Header Top logo

ఇది ఈటల రాజేందర్ గెలుపు.. బీజేపీ గెలుపు కాదు: పొన్నం ప్రభాకర్

  • ఈటల గెలుపు బీజేపీ గెలుపంటూ బండి సంజయ్ చెప్పడం సరికాదు
  • ఈటల రాజేందర్ బీజేపీ గురించి ఎక్కడా చెప్పుకోలేదు
  • హుజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వస్తున్నాయి
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల సరళి అధికార టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వస్తున్నాయని అన్నారు. తనను మంత్రి పదవి నుంచి కేసీఆర్ అప్రజాస్వామిక పద్ధతిలో తొలగించారనే విషయాన్ని ఈటల రాజేందర్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని పొన్నం చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదని అన్నారు.
ఈటల గెలుపు బీజేపీ విజయంగా బండి చెప్పడం సరికాదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. వాస్తవం చెప్పాలంటే ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ సొంతంగా ప్రచారం చేసుకున్నారని… బీజేపీ అభ్యర్థినని ఎక్కడా చెప్పుకోలేదని అన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల గెలుపు మాత్రమేనని… బీజేపీ గెలుపు కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పలేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Tags: Ponnam Prabhakar, Congress, Etela Rajender, Bandi Sanjay, BJP, Huzurabad

Leave A Reply

Your email address will not be published.

Breaking