Header Top logo

డాక్టర్ రామారాజు కలం నుంచి మరో రెండు పుస్తకాలు

డాక్టర్ రామారాజు కథల పుస్తకాలకు బాపు బొమ్మలు

డాక్టర్ రామరాజు గారు ఇప్పుడయితే మిత్రులు కానీ అప్పట్లో అతని పరిచయం నాకు  చాలా విచిత్రంగా జరిగింది. రామరాజు గారు బాపు గారికి వీరాభిమాని. నాకు ఎంతగానో ఆత్మీయులైన డాక్టర్ భార్గవి గారి క్లాస్ మేట్. ఒక రకంగా భార్గవి గారే తనతో పట్టు పట్టి కథలు వ్రాయించారని ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు కూడా.

సుమారూ పదమూడేళ్ళ క్రితం సాక్షి ఎడిట్ పేజీలో పని చేసే సీనియర్ జర్నలిస్ట్ అంబటి సురేంద్ర రాజు గారు నా వద్దకు వచ్చి

“అన్వర్ చిన్న మాట”  అంటూ రిసెప్షన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే కోయి కోటేశ్వరరావుగారి తో నా తొలి పరిచయం. ఆయన ద్వారా తొలిసారిగా రామరాజు గారి పేరు వినడం . రామరాజుగారు భట్టిప్రోలు కథలని కొన్ని కథలు వ్రాశారని ఆ పుస్తకానికి బొమ్మలూ, కవర్ బాపు గారి ద్వారా వేయించాలని ఆయన గొప్ప కోరిక.

అప్పటికే కొన్ని మార్గాల ద్వారా బాపు గారి దగ్గరికి డాక్టర్ గారి పుస్తకం విషయం వెళ్ళింది. కానీ పని ఒత్తిడి వల్ల  బాపు గారు బొమ్మలు వేస్తా అని గట్టిగా  చెప్పలేక ఉన్నారు.

ఇలా అలా  ఈ రామరాజు గారి విషయం సురేంద్ర రాజు గారి దాకా వెళ్ళింది. ఈయనకు, నాకూ- బాపు గారికి కాస్త మంచి మాటా, పలుకు, చనువు ఉన్నాయని తెలుసు. అందుకని కాస్త  ఈ సాయం చేసి పెట్టమని నన్ను  కోయి కోటేశ్వరరావు, సురేందర్రాజు గార్లు అడిగి అడిగారు.

అదెంత పని అని ఆ సాయంకాలమే విశాఖ ఎక్స్ ప్రెస్ గెస్ట్ హౌస్ లో ఉన్న బాపు గారిని కలిసా. ఆయన ఆ రోజుల్లో వెంకటేశ్వర వైభవం టీవీ సీరియల్ చేస్తున్నారు. ఆ మాటా ఈ మాటా కలిపి అలా మాటల మధ్యలో డాక్టర్ రామరాజు గారి  పుస్తకం విషయం తెచ్చా.

“రామరాజు గారికి మీ బొమ్మ అంటే ప్రాణం బాపు గారూ, ఆయన ఎంత ఖర్చు అయినా పర్లేదు, బాపు గారు బొమ్మ వేస్తే చాలూ అని భీష్మించుక్కూచున్నారు. వేసేద్దాం బాపు గారు అన్నా.’’

డబ్బాశ, పేరు పిచ్చి వంటి చెత్త మాటలు ఆయనతో మాట్లాడవచ్చా లేదా అని కూడా తోచని అజ్నానం నాది. ఆయన నన్ను చాలా వాటికి క్షమించేవారు. అప్పుడూ అలానే క్షమించి

“ఇప్పుడు కాదు లెండి, చూస్తున్నారుగా సీరియల్ పని ఎలా ఉందో” అని నవ్వుతూ ఆ మాట  వదిలెయ్యమన్నారు.

నేను వదలక

“పోనీ సీరియల్ అయ్యాకా వేసి ఇస్తారని చెప్పనా?” అని మళ్ళీ రెట్టించాను.

“అప్పటికి నేను బ్రతికి ఉంటే తప్పక వేద్దాం లెండి అన్వర్ గారూ” అన్నారు.

నాకు ఎక్కడో మాడు వాసన కొట్టి ఇక ఆ సంభాషణ విరమించా. అంత గొప్ప మనిషితో సాయంకాలం చావు మాటలు మాట్లాడించడం ఏవిటి అని నొచ్చుకున్నా. ఇక ఆయన ముందు ఎప్పుడూ రామరాజు గారి ప్రస్తావన తేలేదు.

ఆ తరువాతా త్తరువాతా  అప్పట్లో మా సాక్షి టీవీ లోనే పని చేసే  కుమార్ కూనపరాజు అనే ఆయన కూడా వారి కథలకు బాపు  గారి బొమ్మలు కావాలి, బాపు గారితో మీరు ఒక మాట చెప్పరా అన్వర్ అంటూంటే, ఒకానొక రోజు బాపు గారు హోటల్  దస్ పల్లా లో ఉన్న సమయానా.

“ఇట్లా ఇది విషయం బాపూ గారు నేనూ, నా ప్రెండ్ ఒకాయన మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను రానా?” అని అడిగా.

ఆయన మధ్యాహ్నం  వచ్చేయండి  అన్నారు. అయితే ఆ కూనప రాజు గారు ఎక్కడ ఉంటారో, ఆయన ఫోన్ నెంబర్ ఏమిటో నాకు తెలీదు. ఆయన ఆర్టిస్ట్ మోహన్ గారికి రెగ్యులర్ విజిటర్ అని మాత్రం ఓ అంచనా ఉన్నది. మోహన్ గారికి ఫోన్ చేసి ఎరక్క పోయి బాపుగారు రమ్మన్నారు, ఫలానా హోటల్, రూమ్ నెంబర్ ఇది. అక్కడికి కుమార్ గారిని రమ్మనండి అని చెప్పాను.

మోహన్ గారు ఆ రోజు మధ్యాహ్నం ఒక్క కూనపరాజుని తప్పా మిగతా మంది మార్బలాన్ని వేసుకుని దస్ పల్లా లో హాజరు. వారందరిని చూసి నేను బాపు గారూ ఒకరి మొహాలు ఒకళ్లం అయోమయంగా చూసుకున్నాం, కానీ బాపు గారూ సర్దుకుని రండి రండి అని వెల్కం చెప్పారు. ఆ మాటా ఈ మాట చెబుతూ బాపుగారు మళ్ళీ అక్కడ డాక్టర్ రామరాజు గారి ప్రసక్తి తెచ్చారు.

“మోహన్ గారూ, నవ్యలో మీ బొమ్మలు చూస్తున్నానండి బట్టిప్రోలు రాజు గారికి వేస్తున్నారుగా” ఆన్నారు.

ఆ రోజుల నాటికీ మోహన్ గారు హేండ్ మొత్తం పోయింది. బొమ్మల్లో ఏ మాత్రం బ్యూటీ, మెరుపు, తపన అన్నీ ఏమీ లేవు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. బాపు గారి మాటలకు సిగ్గుపడి పోయి, ఏదో గొణిగారు.  ఆయన్ని సర్ది చెబుతూ

“ఒకప్పుడు మీరు చాలా బాగా గీసేవారు” అని   మోహన్ గారి మీద బాపు గారు కూడా కాస్త జాలి పడ్డారు.

అయితే రామరాజు గారి కథలకు మోహన్ గారు బొమ్మలు వేస్తున్న విషయం, ఆ తరువాత ఆయన కథల పుస్తకానికి అదే బాపు గారు మహాద్భుతంగా కవర్ వేసిన విషయం, అసలు దీనినంతా పట్టువదలక రాజు గారు ఎలా సాధించారన్న సంగతులేవీ నాకు తెలీదు.

నేనూనూ ఆ పాత రోజుల్లో రామరాజు గారి తరపున ఉండి  బాపు గారిని వేధించిన విషయాలు కూడా గుర్తుకు తేలేదు. రాన్రానూ బాపు గారి కవర్ బొమ్మలతోనే డాక్టర్ గారూ మరో రెండో మూడో పుస్తకాలు తేవడం. ఆ పుస్తకాల ముందో వెనుకో నేనూ ఉండటం. అంతకు మించి రాజుగారి ఒక  పుస్తకానికి బాపుగారు కసరత్ చేస్తూ నాతో పంచుకున్న ఈ మెయిల్ విశేషాలు, ఆ బొమ్మలు ఇంకా నా మెయిల్ లో భద్రంగా ఉన్నాయి. వీలయినప్పుడెప్పుడయినా ఆ ముచ్చట్లూ చెప్పుకుందాం.

అన్వర్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking