Header Top logo

This is a crow’s story ఇది కాకి కథ.. మనుషులు ఆలోచించే కథ..

This is a crow story
ఇది కాకి కథ.. మనుషులు ఆలోచించే కథ..

నా కథ నేనే చెప్పుకుంటా వింటారా..? కాకి

నాపేరు “కాకి”నాకది మనుషులు పెట్టిన పేరు. “అస్థిపంజరం” ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఈ పేరు ఎందుకో పెట్టానో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది. నాకు నలుగురు పిల్లలు. అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి. కోయిలకు గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పొదిగి పిల్లలుగా మార్చడం తెలియదు. కానీ, మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా మా జాతికి తెలుసు.

నాపేరు "కాకి"నాకది మనుషులు పెట్టిన పేరు. "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఈ పేరు ఎందుకో పెట్టానో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది. నాకు నలుగురు పిల్లలు.

ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను.

పిల్లలెమో ఆకలి అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్ లో ఏమి దొరకని పరిస్థితి. ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. “మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా” అందుకే నా పిల్లలు తినడానికి ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను.

ఎదురు గాలికి ఎగర లేక రెక్కలు అలిసి పోతున్నాయి. ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి. వాన చినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను.

సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ. ముందు పచ్చడి, తరవాత కూర, ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ. మొత్తం నలుగురు. ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో మామిడి పచ్చడి ఉంది.

This is a crow story ఇది కాకి కథ..

“అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా” అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు.
వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ.
“ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను. తిండి పెట్టడమే ఎక్కువ. దేవుడు కొంత మందిని తీసుకు పోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత. అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు..
“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు. వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు. పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో..???

This is a crow story ఇది కాకి కథ..

పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వర త్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో. మొత్తానికి కలిపేసాడు. ఆత్రంగా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటా కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి. మొఖం ఎర్రగా మారిపోయింది. ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు. అయ్యో !! ఎంత దారుణం, పాపం పెద్దాయన.. వాళ్లు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి.

“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని నేను కొన్ని మెతుకులు తిని కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా. సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో ఎవరికో పిండం పెడుతున్నారు. కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను. ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన. ఒక్క క్షణం గుండె బరువెక్కింది. విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి.

This is a crow story ఇది కాకి కథ..

“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారి గారు చెప్పారు. ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ ఆ కంచాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం ఆకాశాన్నంటింది. నల్లటి నా మొఖం తెల్లబారిపొయింది.” ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి.

‘‘మీరేం మనుషులురా బాబు.. బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా?? పోవడం కోసం కోరికలు కోరుకొని, కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా?? బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా?? ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పు కోవడానికి కండవ కూడా ఇవ్వకుండా పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా.. ఛీ.. వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య. పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు. అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి, పొడిచి చంపాలి. ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా.. కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా?? ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి.. పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??’’

అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే గాల్లోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను. అందరూ సరే అన్నారు. గంట.. రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది.

“బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు.
“ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు.

“నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది. అలాగే ఉండిపోయాడు. కనీసం తల తిప్పుకోలేని పరిస్థితి. పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి. నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను.

(ఈ కథ రాసిన రచయిత ఎవరో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది)

Leave A Reply

Your email address will not be published.

Breaking