయోమయం…

ఇళ్ల స్థలాలపై సోషల్ మీడియాలో వైరల్

ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇస్తాదని ప్రకటించడంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎండ మావులను చూసి నీళ్లులా భావించడం అంటూ కొందరు పోస్ట్ చేస్తే.. కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే అంటూ మరి కొందరు. అల్లం నారాయణ సార్ ను పట్టుకుంటే ఇళ్ల స్థలం వస్తాదని కొందరు.. జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతిని పట్టుకుంటే ఇళ్ల స్థలం ఇప్పిస్తారని ఆశతో ఉన్నారు మరి కొందరు జర్నలిస్ట్ లు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల ఆంశం మరోసారి తెరపైకి వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేసీఆర్ గారు జర్నలిస్ట్ లందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మనం కోరుకుందాం..

యాటకర్ల మల్లేష్,

జర్నలిస్ట్,  949 222 5111

Leave A Reply

Your email address will not be published.

Breaking