ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021:
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.ఈ నినాదంతో మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది.కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఆంధ్ర ప్రజల బలిదానాలతో ఏర్పాటు అయిన విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రయత్నించడం దారుణం.దీనిపై ప్రతిఘటిద్దాం.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీ కరణ కాకుండా ప్రజలందరూ ఉద్యమ బాట పట్టాలని అనంతపురం పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జ్ జేసీ పవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని జేసీ పవన్ రెడ్డి ప్రజలను కోరారు. ఏళ్లతరబడి ఐరన్ ఓర్ గనులు కేటాయించకుండా నష్టాల సాకు చూపి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వం చేసుకున్న రహస్య ఒప్పందం మేరకే ఈ ప్రైవేటీకరణ జరుగుతున్నదని జేసీ పవన్ రెడ్డి ఆరోపించారు. జాతి సంపద అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు కంపెనీ లకు కట్టబెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడంతోనే వైకాపా ప్రభుత్వం సరిపెట్టుకున్నదని జేసీ పవన్ విమర్శించారు.. ఒక రాష్ట్ర మంత్రి తామే ఈ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తామని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. అరవై నాలుగు గ్రామాల్లో 26 వేల ఎకరాలలో ఏర్పాటు చేసిన ఈ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించడం అయిదు కోట్ల ప్రజలను మోసం చేయడమేనన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, ఆ దిశగా ఒక్క అడుగు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేయలేదనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కడప జిల్లా ప్రజల ఆకాంక్ష అయిన స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని వైకాపా ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేవలం వందల కోట్ల రూపాయల విలువ అయిన స్టీల్ ప్లాంట్ ను కూడా నిర్మించలేని ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏవిధంగా కొనుగోలు చేస్తుందో ప్రజలకు వివరించాలని పవన్ డిమాండ్ చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.. ముందస్తు వ్యూహం లో భాగమే అమరావతిని మార్చి విశాఖ రాజధాని గా ప్రకటించారనే అనుమానాన్ని జేసీ పవన్ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలుపుదల చేయాలనే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం ఏమాత్రం చేయకపోవడం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆంధ్రులు తెలుగుజాతి మరకతమణి అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు..