Header Top logo

To believe that God exists ..? దేవుడు ఉన్నాడంటే నమ్మరెందుకు..?

To believe that God exists ..?
దేవుడు ఉన్నాడంటే నమ్మరెందుకు..?

ప్రశ్న : మా కంటితో చూస్తేనే దేవుడున్నాడని నమ్ముతామని మీరంటున్నారు కదా ! మన చుట్టూ ఉన్న గాలిని కూడా ఎవ్వరమూ చూడటంలేదు. అందుకని గాలిని లేదూ అని అనలేం కదా ! గాలి లాగే దేవుడు కూడా ఉంటాడు. కాని మనకు కనపడడు. దేవుడే లేకుంటే మరి ఆది మానవుడు ఎలా పుట్టాడు ? ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది ??

జవాబు : దేన్నైనా చూస్తేనే మేము నమ్ముతాం. దేవుడ్ని మీరెవరూ నమ్మొద్దని నేను గానీ, మా జనవిజ్ఞాన వేదిక నాయకులు ఎవరికీ ప్రబోధించలేదు. అలా ప్రబోధించరు కూడా. ప్రతిదాన్నీ ప్రశ్నించమని, సమాధానాల్ని శాస్త్రీయంగా రాబట్టుకుంటూ నమ్మకాల్ని, భావాల్ని విశ్వాసాల్ని, ఏర్పర్చుకోమని, దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని మాత్రమే మేము చెప్తాం. మన భారత రాజ్యాంగంలోనే పౌరుల ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 ఏ (హెచ్) కింద ఒక మాట ప్రస్ఫుటంగా చెప్పబడింది. అది శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం. తార్కిక దృష్టితో ప్రశ్నించే లక్షణాల్ని పెంపొందించు కోవడం. మానవవాదాన్ని సంస్కరణాభిలాషను, భూతదయ కలిగి ఉండడం, ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి అంటూ ఆ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. గాలికి, దేవుడికి పోల్చుతూ ప్రశ్నించారు కాబట్టి ఆ మేరకు మీరు రాజ్యాంగ బద్ధంగా మీ విధిని నిర్వర్తిస్తున్నట్టే లెక్క. శాస్త్రీయ దృక్పథంతో, తార్కిక దృష్టితో మీరు ప్రశ్నించారు. సంతోషం.

jana vignana vedika 111

గాలి కనిపించక పోయినా..  గాలి కనిపించక పోయినా దాని ప్రభావం ఏ రకంగా పరిక్షించి చూసినా ఎవరికైనా తెలిసిపోతుంది. గాలికి ఘన పరిమాణం అనే ఒక కొలత ఉంటుంది. గాలికి ద్రవ్యరాశి ఉంటుంది. కాబట్టి సాంద్రత కూడా ఉంటుంది. గాలికి ఉష్ణోగ్రత ఉంటుంది. చల్ల గాలి, వేడిగాలి ఏ రకమైన గాలి వీచినా స్పర్శ ద్వారా మనకు తెలుస్తుంది. గాలిని మనం చూడలేక పోయినా దాని ఉష్ణోగ్రతను తగ్గిస్తే అది ద్రవ రూపానికి చేరుకుంటుంది. అప్పుడు అదే గాలిని మనమందరం మన కంటితోనే సులభంగా చూడగలం. మామూలు గాలిలో సుమారు 80 శాతం నైట్రోజన్‌ ఉంటుంది. గది ఉష్ణోగ్రత దగ్గర, ఒక ఖాళీ బెలూన్‌లోకి సుమారు 22 లీటర్ల నైట్రోజన్‌ వాయువుని ఊదితే ఆ బెలూన్‌ బరువు కచ్చితంగా 28 గ్రాములు ఉంటుంది. అదే బెలూనులోకి అంతే ఘన పరిమానం ఉన్న ఆక్సిజన్‌ వాయువుని ఊదితే 32 గ్రాముల బరువు తూగుతుంది. అలాగే అంతే ఘన పరిమాణం గల హైడ్రోజన్‌ వాయువుని ఊదితే దాని బరుకు కేవలం 2 గ్రాములే తూగుతుంది. 28 గ్రాముల కనిపించని నైట్రోజన్‌ వాయువుని ఒక దట్టమైని గోడలు ఉండే పాత్రలోకి పంపి, ఉష్ణోగ్రతను -200్ణ°C కు తగ్గిస్తే అది సలసల కాగే నీళ్లలాగా, పొగలు చిమ్మే నైట్రోజన్‌ ద్రవాన్ని మనం చూడగలం. ఇలా ప్రతి వాయువునూ నిర్దిష్ట , తక్కువ ఉష్ణోగ్రతకు తగ్గించుతూ తీసుకెళ్తే అన్ని వాయువులు ద్రవాల్లాగా మారిపోయి, గ్లాసులో నీళ్లున్నట్టుగానే కనిపిస్తాయి.

ఆ ద్రవాలు ఉష్ణోగ్రతను తగ్గిస్తే..

ఆ ద్రవాలు ఉష్ణోగ్రతను ఇంకా తగ్గిస్తే ఐసుగడ్డలా గట్టిగా, రాయిలాగా ఘన రూపంలోకి మారిపోతుంది. వాయు రూపంలో ఉండే గాలి, మామూలుగా మన కంటికి కనిపించక పోవచ్చు కానీ.. గాలిని మన పంచేంద్రియాల్లో ఏదోఒక దానితో సరైన పద్ధతిలో ప్రత్యక్షంగా పరిశీలించగలం. ఉదా;- స్పర్శ & వాసన ద్వారా వాయువుల ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ఇంకో విషయం. ఇలా గాలిని లేదా ఏదేని వాయువును మీరు, నేను, మా పక్క ఇంటి వెంకటేశ్వర రావు, ఎదురింటి మేరీ ఎలిజబెత్‌, మా వెనుక ఇంటి ఇస్మాయిల్ భాయి, మా డ్రాయింగ్‌ మాస్టార్‌ సీతారామ శాస్త్రి, టిబెట్‌లోని దలైలామా, వాటికన్‌ సిటీలోని పోప్‌, స్వర్ణ దేవాలయానికి వెళ్లే రణవీర్‌ సింగ్‌ ఇలా ఎవరికైనా, ఏ వాయువునైనా -200్ణ°C కి తీసుకెళ్తే అందరికీ కనిపిస్తుంది. అంతేగాదు అది మనుషులందరికీ ఒకే విధంగా కనిపిస్తుంది. వేర్వేరు మతాల వాళ్లకి, వేర్వేరు రంగుల్లో, వేర్వేరు రూపాల్లో కనిపించదు. ఏ మతాన్ని పాటించని నాస్తికులకు కూడా కనిపిస్తుంది. వారికి కూడా అందరికీ కనపడ్డట్టే అదే విధంగా కనిపిస్తుంది.

ఎండ వేడిమికి సముద్రల్లోని నీరు కూడా

కాబట్టి గాలి కనిపించడం లేదని మీరు అనడం కరెక్టు కాదు. మీరు మామూలు పరిస్థితుల్లో చూసి తాగే మంచి నీరు కూడా 100్ణ°C దాటే వరకు వేడి చేస్తే కనిపించదు. దానర్థం నీరు మాయమైనట్టు కాదు. ఎండ వేడిమికి సముద్రల్లోని నీరు కూడా ఆవిరై పైకి వెళ్ళి పోతుంది. ఆ కనిపించని ఆవిర్లే చల్లబడిన వెనువెంటే వర్షాలుగా మారి భూమిపై కురుస్తాయి. కాబట్టి ప్రకృతిలో ఉన్న గాలితో, మీరు నమ్మే దేవుడిని పోల్చి ప్రశ్నిండం కుదిరే పనికాదు. ఐనా మీరు అలాగే ప్రశ్నిస్తామంటే.. ఎక్కడా కనిపించని మి దేవుణ్ణి , ఏ ఉష్ణోగ్రత దగ్గరకు తీసుకెళ్తే కనిపిస్తాడో మీరే బదులు చెప్పాల్సి ఉంటుంది. గాలి కనిపించట్లేదు ఎందుకని ఎవరూ మారాం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సైన్స్ తెలియక , మొండిగా అలా మారాం చేస్తే.. గాలిని చల్లబర్చి ద్రవ రూపంలో వారికి చూపవచ్చు. ఇలా చల్లబరిచిన గాలి అందరికీ కనిపిస్తుంది. కాని ఏం చేస్తే మీరు నమ్మే దేవుడు అందరికీ కనిపిస్తాడో మేరే చెప్పాలి.

jana vignana vedika 111

దేవుడు అందరికీ కనిపించాలంటే ఏం చేయాలి?

ఆ దేవుడ్ని ఏ పాత్రల్లో పెట్టి ఎంత వరకు చల్లబర్చాలి? పోనీ ఇప్పటి వరకు ఎవరికైనా కనిపించాడా? కనిపిస్తే ఎలా వున్నాడు? అతడు (సృష్టి కర్త) మగవాడే అంటూ ఎందుకు అంటుంటారు? గాలికి లైంగికత లేదు కదా. గాలి దేవుడిలాగా పిల్లల్ని కనదు. దేవుడిలాగా ఆభరణాలు ధరించదు. దేవుడిలాగా ఆయుధాలు పట్టుకోదు. దానికి శత్రువులు ఎవరూ లేరు. పదేపదే యుగయుగాలూ కొత్త కొత్త అవతారాలతో అవతరించదు. దేవుడిలాగా అప్పటికప్పుడు ప్రత్యక్షం కాదు. మాయం కాదు. అది తన మానాన తాను అలా ఉంటుంది. ఈ లెక్కన గాలికి ఉన్నట్టే ప్రత్యేక ధర్మాలు కూడా దేవుడికి ఉండాలి కదా. కాబట్టి దేవుడున్నాడని మీరు నమ్ముతూ, ఋజువు కోసం గాలితో పోల్చుతూ ఉపమానాలంకారాలు వాడితే ఇక్కడ అతనికే అవకాశం లేదు.

వాదన తార్కికంగా ఉన్నట్లయితే..

వాదన తార్కికంగా ఉన్నట్లయితే ఏ విధంగానైనా వాదించ గలం. ఐనా దేవుడి ఉనికిని చూపడానికి సాధారణ కంటికి కనిపించని గాలిని, పరమాణువును, ఎలక్ట్రాను మాత్రమే ఎందుకు ఉదాహరణలు గా తీసుకోవాలి ? కనిపించే కొండలు, మనుషులు, నదులు, దోమలు, గుర్రాలు, గాడిదలు, పందులు, ఆవులు, చెట్లు, రాళ్లు, గుళ్లు, విగ్రహాలు, చెప్పులు, గులాబీలు, కర్పూరం, పేడ, పెన్ను ఇవన్నీ ఉనికిలో ఉండి కనిపిస్తున్నాయి కదా. మరి మీ ప్రకారం ఉనికిలో ఉన్న దేవుడు అందరికీ కనిపించ డెందుకని ? ఈ విధంగా కూడా మీరు ప్రశ్నించుకోవచ్చు కదా ? ఎందుకని అలా ప్రశ్నించుకోవట్లేదు ? ఏమి చేస్తే మన కంటికి కనిపించని ఎలక్ట్రాన్ల ప్రభావం కనిపిస్తుందో ఓ నిర్దిష్ట ప్రక్రియ ఉంది. ఏం చేస్తే కనిపించని పరమాణువులు కనిపిస్తాయో దానికీ నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. ఏం చేస్తే కనిపించని గాలి కనిపిస్తుందో పైన చెప్పిన కచ్చితమైన పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ పద్దతుల్లో ఎవరు పరీక్షలు చేసినా, ప్రయోగాలు చేసినా అవే ఫలితాలు వస్తాయి.

మనుషులే స్వయంగా పూనుకొని.. అంతే కాదు అలాంటి పద్ధతులేమిటో నోటికి వచ్చినట్టు, బుర్రకు తోచినట్టు ఎవరూ ఊహించి చెప్పలేదు. ప్రవచనాలు చేయలేదు. ఆ పద్ధతులన్నీ ప్రయోగాత్మకంగా రుజువయ్యాయి. పైగా ఆ పద్ధతులన్నీ కంటికి కనిపించె పదార్థాలతోనే మనుషులే స్వయంగా పూనుకొని పతరయోగాలు చేస్తారు. గాలి బెలూన్లను వీధిలో వదిలేసి ఎక్కడికో ఓ మూలకు వెళ్లి , కళ్లు మూసుకొని ధ్యానం చేస్తే వీధిలోని బెలూన్లు చల్లబడి ద్రవ రూపానికి చేరి కనిపించవు. మీ దగ్గరికి వచ్చే గాలిని చూడ్డానికి , గాలితోనే తలపడాలి, గాలిపైనే ప్రయోగాలు చేయాలి. మరి దేవుడ్ని చూడ్డానికి ఎక్కడ ఎవరితో తలపడాలి ? ఎవరిపై ప్రయోగాలు చేయాలి.

వాదన తార్కికంగా ఉన్నట్లయితే

దిమ మానవుడు ఎలా పుట్టాడు ?

దేవుడే లేకుంటే ఆదిమ మానవుడు ఎలా పుట్టాడు ? ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది! అని కూడా ప్రశ్నించారు. అలా అడగడం మంచిదే. అదికూడా రాజ్యాంగ స్ఫూర్తి ఇచ్చిన ప్రశ్నించే తత్వంతో ముడిపడి ఉన్నదే. అలా ప్రశ్న అడగడంలో న్యాయం ఉంది. ఐతే దేవుడే ఉండి, స్వయంగా పూనుకొని అది మానవున్నీ, ఇతర సృష్టి నంతా సృష్టించాడు అని మీరు అనుకుంటే.. మరి ఆ దేవుడిని ఎవరు సృష్టిం చారు ? అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఆ ప్రశ్నను నేను కూడా అదే రాజ్యాంగస్ఫూర్తితో వేయగలను. దేవుడు తనంత తానుగా సృష్టించుకొంటాడని, అతడికి ఆది, అంతం, మధ్య లన్నీ ఉన్నవాడని ఒకసారి., అవేవీ లేనివాడని మరోసారి., దేవుడు ఇందుగలడని, అందుగలడని, ఎన్ని చోట్ల చూసినా.. అన్నిచోట్లా కలడని, ఆయన సర్వాంతర్యామి అని మీరు అనుకొంటే., అలాంటి వ్యవస్థకు రూపంలేదు. అది సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రకృతి లాంటిదే ఔతుంది. మరి ఆ ప్రకృతే దేవుడైతే.. మీరు ఆ ప్రకృతికే దేవుడని పేరు పెడితే.. అది మీ ఇష్టం.. నాకు ఏ అభ్యంతరం లేదు.

అందరం మనుషులమే..

ఐతే ఆ ప్రకృతిలోంచే మనిషి , (ఇతర జీవులు కూడా) పరిణామ క్రమంలో “ఆవిర్భవించాడు” (మీ భాషలో “పుట్టాడు”) అన్నది నిజం. ఆ ప్రకృతిలోనే జీవులూ, నిర్జీవులూ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మా ప్రకృతి వేరు, మీ ప్రకృతివేరు అంటూ తగాదాలు పెట్టుకుంటామా ? మా సూర్యుడు వేరు, మీ సూర్యుడు వేరు అంటూ కక్షలు పెంచుకుంటామా ? సూర్యుడు అక్కడెక్కడో ఉంటే మా సూర్యుడు వెన్న దొంగిలించాడనో, మా మిల్కీవే గెలాక్సీని శిలువ వేశారనో, మా ఆండ్రోమిడా గెలాక్సీ ప్రవక్తగా మారిందనో అబద్ధాలు చెప్పం కదా. మతాలు ఏవైనా, ఎవరు ఏ మతాన్ని అనుసరించినా అసలు ఏ మతాన్నీ అనుసరించని వ్యక్తులైనా అందరం మనుషులమే. మనుషులందరూ కూడా ఇతర జీవులు, నిర్జీవులతో పాటు ఈ ప్రకృతిలో భాగమే. కాబట్టి మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ పోదాం. దేవుడి పేరుతో, మతం పేరుతో తగవులు పెట్టుకోకుండా అందరం కలిసి మెలిసి ఈ ప్రకృతిలో భాగంగా జీవిద్దాం..

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
జన విజ్ఞాన వేదిక , తెలంగాణ
email: allikayala@gmail.com

Leave A Reply

Your email address will not be published.

Breaking