Header Top logo

This is not a patriotic anthemv ఇది దేశభక్తి గీతం కాదు

నోస్టాలజీ

This is not a patriotic anthemv

ఇది దేశభక్తి గీతం కాదు…” దేశభుక్త ” గీతం..!!

*గుండెపగిలిన జెండాకింద ఊపిరి పాయల్లో ‘బుస’
కొడుతున్న ‘మతోన్మత్త’ గీతమిది…..!!

ఈ కవి పూర్తిపేరు… గార శ్రీరామ మూర్తి. శ్రీకాకుళం జిల్లా,
రాజాం తాలూకా,మందరాడ గ్రామం.అయితే స్థిర నివాసం హైదరాబాదు. వృత్తి జర్నలిజం.ప్రవృత్తి మాత్రం కవిత్వం.

పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవం.ఆంధ్రపత్రిక,ఆంధ్రప్రభ దిన పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు.ఈనాడు ,ఆంధ్ర జ్యోతి,ఆంధ్ర భూమి,వార్త, సూర్య దినపత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం…మన తెలంగాణ దిన పత్రికలో పనిచేస్తున్నారు. “నిజం ” పేరుతోనే కవిత్వం కొనసాగిస్తున్నారు.

“నిజం ” ప్రచురణల ద్వారా తొలి కవితా సంపుటి.. ” నిజం గీతాలు “ వెలువడింది. ఇక అప్పటి నుంచి ‘నిజం శ్రీరామ మూర్తి’ గా స్థిరపడిపోయారు.కవిలోకంలో మాత్రం “ నిజం ” గానే సుపరిచితులు”లాంగ్ మార్చ్”( దీర్ఘ కవిత ) శవభాషాశ్వవిద్యాలయం”. (కరపత్ర కవితలు ) వెలువరించారు.

ఆ తర్వాత వి.ర.సం. తరపున”ఎర్రమందారాలు” కవితా సంపుటి వచ్చింది.‌అనంతరం “కళ్ళు” దీర్ఘ కవిత రాశారు (ఆయనకు బాగాపేరు తెచ్చిన దీర్ఘ కవిత ఇది ) “నివురు” తో పాటు,” నాలుగోపాదం” ” అలలు” కవితా సంపుటులను కూడా వెలువరిం‌చారు.!

అయిదు దశాబ్దాలకు పైగా సామాజిక, రాజకీయ,సాహిత్య చరిత్రకు శ్రీరామ్మూర్తి గారు వీక్షకుడు, ప్రత్యక్ష సాక్షి…, ఇది నిజం “ నిజంగా ” నిజం.

అలాంటి

” నిజం ‘ రాసిన నేటి కవిత.. ‘దేశభుక్త గీతం’ 

మీరూ చదవండి.!!

“పూసలు జారిపోయిన దారం
ఇసుక వెడలిపోయిన ఎడారి
రైలుపట్టాల మీది పువ్వు

చివరి మైలురాయి వద్ద
చిరిగిపోయిన చేట చీపురు
నడి మధ్యలో కూరుకుపోయిన పడవ

దిక్కులు పిక్కటిల్లుతున్నా
తనకు వినిపించని పాట
కూలిన పచ్చని చెట్టు మీది
కుఠార సింహాసనంపై
యోగాచార్యుని చిద్విలాస ముద్ర

కొంగ రంగు గెడ్డంలో మెరుస్తున్న
కాటి మెప్పుల కీర్తి చంద్రికలు

శవాలను మోసుకుంటూ
జీవచ్ఛవాలను చూసి
వొలుకుతున్న కనుకొలకులతో
ప్రాణాలరచేత పట్టుకొని
పరుగులు తీస్తున్న నదులు

గుండెపగిలిన జెండాకింద
ఊపిరి పాయల్లో బుసకొడుతున్న
మతోన్మత్త దేశభుక్త గీతం “!!

*దేశభుక్త గీతం
03-06-2021.

ఇప్పుడు ఏటి ఒడ్డున ఒంటికాలుతో నిల్చొన్నకొంగలు దేశభక్తికి ప్రతీకలయ్యాయి. అడవిలో జింకల్ని వేటాడే పులులు దేశభక్తుల రూపాల్లో సంచరిస్తున్నాయి. గడ్డాలు పెంచుకున్నోళ్ళంతా స్వాముల రూపాల్లో ధర్మ ప్రవచనాలు చేస్తున్నారు. వర్తమానం వేషాలకు, మోసాలకు వేదికైంది.

ఇక్కడ పాత్రధారులు,గాత్రధారులంతా ఒకటైపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మూతి గుడ్డలతో పాటు ‘దేశభక్తి ‘ తొడుగులూ తొడుక్కుంటున్నారు. దేశభుక్తులంతా..దేశ‌భక్తులుగా చెలామణయ్యే కాలం ఇది. ఇప్పుడు దేశభక్తికీ ‘ లేబిళ్ళు ‘ అంటించేసుకో
వాలి. ప్రశ్నించిన వాడికి ‘ దేశద్రోహి ‘ ముద్ర తప్పడం లేదు. రాజ్యం దుశ్చర్యలను కీర్తించే వాళ్ళే ఇప్పుడు ‘ నయా దేశభక్తులట ‘ !.

ఈ కవితలో ఓ ఉదాసీన కాన్వాసుపై వర్తమాన నిజాలను ఉటంకిస్తున్నాడు..అవన్నీ నేటి మన సామాజిక పరిస్థితికి అద్దంపట్టేవే..!

దారంలోంచి పూసలు జారిపోతే..పూసల దండ ఉనికి కోల్పోతుంది. ఇసుక లేని ఎడారికి అర్థమేలేదు. రైలు పట్టాల మీది పూవు చక్రాలు కింద నలిగి నామ రూపాల్లేకుండా పోతుంది. చివరి మైలురాయి దగ్గర చిరిగిన చేటకు విలువేముంది? సముద్రం నడిమధ్యలో కూరుకుపోయిన నావగతి అధోగతే. దిక్కులు పిక్కటిల్లుతున్నా, తనకుమాత్రం వినబడని పాట.కూలిన పచ్చని చెట్టు మీది కుఠార సింహాసనంపై యోగాచార్యుని చిద్విలాస ముద్రకు అర్ధమే లేదు. కొంగ రంగు‌ గెడ్డంలో మెరుస్తున్న కాటి మెప్పుల కీర్తి చంద్రికల తారాతోరణంలో…

శవాలను మోసుకుంటూ జీవచ్ఛవాలను చూసి వొలుకుతున్న కనుకొలకులతో ప్రాణాలరచేత పట్టుకొని నదులు పరుగులుతీస్తున్నాయి. ఇప్పుడు శవాలకు నదులే ఆవాసాలు. అది చూసి గుండె పగిలిన జెండాకింద ఊపిరి పాయల్లో….మతోన్మత్త ‘దేశభుక్త గీతం ‘ బుసలు కొడుతోంది.

ఈ కవితలో అన్నీ ‘నిజాలే’,నిజానికి ఇప్పుడు మతోన్మాదమే దేశభక్తికి గీటురాయిగా మారింది. ఇక్కడ… ‘మతం’ ముందు అన్నీ దిగదుడుపే, చివరకు మనిషి కూడా కొంగరంగు గెడ్డంలో మెరుస్తున్న కాటి మెప్పుల కీర్తి చంద్రికల్నిచూసి మురిసిపోయే మన పాలకుల తీరుతెన్నుల గుట్టు విప్పిన కవిత ఇది.

మంచి కవిత నందించిన ” నిజం” శ్రీరామ మూర్తిగారికి
అభినందనలు...❤️❤️❤️❤️!!

ఎ.రజాహుస్సేన్.!!
‌ హైదరాబాద్.

Leave A Reply

Your email address will not be published.

Breaking