Town life (story) పట్టణం జీవితం (కథ)
Town life (story) పట్టణం జీవితం (కథ)
దులిపేసిందిగా..? (కథ)
చేతుల్లోని సంచులు రెండూ కింద పెట్టి, బట్టల అడుగున, “పొట్టనిండా పాలు తాగి,ఆదమరిచి నిద్రపోతున్న పసిపాపలా ఉన్న కాయితం” భద్రంగా బయటకు తీసింది బామ్మ. నలువైపులా ! చూసేసింది. కాస్త దగ్గరిగా వింతగా కనిపిస్తున్న ఆకారం వైపు అడుగులు వేసి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తూంది. ఒకప్పుడు నిత్యం రద్దీగా! ఉంటూ, కొత్త పెళ్లికూతురులా కళకళ లాడుతూ ఉండే బస్టాండ్! నేడు కళావిహీనంగా కనిపిస్తుంది.
రోజు రోజుకూ వివిధ ప్రాంతాలు నుండి పొట్ట చేతపట్టుకుని ఉపాధి నిమిత్తం వచ్చే వందలాది మంది వలస కార్మికులతో నిత్యం రద్దీగా కనిపించే బస్టాండ్. నేడు తల్లి ఒడి నుండి తప్పిపోయిన పసిపాప వదనంలా మారిపోయిందని అందరూ అనుకుంటుంటే నిజమే అనిపిస్తుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బస్టాండ్ బైపాస్ రోడ్డుకు తరలించడంతో గొప్పగా వెలిగిన సామ్రాజ్యాలు, కాలగర్భంలో కలిసిపోయి ఆనవాళ్ళు కోల్పోయినట్లుగా మారింది బస్టాండ్ ప్రాంతం.
ఎన్నో సంవత్సరాల తరువాత ఖమ్మంలో దిగిన బామ్మకు బస్టాండ్ ప్రాంతం, అంతా కొత్తగా కనిపిస్తుందేమో, నలుదిశలా చూస్తుంది. ఎటు వెళ్ళాలో అంతుచిక్కని పరిస్థితుల్లో “ఎందుకైనా మంచిది అడ్రెస్స్ కాస్త దగ్గర ఉంచుకో!.” అని కూతురు వ్రాసి ఇచ్చిన కాయితం గుర్తుకు రావడంతో చేతిలోని సంచులు రెండూ కింద పెట్టి బట్టలు మధ్యన పొట్టనిండా పాలు తాగి ఆదమరిచి నిద్రపోతున్న పసిపాపలా ఉన్న అడ్రెస్స్ కాయితం బయటకు తీసింది బామ్మ.
నలువైపులా చూసేసింది. కాస్త దగ్గరిగా వింతగా కనిపిస్తున్న ఆకారం వైపు అడుగులు వేసి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తూ! “గిదో బిడ్డా! జరంత గీ సీట్ల ఉన్న అడ్రెస్స్ చదివిపెడితివా? వచ్చే జన్మిల నీ కడుపున పండంటి బిడ్డలెక్క పుట్టి! నీ ఋణం తీర్చుకుంటలే కొడకా! జరంత సదివి ఇవరంగా నాలుగు ముక్కలు, నా చెవిన పడేయరా నాయనా!” అంటూ కాయితం అందించే ప్రయత్నం చేసింది. రాతి బొమ్మలా! చలనం లేని ఆకారాన్ని పైనుండి క్రిందివరకూ చూస్తూ.
“సమజైతలేదా !నీకు?”
“అర్రే! వయస్సులో నీకంటే మూడున్నర పుష్కరాలు పెద్దదాన్ని?.
‘నాకు అన్నీ సరిగ్గానే వినపడుతున్నాయి!’.
“మరి నీకేంటి పోయేకాలం?”
“గంట నుండి చెవులు, కోసిన గాడిద లెక్కా నా పట్టాన మావూరి పంచాయతీ రేడియో లెక్క వాగుతునే ఉంటికదా?”
“ఉలకవూ?పలకవు?”
“ఇదేటి మాయదారి రోగం రా అయ్యా?”
“నాలుగు రోడ్లు కలిసేటి చౌరస్తా దగ్గర పెట్టిన ఎర్రలైట్ పచ్చలైట్ ఆకుపచ్చ లైట్ దగ్గర బిత్తర చూపులు చూసే మా ఈరిగిడి లెక్క ఆచూపులేటి.”
“నాముఖం !ఏమన్నా ? బొమ్మల పెట్టె అనుకున్నవ్వా? అట్టా గుడ్లు మిటకరిచ్చి చూత్తాండవ్?”
“నోటినిండా! ఆ పాన్ పరాగ్ ఏటి?”
“పిదప కాలం పిదప బుద్దులూనూ!.
“ఓరి దేవుడా! చేతిలా! ఆ పోగులు పొగలు వచ్చెడి ది ఏటి,”
“ఓరి నిన్ను తగలెయ్యా! చావనికి అంత ఉబలాటం ఎందుకురా అయ్యా!” “అదేదో మాయదారి రోగం ? క్యాన్సర్ అంటరే అది అంటుకుంటే వదలదురొయ్ అయ్యా!.” ‘నిన్ను పీల్చీ పిప్పిని చేత్తది.రేయి పగలు నిద్దుర దూరం చేసి చిత్రంగా చూత్తది.”
“వద్దురా అయ్యా!గట్టా పొగలు తాగి ఊదుతాంటే.,గుండే దడదడలాడి పోతాంది.” కిందపడేయరా!పెద్దదాన్ని చెపుతున్నా!నా మాట ఇనుకో”.
“ఆ జుట్టు ఏట్రా!”
“సంవత్సరం సంవత్సరం మా ఊర్లో సర్కస్ ఆడించెటోడి దగ్గర ఉండే ఎలుగుబంటి లాగా? నెత్తిమీద ఆ గంప బోర్లించినట్టు ఆ జుట్టు ఎంట్రా!”
నీ కళ్ళు ఆ జుట్టులో సరిగా కనపడతలే!!
“మనలో మన మాట!”
నువ్వేకనక నాలుగు అచ్చరాలు చదివానని పోగరేటి.?”
“నాను చదువుకున్నా ? పెద్దబాలశిక్ష.
“మా అయ్యోరు ,ఈత పరెకతీసుకు నాలుగు దంచి మరీ చదివిచ్చిండు.”
“పెద్దబాలశిక్ష. ఇటునుండి అటు,అటు నుండి ఇటు,చదివిచ్చెటోడు. చదలేదనుకో!ఏటి ఇంటున్నావా?”
“మా ముత్తిగాడు బర్రెలు తోలుకు పోయేటి సంది,తిరిగి వచ్చేటి వరకు గోడ కుర్చీ ఏంచెటోడు.”
“నీలాంటోడైతే ఒక్క పూటకే కొంపకు లగెత్తటోడు.”
“లగెత్తితే ఊరుకుంటాడేటి?”
“దిట్టంగా ఉన్నా నలుగున్ని పంపించి! లాక్కోచ్చి.
ఎండలో వొంగోబెట్టి ఇపిపైన పుస్తకాలు ఎట్టెటోడు.
కదిలినా,మెదిలినా కాళ్ళు వాచేలెక్క వడ్డింపులు తాళం ఏసెటోడు,”
“నే చెప్పెడిది నీ బుర్రకు ఎక్కుతాందా లేదా?
అవును కానీ!”
“పాతకాలంలో మా వీధిలో కొచ్చే చాకలి చుక్కమ్మ బట్టలు మూట, ఇపుపైన వేసుకున్నట్టు ,ఆసంచి ఎందుకు ఇపిన”
.”చిన్న తనంలో చాకలమ్మ చెయ్యి చల్లని చెయ్యి! అని తన బుట్టలో నాలుగు మెతుకులు బిడ్డ నోటిలో పెట్టమనెటోల్లు.””దాని ఋణం ఇలా తీర్చుకుంటున్నవా!”
“ఇంతకి నువ్వు అమ్మాయివా!అబ్బాయివా?”
ఈ పట్నంలో ఆడా మొగ ఒకేలెక్క ఉన్నరు.
అందుకే ఇవరం కోసం అడిగిన? “సిగ్గు దాచుకునేందుకు చీర, అమ్మతనం కప్పుకునేందుకు రవిక”అనేటోల్లు మా రోజుల్లో!
అవి రెండు గాలి కొదిలేసిండ్రు కాదురా నాయనా!”
“సిగ్గంటే ఏంటి?అని అడిగేలా ఉన్నారు,నీతోటి నేస్తాలు.”
“మొకాళ్ళ దాకా కత్తిరించి, చాలీ చాలని గుడ్డ పీలికలు పీలికలు చుట్టుకు తిరగడమే ఫ్యాషన్ అనేలా ఉన్నారు తప్ప?”
“పట్టు లంగా,పట్టు పరికిణీ వేసిన ఆడపిల్ల ఒక్కత్తి కూడా కానరాలేదురా అబ్బీ!”
అంతవరకు బామ్మ మాట్లాడింది అర్దం చేసుకున్నాడో!లేక?ఎందుకీ ఈ నస అనుకున్నదో ?
రెండు చేతులు జోడించి నమస్కారించి, వెళుతున్న అమ్మాయో!అబ్బాయో!తెలియని డ్రెస్ లో ఉన్న ఆకారం వైపు చూస్తుంది మా బామ్మ.
వింతగా!! ఫ్యాషన్ అనుకునే ప్రపంచంలో గుడ్డిగా బ్రతుకుతున్న యువత వైపు.
రాము కోలా, దెందుకూరు.
9849001201