Header Top logo

Swaying in the air. Mangalagiri Air Tower గాలిలో గాలిగోపురం

Swaying in the air. Mangalagiri Air Tower

*గాలిలో ఊగుతున్న …. మంగళగిరి ‘గాలిగోపురం’..!!

దక్షిణాదిలోనే అత్యంత ఎత్తయిన గోపురాల్లో ఒకటైన మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం తూర్పు గాలి గోపురానికి ముప్పు వాటిల్లుతోంది.. పురాతనమైన ఈ గాలి గోపురంలో పగుళ్ళు కనిపిస్తున్నాయి.పరిస్థితి ప్రమాదం స్థాయికి చేరుకోవడంతో దేవాలయం, గోపురం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ‘మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి’  ఆలయం గోపురం గురించి  ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు. దక్షిణాదిలో ఎత్తైన గోపురాలలో ఇది రెండోది. మొత్తం 11అంతస్తులతో  నిటారుగా నిలబడి ఆకాశానికి  ఎగబాకుతున్నట్లుగా…… కనబడే ఈ గాలి గోపురం.. మంగళగిరికే  గర్వకారణం.

ఆ మాటకొస్తే..ఈ గాలిగోపురం… మంగళగిరి ఉనికిని తెలియజేస్తుంది. ఓ నాలుగు దశాబ్దాల  వెనక్కు వెళితే…అప్పట్లో  నేను విటిజెఎమ్ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాను. పనిలో  పనిగా ఈనాడు దినపత్రికకు  వార్తలు పంపేవాణ్ణి. ఓ రోజు గాలిగోపురం నుంచి కొన్ని పెచ్చులు రాలి కింద పడ్డాయి. ఈ  గాలిగోపురం పురాతనమైంది   కావడం వల్ల ఇలా జరిగి వుండొచ్చు.అయితే, ఈ విషయాన్ని మంగళగిరి జనం చాలా సీరియస్ గా తీసుకున్నారు. దేవాలయ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో గాలి గోపురానికి చిన్న చిన్న మరమ్మత్తు లు చేశారు. పెచ్చులుఊడిపోయిన చోటు సిమెంట్ తో ప్లాస్ట్రింగ్ చేయించారు.ఇంకా అవసరమైన పనులు కూడా చేయించారు. అప్పుడు నేను…. గాలిగోపురం గురించి ఓ వార్త రాసి, ఈనాడుకు పంపాను.గాలిగోపురం క్షీణించిపోతోందన్నది దాని సారాంశం…ఆ వార్త చదివిన ఈనాడు న్యూస్ ఎడిటర్ ” గాలిలో కదులుతున్న గాలి గోపురం”  అని హెడ్డింగ్ పెట్టాడు.తెల్లారే పేపర్ చూసిన జనం గాలిగోపురం వద్ద  గుమిగూడి,ఆందోళన వ్యక్తం చేశారు.

mangalagiri temple2

*హెరిటేజ్ విలువలకు తిలోదకాలు..!!

ప్రాచీన దేవాలయాలను వారసత్వ సంపద(Heritage)గా గుర్తించి,దాని అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు.. చిత్రమేమంటే… హెరిటేజ్ విషయం మరిచి గాలి గోపురానికి రంగులు వేయించారు. దానివల్ల గాలిగోపురం ఒరిజినాలిటీకి భంగం  కలిగింది. హెరిటేజ్ గుర్తింపుకు నోచుకోకుండా పోయింది. ఒక దశలో మంగళగిరి గాలి గోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలో కొత్తగా గోపురాన్ని నిర్మించాలన్న ఓ ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది.

*ఆంక్షలు….!! కొన్ని రోజులుగా గాలిగోపురంలో పగుళ్లు వచ్చి,కట్టుబడి రాళ్ళ మధ్య  ఖాళీలు యేర్పాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయ ప్రాకారము, తూర్పు రాజగోపురం బాగా దెబ్బతిన్నాయి. తూర్పు గాలి గోపురం నాణ్యత పై డ్రోన్ … సాయంతో అధికారులు పరిశీలించారు.ప్రత్యేకంగా డ్రోన్ కెమెరా  వినియోగించి నలువైపులా  ఎక్కడ లోపాలు ఉన్నాయో తేల్చారు. లక్ష్మీనృసింహస్వామివారి తూర్పు గాలిగోపురానికి అక్కడక్కడా పగుళ్లు ఏర్పడినట్లు స్పష్టమైంది. నెలరోజుల క్రితం ఆలయ ప్రహరీ దక్షిణ నైరుతి వైపు కొంతమేర కూలిపోయిన నేపథ్యంలో గాలిగోపుర పటిష్ఠత గురించిన చర్చ కూడా మొదలైంది. ఇలా గాలిగోపురం పరిస్థితి రాను రాను క్షీణించి, ప్రస్తుతం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో భద్రతదృష్ట్యా గుడిచుట్టూ తూర్పురాజ గోపురం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాడవీధుల్లో రద్దీలేకుండా చూస్తున్నారు.

mangalagiri temple

*మంగళగిరి వైభవానికి  నిలువెత్తు అద్దం…..!!

తెలుగు రాష్ట్రాల్లో  అత్యంత ఎత్తయిన గోపురం ఇది. దీని నిర్మాణం జరిగి రెండు శతాబ్దాలకాలం దాటింది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి,కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ అపూర్వ నిర్మాణమిది. దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు గారు నిర్మించారు.ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ప్రస్తుతం ఈ రాతి కట్టడానికి అన్ని వైపులా పగుళ్లు వచ్చాయి. పది సంవత్సరాల క్రితం ఐఐటి చెన్నై వారు పరిశీలించి, గోపురం పటిష్టతకుకొన్ని సూచనలతో ఓ నివేదిక కూడా ఇచ్చారు. కానీ ….దీనిపై ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాల్సిన అవసరముంది.

*ఎమ్మెల్యే ఆళ్ళ కృషి…!!

మంగళగిరి గోపురాన్ని తమ వారసత్వ సంపదగా భావిస్తుంటారు ఈ ప్రాంత ప్రజలు.వెలకట్టలేని ఈ ప్రాచీన సంపదను కాపాడుకోవాలి? నిలబెట్టుకోవాలి? అనే ఉద్దేశంతో దేవాలయ పరిరక్షణ, భద్రత కోసం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిపుణులను సంప్రదిస్తున్నారు.. అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఇక మరమ్మత్తులే తరువాయి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ద్వాపరయుగంలో ధర్మరాజు ప్రతిష్ట చేశారని స్థలషపురాణం చెబుతోంది. నాటి నుంచి భక్తుల కోర్కెలను తీర్చుతూ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ దేవాలయం. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి గారిచే నిర్మితమై,ప్రసిద్ధి గాంచిన  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నారసింహ స్వామివారి ఆలయ గాలిగోపురం ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక పద్దతుల ద్వారా, మరమ్మత్తులు చేసుకోవలసిన అవసరముందని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆర్కే.

*చారిత్రక ప్రాధాన్యం..!!

లక్ష్మీనరసింహస్వామి గుడిమీద (కొండ కింది గుడి)గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ శాసనం  లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేన మామ. ఈ 143 పంక్తుల చెక్కడంలో తిమ్మరాజయ్యఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు. ఈ శాసనం వివరాలు ఇలా ఉన్నాయి: “పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమలరాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని (10 కుంచాలు = 1 ఎకరం) గుడికి దానమిచ్చాడు. నంబూరు, తాళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం (రాంభొట్ల వారి పాలెం?), తాడికొండ, పెదకొండూరు, గొడవర్త్గి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల,గోళ్ళమూడిపాడు,నిడమర్రు, కురగల్లు,ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉంది.వారు సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉంది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారుచేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలనా కాలంలోచెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. 1807-09లో 11 అంతస్తుల్లో నరసింహస్వామి దేవాలయానికి ఈ గాలిగోపురాన్ని నిర్మించారు.

*శ్రీకరం..  శుభకరం..   మా మంగళగిరి కొండ !!

మబ్బులతో దోబూచులాడుతూకనబడే ఈ కొండ… మంగళగిరికొండ.వర్షాలు పడి ఆకుపచ్చగామారింది. ఈ కొండకింద పానకాలరాయుడు. కొండ పైన గండాలరాయుడు.మెట్లుదిగి కిందకొస్తేశివాలయం. ఇంకాస్త..‌ముందుకెళితే నరసింహస్వామి దేవాలయం ప్రవేశ ద్వారంపైనఎత్తెన గాలిగోపురం..దాని ముందు  పెద్దకోనేటి కొలను. ఈ కొండ గురించి జన శ్రుతిలో ఓ ఆసక్తికరమైన  కథ ప్రచారంలో వుంది. కొండనిండా భాస్వరం వుందట. భాస్వరానికి మండే గుణముంది.దీనివల్ల ఎప్పటికైనా ఈ కొండ పగిలే ప్రమాదంవుందట.అందుకే లోన వున్నభాస్వరం  మండకుండా చల్లార్చేందుకు బిలంలోపానకం పోస్తుంటారు.అంటే…పానకాల లక్ష్మీనరసింహ స్వామి నోట్లోపోసే పానకం కొండలోనికి పోయిభాస్వరాన్ని మండకుండా చల్లారుస్తుందని చెబుతుంటారు.

నైవేద్యంగా పానకం…!!

ఉగ్రనరసింహుడు రూపంలో ఇక్కడ  పానకాల రాయుడు స్వయంభూగా వెలిశాడని  స్థల పురాణం చెబుతోంది. యాలకులు, బెల్లం, మిరియాలు కలిపి తయారుచేసేతియ్యని పానకం ఉగ్రనరసింహునికి సాంత్వన చేకూరుస్తుందని స్థలపురాణం ప్రతీతి.

*అతి పొడవైన సొరంగ మార్గం…!! ఈ కొండలో వున్న సొరంగ మార్గం విజయవాడ కనకదుర్గ గుడిదాకా వుందని కొందరు,కాదు..ఉండవల్లి గుహల్ని కలుపుతుందని మరికొందరంటారు.మొత్తానిక ఈ కొండసొరంగమార్గాన్ని కనుగొనగలిగితే…ఎన్నో కొత్త రహస్యాలు బయటపడతాయి.

*గండాలరాయుడు…!! ప్రస్తుతం ఈ కొండ పైన  గండాల రాయుడి దేవాలయం వుంది. ఈయన్ను దర్శించుకుంటేగండాలన్నీ తొలిగిపోతాయని జనం చెప్పుకుంటూ ఉంటారు.అయితే ఈ గండాలరాయుడ్నిదర్శించుకోవాలంటే అనేక గండాలు దాటి వెళ్ళాలి. గండాలరాయుడి దర్శనం ఎంతో కష్టసాధ్యమైంది.సరైన దారి లేకపోవడంతో అక్కడి దాకా నడిచివెళ్ళడం కష్టంతో కూడుకున్న పని.మా చిన్నతనంలో తిరునాళ్ళు,. ముక్కోటి ఏకాదశి సందర్భాల్లో కాలిబాటన అతికష్టంమీద కొందరుసాహసికులు గండాలరాయుడి దగ్గరకు వెళతారు. ఇలా ఓ సారి నేను కూడా అక్కడికి వెళ్ళాను. కొండమీద విశాలంగా,చదును చేశారా? అన్నట్లుంది.అక్కడ నిల్చొని చూస్తే విజయవాడ,కృష్ణమ్మా కనిపిస్తాయి.ఇక మంగళగిరి అయితే బహు సుందరంగా కనిపిస్తుంది. ఆ మధ్యసెల్ టవర్ల కోసం ఓ కంపెనీ పక్కారోడ్డుమార్గాన్ని నిర్మించారు.అయితే దీనిపై నుంచి నడిచివెళ్ళడానికి ప్రత్యేక అనుమతికావాలట.తిరునాళ్ళు,ముక్కోటి ఏకాదశి నాడుమాత్రం సాయసంచేయగలిగితే ఎంచక్కా..ఈ కొండ ఎక్కొచ్చు.గండాలరాయుడ్ని దర్శించుకొని గండాల్ని తొలిగించుకోవచ్చు. మీకు సమయం దొరికితే మాత్రం పానకాలరాయుడ్ని, గండాలరాయుడ్ని దర్శించుకోవడం మిస్కాకండి!

Abdul Rajahussen Writer.

*ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking